రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

GOLD BONDS: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్ భారీ రిటర్న్స్

RBI Sovereign Gold Bonds Gold Bonds Redemption Series 1 Gold Bonds Gold Price Investment Maturity Date Return on Investment Triple Returns India
Mounikadesk

GOLD BONDS: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్ భారీ రిటర్న్స్

• 2017 మేలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తేదీ మే 9గా ఆర్బీఐ ప్రకటన..

• గ్రాము బంగారం రెడింప్షన్ ధర రూ. 9,486గా నిర్ణయం..

• ఎనిమిదేళ్ల క్రితం రూ. 2,951కి కొన్న బాండ్లపై దాదాపు మూడు రెట్ల లాభం..

• ఏటా 2.5 శాతం వడ్డీ అదనం, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు..

సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి, ముఖ్యంగా ఎనిమిదేళ్ల క్రితం ఈ పథకంలో చేరిన వారికి ఊహించని లాభాలు చేకూరనున్నాయి. 2017 మే నెలలో జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్ల సిరీస్ మెచ్యూరిటీకి చేరుకోవడంతో, ఆర్బీఐ వాటి రిడెంప్షన్ ధరను, తేదీని తాజాగా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుత బంగారం ధరల ప్రకారం దాదాపు మూడు రెట్ల రాబడి, అదనంగా వడ్డీ లభించనుంది.

దేశంలో భౌతిక బంగారంపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. ఇందులో భాగంగా, 2017 మే నెలలో 2017-18లో సిరీస్ 1 బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. ఆ సమయంలో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధరను రూ. 2,951 గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గ్రాముపై రూ. 50 తగ్గింపు కూడా లభించింది.

సిరీస్ 1 బాండ్ల మెచ్యూరిటీ తేదీ

తాజాగా, ఈ బాండ్ల మెచ్యూరిటీ తేదీని 2025 మే 9గా ఆర్‌బీఐ ఖరారు చేసింది. అంతేకాకుండా, మెచ్యూరిటీ సమయంలో చెల్లించే ధరను గ్రాముకు రూ. 9,486గా నిర్ణయించినట్లు ప్రకటించింది. దీని ప్రకారం, అప్పట్లో సుమారు లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు దాదాపు రూ. 3 లక్షలు అందుకుంటారు. ఇది కేవలం అసలుపై వచ్చిన లాభం మాత్రమే. దీనికి అదనంగా, ఈ బాండ్లపై ఏటా 2.5 శాతం చొప్పున వడ్డీని కూడా ఆర్బీఐ చెల్లిస్తూ వస్తోంది. ఈ వడ్డీ మొత్తం కూడా మదుపర్లకు అదనపు ఆదాయంగా లభిస్తుంది.

మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజుల సగటుతో ధర నిర్ణయం

సావరిన్ గోల్డ్ బాండ్ల రెడింప్షన్ ధరను నిర్ణయించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తారు. బాండ్ల మెచ్యూరిటీ తేదీకి ముందు వారంలో (ఈ సందర్భంలో ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు) 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరల సగటును పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) ప్రకటించిన అధికారిక ధరల ఆధారంగా ఈ సగటును లెక్కిస్తారు. ఈ పద్ధతిలోనే ప్రస్తుత విమోచన ధరను గ్రాముకు రూ. 9,486గా నిర్ణయించారు.

ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన తరుణంలో ఈ బాండ్ల మెచ్యూరిటీ రావడం మదుపర్లకు గొప్ప అవకాశంగా మారింది. విశేషమేమిటంటే, ఈ బాండ్ల మెచ్యూరిటీ ద్వారా పొందే మొత్తం లాభంపై ఎటువంటి మూలధన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.



Comments

-Advertisement-