రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు
రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు
• మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తాము.
• పాత ఫిర్యాదుల్లో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము.
• సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవు
• మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నూతనంగా వెబ్ సైట్ ను రూపొందించనున్నాము.
• రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తెస్తాము.
- డాక్టర్. రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ . రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా . రాయపాటి శైలజ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గత ఐదేళ్లలో మహిళా కమిషన్ లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదుల దుమ్ముదులిపి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. అవసరమైత జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్ట్ లు పెడుతున్నారని, వారు తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని . రాయపాటి శైలజ హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మహిళలపట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దీంతో ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం మాకు అందిన వెంటనే పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్ సైట్ రూపొందించనున్నామన్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలసుకునే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ మరియు వివిధ నాయకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఛైర్ పర్సన్ . రాయపాటి శైలజ ను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపార, విద్యా వేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివ నాగమల్లేశ్వరరావు, బంధువులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తదితరులు అభినందించారు.