రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదు

Mounikadesk

ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదు 


సామాజిక న్యాయం, సమాన అవకాశాలతో తెలంగాణను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోనని, అందుకు అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

జహీరాబాద్‌ నిమ్జ్ కోసం భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఆదేశాలిచ్చారు.

గత పదేళ్ల కాలంలో జహీరాబాద్ నిమ్జ్ పూర్తిగా కుంటుపడిందని చెబుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి భూ సేకరణను వేగవంతం చేశామన్నారు. హ్యూందయ్ సంస్థ త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనుందన్న శుభవార్తను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలిపారు.

రైతులంతా కలిసి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నడిపిస్తామంటే చెక్కర కర్మాగారం ఏర్పాటుకు నిమ్జ్‌లో వంద ఎకరాలు కేటాయించి అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు.

జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. ఆ తర్వాత అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని పనిచేస్తామని, అభివృద్ధి, రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో ఎన్నిసార్లయినా ప్రధానమంత్రి మోదీ గారిని కలుస్తానని పునరుద్ఘాటించారు.

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ  మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ చేసిన అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ జిల్లాతో ఉన్న విడదీయలేని అనుబంధాన్ని వివరించారు. ఇందిరాగాంధీ  స్ఫూర్తితో ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు.

ప్రభుత్వం రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని.. రుణ విముక్తులను చేయడానికి రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసాను 10 నుంచి 12 వేలకు పెంపు, మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లింపు, భూమిలేని వ్యవసాయ నిరుపేదలకు 12 వేల చొప్పున సహాయం అందిస్తున్న విషయాలను ముఖ్యమంత్రి గారు వివరించారు.

మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరంగా తెలియజేశారు. వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్ధేశించుకున్న కార్యక్రమాలను విశదీకరించారు.

జహీరాబాద్ పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి గారు స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన పెట్రోల్ పంపును ప్రారంభించారు. అక్కడే మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి ఉత్పత్తులను పరిశీలించారు. 

సభా వేదికగా సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద రూ. 126.54 కోట్లు, మెప్మా కింద 17.51 కోట్లకు సంబంధించి చెక్కును అందజేశారు. జిల్లాలో రూ. 494.67 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు లోక్‌సభ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-