పేదలందరికీ సకల సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు కట్టిస్తాం
పేదలందరికీ సకల సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు కట్టిస్తాం
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని గృహ నిర్మాణ లేవుట్ల పరిశీలన, లబ్ధిదారులతో మాటామంతి
విశాఖపట్టణం, జూన్ 27 : రాష్ట్రంలోని పేదలందరికీ సకల సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఎన్.టి.ఆర్. కాలనీల్లోని పెండింగ్ పనులను అతి త్వరలోనే పూర్తి చేసి ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పైడివాడ అగ్రహారం గృహ నిర్మాణ లేఅవుట్లను స్థానిక ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ బాబులతో కలిసి ఆయన సందర్శించారు. నిర్మాణాల కోసం అందుబాటులో ఉంచిన ఇనుము, ఇసుక, ఇతర ముడిసరుకులను, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఆయా లేఅవుట్లలో ఉన్న తాజా పరిస్థితిని పరిశీలించి అక్కడి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లేవుట్ల పరిధిలో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఆ లోపాలను సరిదిద్ది నాణ్యమైన రీతిలో ఇళ్లను నిర్మించి పేదలందరికీ అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకొని సొంతిటి కళను నెరవేర్చుకోవాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిందని, ఆ మేరకు ప్రస్తుతం అందిస్తున్న నగదుకు అదనం బీసీ, ఎస్సీలకు రూ.50,000, మైదాన ప్రాంత ఎస్టీలకు రూ.75వేలు, గిరిజన ప్రాంతాల్లో ఉండే ఎస్టీలకు రూ.1లక్ష అదనపు సాయం అందిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతం వారికి 2 సెంట్లు స్థలం ఇస్తామని పేర్కొన్నారు. ఎన్.టి.ఆర్. కాలనీలకు సమీపంలో దుకాణ సముదాయాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల ఆర్థిక శక్తి పెరిగేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
నాణ్యతకు పెద్దపీట వేస్తాం... సకల సౌకర్యాలు కల్పిస్తాం..
ఆనందపురం మండలం గిడిజాల, సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లేఅవుట్లను చూసిన మంత్రి పెద్దపెద్ద లేఅవుట్లు వేశారు గానీ, మౌలిక వసతుల విషయంలో ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టలేకపోయారని అభిప్రాయపడ్డారు. జలజీవన్ మిషన్, అమృత్ పథకాలను సరిగా గత పాలకులు వినియోగించుకోలేకపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ వల్ల ఆ పథకాలను గడువును కేంద్రం పెంచిందని గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రతి ఎన్.టి.ఆర్. కాలనీకి అతి త్వరలోనే తాగునీటి సదుపాయం కల్పిస్తామని, రెండు మూడు నెలల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. నాణ్యమైన వస్తువులను, ముడి సరకులను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. పేదలు పదికాలాల పాటు ఉండేలా నివాసయోగ్యమైన రీతిలో ఇళ్లు కట్టి ఇస్తామని ఉద్ఘాటించారు. వీలైనంత త్వరలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. తాత్కాలికంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ నుంచి సహకారం తీసుకొని విద్యుత్, తాగునీటి వసతి కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు అంకురార్పణ పలికామని, రూ.2.50 లక్షలు అందించామని గుర్తు చేశారు. ఎస్సీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గిడిజాలలో 45.76 ఎకరాల్లో 2,098 ప్లాట్లు వేశామని, 1869 మంది లబ్ధిదారులకు మంజూరు చేశామని వివరించారు. పైడివాడ అగ్రహారంలో 320.83 ఎకరాల్లో వేసిన లేఅవుట్ లో 10,228 ప్లాట్లు ఉన్నాయని, 8925 మందికి ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. రాజకీయ పరమైన విభేదాలకు తావు లేకుండా గృహనిర్మాణ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.
అవకతవకలపై లోతైన విచారణ జరిపిస్తాం...
గృహ నిర్మాణ లేఅవుట్లలో, ఇళ్ల నిర్మాణాల విషయంలో జరిగిన అవకతవకలపై లోతైన విచారణ చేయిస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గిడిజాల, పైడివాడ అగ్రహారం లేఅవుట్ల సందర్శనలో స్థానిక నేతలు, ప్రజలు కొన్ని సమ్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఆయన తప్పు చేసిన వారిని విడిచిపెట్టబోమని పేర్కొన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయని గుత్తేదార్లను అవసరమైతే తొలగిస్తామని చెప్పారు. అనర్హులు ఉంటే వారిని కూడా తొలగిస్తామని, అర్హులైన వారికి తిరిగి మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఆయా లేఅవుట్లలో ఇంకా ప్లాట్లు మిగిలి ఉన్నాయని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా.. అర్హత ఉండి ఇల్లు రానివారు ఉంటే వారికి ఇవ్వాలని అధికారులకు సూచించారు. గిడిజాల, పైడివాడ అగ్రహారంలో అక్కడి స్థానికులు మంత్రితో మాట్లాడుతూ ఇక్కడ విశాఖ నగరానికి చెందిన వారికే ఇళ్లు మంజూరు చేశారని, స్థానికులమైన మాకు ఇవ్వలేదని చెప్పగా మంత్రి సానుకూలంగా స్పందించారు. పీఎంఏవైలో భాగంగా ఇళ్లు రానివారిని గుర్తించి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చేసే పనిలో చిత్తశుద్ధి గతంలో లోపించిందని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాదని పేర్కొన్నారు.
సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నాం...
67.50 కోట్ల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని, పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచామని, రూ.మూడు నుంచి నాలుగు వేలకు పెంచి 65 లక్షల మందికి ఇస్తున్నామని మంత్రి పార్థసారధి వెల్లడించారు. పేదల సంక్షేమం, యువత ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, ఆయన వల్ల రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే కొంతమంది గిట్టని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షంపై మంత్రి పరోక్షంగా విమర్శలు సంధించారు.
@భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు మాట్లాడుతూ త్వరితగతిన మౌలిక వసతులు కల్పించాలని, అదనపు ఆర్థిక సాయం మంజూరు చేసి పండగ వాతావరణంలో ఇళ్లను ప్రారంభించేందుకు సహకరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మిగిలిన సైట్లను స్థానిక ప్రజలకు కేటాయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రెండు చోట్లా మంత్రి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గృహ నిర్మాణ లేఅవుట్ల సందర్శనలో మంత్రితో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఏపీ గ్రోవర్స్, ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జీ, ఇతర ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు, ఈఈలు, సమాచార పౌర సంబంధాల శాఖ జేడీ వి. మణిరామ్, డీడీ కె. సదారావు, ఇతర అధికారులు ఉన్నారు.