Health news: ఈ చెట్టు ఆకులతో ఏయే లాభాలు కలుగుతాయో చూడండి!
Health news: ఈ చెట్టు ఆకులతో ఏయే లాభాలు కలుగుతాయో చూడండి!
వానాకాలం సీజన్ మొదట్లో మనకు అధికంగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఇవి విరివిగా లభిస్తాయి. చాలా మంది ఇళ్లలో చెట్లు ఉంటాయి కనుక డబ్బు పెట్టకుండానే ఈ పండ్లను తినవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఉండేవారు తమకు అందుబాటులో ఉన్న వర్తకుల వద్ద ఈ పండ్లను కొని తినాల్సి ఉంటుంది. అయితే ఈ పండ్లు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక నేరేడు పండ్లు మాత్రమే కాదు ఈ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతగానో పనిచేస్తాయి. ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు కలిగే వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు ఆకులతో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ నియంత్రణకు..
డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు ఆకులు ఒక వరంగానే చెప్పవచ్చు. నేరేడు ఆకుల్లో జాంబోలైన్, జాంబోసైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. నేరేడు ఆకులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నేరేడు ఆకుల నుంచి రసం తీసి పావు టీస్పూన్ మోతాదులో భోజనానికి ముందు సేవించవచ్చు. లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు భోజనానికి 30 నిమిషాల ముందు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. ఇలా చేస్తుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
అసిడిటీ వంటి సమస్యలు..
నేరేడు ఆకుల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగితే విరేచనాల నుంచి బయట పడవచ్చు. పేగుల్లో మలం సరిగ్గా కదులుతుంది. మలబద్దకం సైతం తగ్గుతుంది. నేరేడు ఆకుల నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లతోపాటు బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోరును ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు ఆకులను నేరుగా నమిలి తింటుండాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
బరువు నియంత్రణలో..
నేరేడు ఆకుల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. అందువల్ల ఈ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగుతున్నా లేదా ఈ ఆకుల పేస్ట్‌ను వేసి కట్టు కడుతున్నా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గుతాయి. అలాగే నేరేడు ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. నేరేడు ఆకుల నీళ్లను రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా నేరేడు పండ్లు మాత్రమే కాదు, నేరేడు చెట్టు ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.