అత్యాధునిక సాంకేతిక బోధనా కొరకు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు
అత్యాధునిక సాంకేతిక బోధనా కొరకు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు అందించనుంది. ఆ మేరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రోహిణి నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే గారి అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యా శాఖ MOU కుదుర్చుకుంది.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఆయా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో EdTech సదుపాయాలు కల్పించడం వల్ల రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది.
కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్ ఫారమ్‌తో ఏక్ స్టెప్ సంస్థ 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ను ఈ సంస్థ అందిస్తుంది.
ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు ఫిజిక్స్ వాలా సంస్థ సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది.
రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా ఖాన్ అకాడమీ వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది.
ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.
ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పై జమ్ ఫౌండేషన్ కోడింగ్ మరియు కంప్యుటేషనల్ థింకింగ్‌పై శిక్షణను అందిస్తుంది.
ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచం కోసం పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో పాటు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.