వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
- జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదు
- సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మే 06 :
వర్షాల వేళ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఏపీ విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలని, వర్షాల వేళ అందరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఉరుములు, పిడుగుపాటు సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు :
చేయవలసినవి..:
వాతావరణ సూచనలను గమనించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు బయట పనులు, కార్యక్రమాలు వీలైనంత వరకు ఆపుకోవలెను.
పొలాల్లో పనిచేసే రైతులు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశుకాపరులు, గొర్రెల కాపరులు, సురక్షితమైన భవనాలలోకి వెళ్ళాలి.
బహిరంగ ప్రదేశాలలో ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. లేకుంటే రబ్బరు చెప్పులను ధరించి చెవులను మూసుకొని మోకాలిపై కూర్చోవాలి.
ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తర్వాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి.
పిడుగు భాదితుడిని సత్వరమే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
చేయకూడనివి :
- ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల క్రింద, చెట్ల సమీపంలో, టవర్లు, చెరువుల దగ్గర ఉండరాదు.
- బహిరంగ ప్రదేశాలలో ఉన్న షెడ్లు, ఇంటి పైన ఇతర చిన్న నిర్మాణాలలో ఉండరాదు.
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు, చార్జ్డ్ ఫోన్లు/మొబైల్స్ వినియోగించరాదు.
- పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులను కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు.
- మోటరు సైకిళ్ళు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, ట్రాన్స్ ఫార్మర్స్ కు వ్రేలాడుతున్న విద్యుత్ తీగలకు మరియు ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి.