ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో కృష్ణా, విజయనగరం, ప్రకాశం జిల్లాలు ముందంజ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో కృష్ణా, విజయనగరం, ప్రకాశం జిల్లాలు ముందంజ
- వెనుకబడ్డ రాయలసీమ- అట్టడుగున అనంతపురం జిల్లా
- జిల్లా వైద్యాధికారుల పనితీరుపై ఆరోగ్య శాఖా మంత్రి అసంతృప్తి
- జిల్లా కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆదేశం
- పర్యవేక్షణ, పనితీరు మెరుగుపర్చడానికి స్పష్టమైన నిర్దేశాలు
- ప్రభుత్వ ఆరోగ్య పధకాల అమలుపై మంత్రి సుదీర్ఘ సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వివిధ ఆరోగ్య సేవలు, పధకాలు అమలవుతున్న తీరుపై ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంగళవారం నాడు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. జిల్లాల వారీగా అమలు తీరును సోదాహరణంగా వెల్లడించి ర్యాంకులను ప్రకటించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు వివిధ పధకాల అమలును పర్యవేక్షించే జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు(డిఎంహెచ్వోలు) మరియు జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలు(డిసిహెచ్‌యస్‌లు) పనితీరుపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేసి వారు జవాబుదారీ తనంతో పనిచేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా వైద్యాధికారుల కార్యాలయాలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, అవినీతిని అడ్డుకట్ట వేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు (డీఎంహెచ్‌వోలు), జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తల (డీసీహెచ్ఎస్‌లు)తో మంగళవారం నాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయం నుండి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఇతర విభాగాధిపతులు సమీక్షా సమావేశంలో పాల్గొనగా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
జిల్లాలవారీ పనితీరు
అంతర్గత మదింపు ప్రకారం జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్‌సిలు) మరియు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే పట్టణ పిహెచ్‌సిల పనితీరును మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలోనూ, విజయనగరం మరియు ప్రకాశం జిల్లాలు ఆ తరువాతి స్థానంలోనూ ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా పనితీరులో అట్టడుగు స్థానంలో ఉండగా, మిగిలిన 3 రాయలసీమ జిల్లాలు క్రింది స్థానాల్లో ఉండడంపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆందోళన వెలిబుచ్చారు. ఆయా జిల్లాల పనితీరుకు సంబంధించి జిల్లా వైద్యాధికారుల నుంచి వివరణ అడిగారు. ఈ పరిస్థితిని మెరుగుపర్చడానికి తగు చర్యల్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో వెనుకబడడంతో పాటు రాయలసీమలోని సెకండరీ ఆసుపత్రుల పనితీరుపై కూడా మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాల్లో 7 జిల్లాలు 10 శాతం(అనంతపురం, కర్నూలు)నుంచి 24 శాతం( తిరుపతి జిల్లా) మేరకే శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో మాత్రం 42 శాతం మేరకు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో కూడా రాయలసీమ ప్రాంతంలోని ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రుల తీరు మెరుగుపడాలని మంత్రి సూచించారు.
దీంతోపాటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల వినియోగంలో రాయలసీమ జిల్లాల్లోని సెకండరీ ఆసుపత్రులు బాగా వెనుకబడడంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్సార్ జిల్లాలోని సెకండరీ ఆసుపత్రులు చేసిన సర్జరీల్లో కేవలం 3 శాతమే ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదయ్యాయి. మొత్తమ్మీద రాయలసీమ జిల్లాల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గరిష్టంగా 25 శాతం చికిత్సలు మాత్రమే నమోదవడం ఆందోళనకరమని, ఈ విషయంలో కనీసం 30 శాతం శస్త్ర చికిత్సలు ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదు చేయడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
జిల్లా వైద్యాధికారుల పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు
అవినీతిని అడ్డుకునేందుకు నిర్ణయాలు
జిల్లా వైద్యాధికారుల పనితీరుపై ఆరోగ్య రంగంలో ఆయా జిల్లాల ప్రగతి ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడానికి సమీక్షా సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం మంత్రి కొన్ని నిర్ణయాల్ని ప్రకటించారు. వీరి పనితీరుపై పర్యవేక్షణాలోపం, పనితీరు అంచనా మరియు రిపోర్టింగ్‌లో ఉన్న లోపాల్ని మంత్రి ఎత్తి చూపారు. జిల్లా వైద్యాధికారుల కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయని వస్తున్న వార్తలు, ప్రజాభిప్రాయంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆశించిన మేరకు పరిపాలనా అనుభవం లేని జిల్లా వైద్యాధికారులు కింది స్థాయి పాలనా సిబ్బందిపై ఆధారపడడంతో పలు అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో జరిగే నియామకాలు కేవలం ప్రతిభ ఆధారంగా జరగాల్సి ఉన్నా ఉద్యోగాలిప్పిస్తామంటూ జిల్లా కార్యాలయాల్లో అభ్యర్ధుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టేందుకు ఆయా జిల్లా వైద్యాధికారులు నియామక సమయాల్లో ప్రతిభ ఆధారిత ఎంపిక విషయాన్ని వెల్లడిస్తూ, అభ్యర్ధులెవరూ దళారుల బారిన పడొద్దని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లా అధికారుల పాలనా సామర్ధ్యాన్ని పెంచి కింది స్థాయి సిబ్బందిపై ఆధారపడకుండా చేసేందుకు తగు శిక్షణా కార్యక్రమాల్ని చేపట్టాలని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్ణయించారు. జిల్లా కార్యాలయాల్లో కింది పాలనా సిబ్బంది దీర్ఘ కాలంపాటు పనిచేయడం వల్ల అక్రమాలకు తావిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు వారిని మూడేళ్లకోసారి బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. వైద్యాధికారులు, పాలనా సిబ్బంది వ్యవహార శైలికి సంబంధించి పలు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించుకుని అక్రమార్కులపై ముందస్తు చర్యలు చేపట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని సంబంధిత ఉన్నతాధికారుల్ని మంత్రి ఆదేశించారు.
జిల్లా వైద్యాధికారులు, పాలనా సిబ్బందిలో ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుంటారన్న భయం లేకుండా పోయిందని, ఈ పరిస్థితిలో తగు మార్పు తేవడానికి మంత్రిత్వ శాఖలోని సంబంధిత ఉన్నతాధికారులు అవసరాల మేరకు తక్షణమే స్పందించి, తగు చర్యలు చేపట్టి , అక్రమాలకు వ్యతిరేకంగా సరైన సందేశాన్నివ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
జవాబుదారీ తనంతో జిల్లా వైద్యాధికారులు పనిచేసేందుకు ఏడాదికి రెండు సార్లు వారి పనితీరును మదింపు చేసి...పనితీరు బాగోలేదు, బాగుంది, చాలా బాగుంది అని గ్రేడ్లు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ప్రతి అధికారి తమ పరిధిలో ఉన్న ప్రతి సెంకడరీ ఆసుపత్రిని నిర్దిష్ట కాలపరిమితిలో సందర్సించి అక్కడి లోటుపాట్లపై నివేదికలు సమర్పించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. వారి క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించి వాటి ద్వారా ప్రయోజనకరమైన నివేదికలు ఉన్నతాధికారులకొచ్చేలా చూడాలని మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లా వైద్యాధికారుల పనితీరుపై క్రమం తప్పకుండా తనకు నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నా ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక వార్తల ద్వారా నష్టం జరుగుతోందని, సానుకూల ప్రజాభిప్రాయం కోసం వివిధ ఆసుపత్రులు చేస్తున్న సేవల వివరాలను, విశిష్టతను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలకు సంబంధించి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
