రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
50% రాయితీతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాల పంపిణీ
ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు
గంగాధర్ నెల్లూరు, జూన్ 18: చిత్తూరు జిల్లా అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధిస్తున్నదని, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించి వ్యవసాయ రంగాన్ని సైతం అభివృద్ధికి తీసుకురావాలని గౌ. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జిడి నెల్లూరు శాసన సభ్యులు వి.ఎం థామస్ పేర్కొన్నారు.
బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీ పై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిడి నెల్లూరు ఎం ఎల్ ఏ తో పాటు, చిత్తూరు నగరపాలక మేయర్ అముద, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 977 మంది రైతులకు 50% రాయితీతో 1.67 కోట్ల రూపాయల విలువచేసే యంత్ర పరికరాలకు సంబంధించి జంబో చెక్కును రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు ఎం ఎల్ ఏ మాట్లాడుతూ జిల్లాలో చెరుకు, మామిడి ప్రధాన పంటగా ఉందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను 50 శాతం రాయితీ తో సరఫరా చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులు పండించే పంట దిగుబడు పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అర్హులైన రైతులను గుర్తించి పక్షపాతం లేకుండా అవసరమైన రైతులకు నేరుగా పరికరాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం లో 2024-25 కు సంబంధించి 230 మంది రైతులకు రూ. 40.42 లక్షల రాయితీ తో వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయం అనుబంధ రంగాల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.