మత్తు పదార్థాల నిరోధానికి సమిష్టి కృషి!
మత్తు పదార్థాల నిరోధానికి సమిష్టి కృషి!
• మత్తు పదార్థాల నియంత్రణపై చర్యలు
• గ్రామస్థాయిలో అవగాహన
• పాఠశాలల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు
• కల్తీ కల్లు తయారీలో వాడే ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, గంజాయి నియంత్రణపై కట్టుదిట్టు చర్యలు
• 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని సూచన
• ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి!
-మాదకద్రవ్యాల నిరోధంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు – జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ సమీక్ష
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వమాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తుపదార్థాల నియంత్రణకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపి, ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ సూచనలు అందించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాలు సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని కలెక్టర్, సీపీ సూచించారు.
కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫాజోలం పై గట్టి నిఘా అవసరం ఉందని, దీని వినియోగం వల్ల అనేకులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని సేవిస్తున్నట్లు తెలిసిందని, ఇది పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ అధికారులకు సూచించారు. అల్ఫాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలను నియంత్రించేందుకు అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడులు కొనసాగించడంతోపాటు, ప్రజల్లో అవగాహన పెంచుతూ వారిని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వ్యతిరేక కమిటీలను బలోపేతం చేయాలని, అవి సమర్థవంతంగా పనిచేయేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ గుర్తు చేశారు.
ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫాజోలం వంటి పదార్థాల రవాణా, విక్రయం జరిగితే, వెంటనే సంబంధిత అధికారులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908 కు సమాచారం అందించాలని సీపీ సాయి చైతన్య ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈఓ అశోక్, వ్యవసాయ అధికారి వీరాస్వామి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్, డీటీఓ ఉమా మహేశ్వరరావు, ఔషధ నియంత్రణ అధికారి శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.