మహిళా ఎంటర్ ప్రెన్యూర్ లుగా వీర్ నారీ మహిణులు
మహిళా ఎంటర్ ప్రెన్యూర్ లుగా వీర్ నారీ మహిణులు
• దేశ రక్షణలో సైనికుల సేవలు మరువలేం
• వీర్ నారీ మణుల కుటుంబాలకు వీర రత్న ఫౌండేషన్ సేవలు
- వి. వెంకటరెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్ మెంట్
కర్ణాటక రాష్ట్రంలో దేశ రక్షణలో సైనిక కల్నల్ చనిపోవటం స్ఫూర్తిగా తీసుకొని వారి కుటుంబాలకు ఆదరణ కల్పించేందుకు వీర రత్న ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వీర్ నారీ మణులను చైతన్యవంతులను చేసే అవగాహన కార్యక్రమాన్ని కర్ణాటకకు చెందిన వీర రత్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో, గ్రాండ్ మినర్వ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకటరెడ్డి వీర్ నారీ మణులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ రక్షణలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలే వీర్ నారీ మణులు అని వారిలో చైతన్యం తీసుకురావడంతోపాటు వారి కుటుంబాలకు మేమున్నామని ఆదరణ కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు కావాల్సిన వనరలను అందించి, వారి కుటుంబాల్లోని వీర్ నారీ మణులను మహిళా ఎంటర్ ప్రెన్యూర్ లుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు ఆసరాగా నిలచేందుకు వీర రత్న ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సంస్థ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతోపాటు ఆంధ్రపదేశ్ లోను వారి సేవలను విస్తరించే విధంగా వీర్ నారీ మణులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
దేశ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకుంటూ వారు ఏ విధంగా ఆర్థికంగా, కుటుంబ పరంగా ముందుకు వెళ్లాలో సలహాలు సూచనలు ఇస్తూ వారిని మరింత దృడంగా తయారు చేయడమే లక్ష్యంగా సైనిక సంక్షేమ కార్యాలయం పనిచేస్తుందన్నారు.
ఆంధ్రపదేశ్ లో కూడా ఈ ఫౌండేషన్ యొక్క సేవలు వీర్ నారీ మహిళలకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సహకారాన్ని అందిస్తుండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 లక్షల వరకు పెంచడం అభినందించదగిన విషయం అన్నారు. అంతేకాకుండా 300 గజాల ఇళ్ల స్థలం, రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించామని, పెండింగ్ కేసులు ఏమీ లేవన్నారు. సైనికుల పిల్లల చదువు, ఆరోగ్యం మరియు ఇతర విషయాల్లో సహాయ, సహాకారాలు అందిస్తున్నామన్నారు. ఇటీవల నాబర్డ్ తో కలిసి మేనేజ్ అనే ప్రోగ్రాం ద్వారా నారీమణులకు వివిధ కోర్సుల్లో శిక్షణను అందిస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారు ఆసక్తి మరియు నైపుణ్యాలతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారన్నారు. దేశ రక్షణలో అమరులైన కుటుంబాలకు నుంచి మహిళా పోలీసులుగా 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వీర్ నారీ మణులకు అవకాశాలు కల్పించారన్నారు. పెళ్లి అయిన వారు, పిల్లలు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అర్హులే అని అన్నారు. ఇప్పటి వరకు 13 మంది ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారన్నారు.
వీర రత్న ఫౌండేషన్ సీఈవో అర్చన చక్రవర్తి మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర, మరియు గుజరాత్ రాష్ట్రాలలో వీర్ నారీ మణుల కుటుంబాలకు మా ఫౌండేషన్ ద్వార సేవలు అందిస్తున్నామని, దేశ వ్యాప్తంగా వారి సేవలు విస్తరించి అందరికీ తోడ్పాటును అందించేలా చేయాలనుకుంటున్నామన్నారు. ఆంధ్రపదేశ్ లో వారి సేవలను అందించడానికి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆహ్వానించడం ఆనందించదగిన విషయం అన్నారు. సరిహద్దుల్లో చనిపోయిన సైనికుల కుటుంబాల పిల్లలకు వారి చదువు విషయంలో, ఆరోగ్యం, తదితర విషయాల్లో తమ సేవలు అందిస్తామన్నారు. పలు అంశాలు, వృత్తులు మరియు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారు జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా స్థిరపడే విధంగా తోడ్పాటునందిస్తామన్నారు. మా సంస్థ తరఫున సైనిక మెమోరియల్ అవార్డ్స్ పేరు మీద వారు చదివిన స్కూల్స్ లో వీర నారీ మణుల చేతుల మీదుగా అందిస్తామన్నారు.
కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శివ ప్రసాద్, జిల్లా అధికారులు, వీర రత్న ఫౌండేషన్ సిబ్బంది మరియు వివిధ జిల్లాల నుంచి దేశ సరిహద్దుల్లో మరణించిన జవాన్ల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు..