రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Sachin Dahayat: ఓ క్లర్క్‌ భారీ స్కాం.. ఎవరూ నమ్మలేని నిజాలు

Sachin Dahayat Madhya Pradesh scam Seoni district snake bite scam government funds misuse fraudulent claims compensation fraud Kiolari Tehsil office r
Mounikadesk

Sachin Dahayat: ఓ క్లర్క్‌ భారీ స్కాం.. ఎవరూ నమ్మలేని నిజాలు 


మధ్యప్రదేశ్‌ సియోని జిల్లాలో పాముకాటు పరిహారంలో భారీ కుంభకోణం..

47 మరణాలకు గాను 280 సార్లు నకిలీ క్లెయిమ్‌లతో నిధుల స్వాహా..

ఒక్క మహిళ పేరుతోనే 29 సార్లు రూ.4 లక్షల చొప్పున డ్రా..

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు కొందరు అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కారు. పాముకాటు, నీట మునక వంటి ప్రకృతి వైపరీత్యాల మృతుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని దక్కించుకునేందుకు ఏకంగా చనిపోయిన వారిని మళ్లీ మళ్లీ చంపేశారు. ఈ 'పాముకాటు కుంభకోణం' ద్వారా సుమారు రూ.11.26 కోట్లు దుర్వినియోగం అయినట్లు రెవెన్యూ మరియు అకౌంట్స్ విభాగం దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ అక్రమాలకు పాల్పడిన 37 మందిని నిందితులుగా గుర్తించగా, ఇప్పటికే 20 మందిని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే... సియోని జిల్లాలో జరిగిన ఈ భారీ స్కామ్‌లో అక్రమార్కుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉదాహరణకు, ద్వారకా బాయి అనే మహిళ పాముకాటుతో మరణించగా, ఆమె పేరు మీద ఏకంగా 29 సార్లు మరణించినట్లు రికార్డులు సృష్టించారు. ప్రతిసారి రూ. 4 లక్షల చొప్పున ప్రభుత్వ సహాయాన్ని కాజేశారు. ఈ ఒక్క మహిళ పేరు మీదే రూ. 1 కోటి 16 లక్షలు కొల్లగొట్టడం గమనార్హం. ఇదే తరహాలో, శ్రీరామ్ అనే వ్యక్తి 28 సార్లు మరణించినట్లు నకిలీ పత్రాలు సమర్పించి నిధులు దండుకున్నారు. ఇలా వాస్తవంగా 47 మంది మరణిస్తే, వారి పేర్లతో పాటు ఇతరుల పేర్లతో కలిపి మొత్తం 280 సార్లు మరణించినట్లు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేశారు.

ఈ నిధుల దుర్వినియోగం 2019 నుంచి 2022 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 2022లో నిర్వహించిన రెవెన్యూ ఆడిట్‌లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పాముకాటు, నీటిలో మునిగి మరణించడం, పిడుగుపాటు వంటి ఘటనలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుండగా, దీనిని ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారు. "దర్యాప్తులో మొత్తం రూ.11 కోట్ల 26 లక్షలు దుర్వినియోగం అయినట్లు, ఈ మొత్తాన్ని 47 మంది ఖాతాలకు బదిలీ చేసినట్లు కనుగొన్నాం. నకిలీ పత్రాలను ఉపయోగించి ఎవరి పేర్లపై ఈ మొత్తాలు పొందారో, వారు నిజంగా బతికి ఉన్నారా లేదా చనిపోయారా అనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. పోస్టుమార్టం నివేదికలు, మరణ ధృవీకరణ పత్రాలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు" అని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారి రోహిత్ సింగ్ కౌశల్ తెలిపారు. ఈ వ్యవహారంపై సియోని కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు ఆయన వివరించారు.

కియోలారి తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న సచిన్ దహాయత్ ఈ మొత్తం కుంభకోణంలో కీలక సూత్రధారి అని తేలింది. పాముకాటు, నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు వల్ల మరణించిన వారి సంఖ్యను తప్పుగా చూపించి, 280 మంది పేరిట మంజూరైన పరిహార మొత్తాన్ని తన బంధువులు, పరిచయస్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. దహాయత్‌ను ఇప్పటికే సర్వీసు నుంచి తొలగించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు తహసీల్దార్లపై కూడా చర్యలు తీసుకోవాలని దర్యాప్తు నివేదిక సిఫారసు చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Comments

-Advertisement-