రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైతాంగానికి ఆప్త మిత్రుడులా అండగా ఉంటోంది కూటమి ప్రభుత్వం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

రైతాంగానికి ఆప్త మిత్రుడులా అండగా ఉంటోంది కూటమి ప్రభుత్వం


  • రైతుల పేరుతో కుంభకోణాలు చేసింది వైసీపీ ప్రభుత్వం
  • ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టి వెళ్ళిపోయారు 
  • జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకోలేదు
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది జగన్ తీరు
  • కూటమి పాలన మొదలైన 10 నెలల్లో 48.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 
  • కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ 
  • ఇప్పటి వరకూ రూ.11 వేల కోట్లు జమ చేశాము 
  • ఈ వాస్తవాలను అంగీకరించలేని విచిత్ర పరిస్థితుల్లో జగన్ ఉన్నారు
  • 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్ల కు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం 
  • కాకినాడలో మీడియా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్‌    

‘రైతాంగ సమస్యలపై కనీస అవహనలేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఆయన హయాంలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్‌ గారు పేర్కొన్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి.. తన ఐదేళ్ల పాలనలో కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆదివారం సాయంత్రం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రైతుల పట్ల వైసీపీ అధినేత జగన్‌కు ఏనాడూ చిత్తశుద్ధి లేదు. ఆయన పాలనలో రైతులు అల్లాడిపోయారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో రాండమైజేషన్ పద్దతి తీసుకొచ్చి, సాఫ్ట్ వేర్ లో మోసం చేసి.. వైసీపీవాళ్ళకి నచ్చిన మిల్లర్లకే ధాన్యం అమ్మేలా చేశారు. అన్నదాతల నుంచి ధాన్యం కొలుగోలు చేసి, ఏనాడు సక్రమంగా వాళ్ల ఖాతాలో డబ్బులు జమ చేసింది పాపాన పోలేదు. కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు తప్పితే ... వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏనాడూ ఆలోచించలేదు.  

• ధాన్యం అమ్మి ఇంటికెళ్లేలోపు డబ్బులు జమ చేశాం 

జగన్ సర్కార్ రైతులకు రూ.1674 కోట్లు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని చెల్లించాం. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది రైతుల నుంచి 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే 48.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అంటే వైసీపీ కంటే 11 లక్షల మెట్నిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేశాం. మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాదాపు రూ.11 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు అప్పజెప్పి ఇంటికెళ్లేలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతుల కష్టానికి తక్షణ ఆర్థిక మద్దతు అందించాం.  

• మిల్లర్లు వారధిలా మారాలి  

మిల్లర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి బ్యాంకు గ్యారెంటీ ఇబ్బందులు తలెత్తకుండా, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేశాం. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ వెసులుబాటు కల్పించాం. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు వ్యవహరించాలి. ప్రభుత్వానికి, రైతాంగానికి మధ్య వారధిలా మారాలి. అంతే తప్ప మబ్బులు పట్టాయని హడావుడి చేసి, ప్రభుత్వం ఇచ్చిన గోతాలు రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మిల్లర్లను అవమానించదు. కించపరిచే పనులు చేయదు. రైతులకు అండగా నిలబడితే మీతోపాటు కలిసి నడుస్తాం. ఎటువంటి సమస్య తలెత్తినా క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమయితే ఉభయగోదావరి జిల్లాలో మరో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కోనసీమలో 97,400 మెట్నిక్ టన్నులు, కాకినాడ జిల్లాలో 57,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. 

• కచ్చితమైన ఆదేశాలిచ్చాం 

గత రెండు, మూడు రోజులుగా అకాల వర్షాల పడడంతో ధాన్యం తడిసిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాం. తక్షణమే రైతులకు గోతాలు అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించాం. అలాగే తడిసిన ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటాం. 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. తేమ శాతం పేరిట మోసం జరుగుతోందని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి తేమ శాతం పరీక్షించే యంత్రాలు ఒకే కంపెనీ నుంచి తీసుకుంటాం. రైతు సహాయక కేంద్రాల వద్ద ఏ కంపెనీ పరికరాలయితే పెడతామో... అవే పరికరాలు మిల్లర్లు దగ్గర ఉంచుతాం. దీంతో తేమ శాతం విషయంలో రైతులు ఎక్కడా మోసపోకుండా ఉంటారు” అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు  పంతం నానాజీ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌  తోట సుధీర్, కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్  తుమ్మల రామస్వామి, పార్టీ నాయకులు  తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.

Comments

-Advertisement-