డీఎస్సీ అర్హతకు మార్కుల 'గండం'
డీఎస్సీ అర్హతకు మార్కుల 'గండం'
- డిగ్రీలో 50 శాతం ఉండాలని నిబంధన
- బీఈడీ జనరల్ అభ్యర్థుల ఆవేదన
- 2011 కంటే ముందు బీఈడీ విద్యార్థులకు ఎన్‌సీటీఈ 'మార్కు'ల మినహాయింపు
- సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు
- ఏపీ డీఎస్సీలో అమలుకాని ఆ సడలింపు
- తెలంగాణలో జనరల్‌కు 45 శాతమే
చాలా కాలంగా ఎదురు చూసిన మెగా డీఎస్సీ వచ్చేసింది. 16,347 పోస్టులు ప్రకటించడంతో అభ్యర్థులు సంబరపడ్డారు. అయితే డీఎస్సీ అర్హతకు '50 శాతం' మార్కుల నిబంధన పెట్టడంతో బీఈడీ జనరల్ అభ్యర్థులు ఉస్సూరుమంటున్నారు. 2011 కంటే ముందు బీఈడీలో చేరిన వారికి డిగ్రీ మార్కుల నిబంధన వర్తించదన్న ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ఇతర జనరల్ అభ్యర్థులకు తెలంగాణలో మాదిరిగా అర్హత మార్కులను 45 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
డీఎస్సీకి అర్హత విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని బీఈడీ జనరల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 జూలై 29 కంటే ముందు బీఈడీలో చేరిన వారికి డిగ్రీ మార్కుల విషయంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) మినహాయింపు ఇచ్చిందని చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో 50 శాతం మార్కుల విధానం అమలు చేయడాన్ని తప్పు పడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు అర్హతకు ప్రామాణికంగా తీసుకున్నారు. ఏపీలో మరో 5 శాతం అదనంగా మార్కులు ఉండాలని పాఠశాల విద్యా శాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలా అన్నివిధాలా తమకు అన్యాయం జరుగుతోందని జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టెట్‌లో 40 శాతం డిగ్రీ మార్కులతో అర్హత కల్పించినందున డీఎస్సీలోనూ అదే విధానం పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఇటీవల నోటిఫికేషన్‌ను సవరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కుల(అర్హత)ను 40 శాతానికి తగ్గించారు. అంతకుముందు జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధన ఉండేది. తాజాగా తమకు మార్కుల శాతం తగ్గించలేదని, 10 శాతం వ్యత్యాసం ఉందని, తమకు కూడా న్యాయం చేయాలని జనరల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
మినహాయింపు అందరికీ ఏదీ?
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45శాతం డిగ్రీ మార్కులు ఉండాలని ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 2024లో నిర్వహించిన టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40శాతం మార్కులున్నా అర్హత కల్పించారు. దీంతో 40శాతం డిగ్రీ మార్కులున్న వారు కూడా టెట్ రాసి అర్హత సాధించారు. వారికి ఇప్పుడు డీఎస్సీలో 45శాతం మార్కులు ఉండాలనే నిబంధన విధించడంతో వ్యతిరేకత వచ్చింది. డీఎస్సీ అర్హతకు 45శాతం మార్కులు తప్పనిసరి అయితే, 40శాతం మార్కులున్న వారిని టెట్‌కు ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40శాతం మార్కులు ఉంటే చాలంటూ ఇటీవల నోటిఫికేషన్‌లో సవరణ చేశారు. తమకు కూడా తగ్గిస్తారని, రెండు కేటగిరీల మధ్య 5శాతం మార్కుల వ్యత్యాసాన్ని కొనసాగిస్తారని జనరల్ అభ్యర్థులు ఆశించారు. కానీ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేయకపోవడంతో జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
ఆ మార్గదర్శకాలు వర్తించవా?
ఎన్‌సీటీఈ మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. వాటి ప్రకారం జనరల్ అభ్యర్థులకు 50శాతం, మిగిలిన వారికి 45శాతం మార్కులు డిగ్రీలో తప్పనిసరిగా ఉండాలి. ఇదే విషయంలో కొందరు అభ్యర్థులు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో 2019లో ఎన్‌సీటీఈ కొన్ని మార్పులు చేసింది. 2011 జూలై 29 కంటే ముందు బీఈడీలో అడ్మిషన్ పొందిన వారికి డీఎస్సీ అర్హతకు డిగ్రీ మార్కులతో సంబంధం లేదని, ఉత్తీర్ణులైతే చాలని స్పష్టం చేసింది. కానీ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ మేరకు సడలింపు ఇవ్వలేదని, తమకు అవకాశం కల్పించాలని జనరల్ అభ్యర్థులు కోరుతున్నారు.