Vitamin D: ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతాలు ఇవే!
Vitamin D: ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతాలు ఇవే!
• జుట్టు రాలడం, నడుం నొప్పి, నిరంతర అలసట, ఆందోళన, నిద్రలేమి..
• గాయాలు నెమ్మదిగా మానడం కూడా విటమిన్ డి తక్కువగా ఉందని సూచిస్తుంది..
• సూర్యరశ్మి, చేపలు, గుడ్డు సొన, పాలు, తృణధాన్యాలతో విటమిన్ డి పొందవచ్చు..
శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ‘విటమిన్ డి’ ఒకటి.. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరు ఈ ‘విటమిన్ డి’ లోపంతో బాధపడుతున్నారట. ఈ పోషకం లోపిస్తే తీవ్రమైన అలసట, మానసిక కుంగుబాటు లక్షణాలు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కీలకమైన సంకేతాలు, లక్షణాలను గమనించడం ద్వారా ‘విటమిన్ డి’ లోపాన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.
ప్రధానమైన సంకేతాలివే..
జుట్టు విపరీతంగా రాలడం అనేది ఒక ప్రధాన సంకేతం. ‘విటమిన్ డి’ లోపం వెంట్రుకల పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి, జుట్టు పెరుగుదలకు అవసరమైన కెరాటినోసైట్‌ల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే, నడుం నొప్పి కూడా ఒక ముఖ్య లక్షణం. ‘విటమిన్ డి’ లోపం వీపు, మెడ, నడుము కండరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ బలహీనత కండరాలపై ఒత్తిడి పెంచి నొప్పికి కారణమవుతుంది.
ఆరోగ్యంగా ఉన్నా నీరసంగా..
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపించడం కూడా ‘విటమిన్ డి’ లోపానికి సూచికే. శరీరంలోని కణాల జీవక్రియకు, శక్తి ఉత్పత్తికి ‘విటమిన్ డి’ అవసరం. ఇది తక్కువగా ఉన్నప్పుడు, ఎంత బాగా నిద్రపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా నీరసంగా అనిపిస్తుంది. తక్కువ ‘విటమిన్ డి’ స్థాయిలు ఆందోళన లక్షణాలను కూడా పెంచుతాయి. మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ‘విటమిన్ డి’ చాలా ముఖ్యం. అంతేకాకుండా, ఆకలి మందగించడం, కుంగుబాటు, నిద్ర సరిగా పట్టకపోవడం, గాయాలు నెమ్మదిగా మానడం వంటివి కూడా ‘విటమిన్ డి’ లోపం వల్ల కలిగే ఇతర లక్షణాలు.
ఆహార పదార్థాల ద్వారా..
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష ద్వారా ‘విటమిన్ డి’ స్థాయిలను తెలుసుకోవడం ఉత్తమం. లోపం ఉన్నట్లు తేలితే, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా ‘విటమిన్ డి’ని పొందవచ్చు. సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, గుడ్డు సొన, పాలు, బాదం పాలు, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్, ఓట్ మీల్ వంటివి ‘విటమిన్ డి’ని అందిస్తాయి. వీటితో పాటు, ప్రతిరోజూ కనీసం 10-15 నిమిషాలు ఉదయం సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరం తనకు తానుగా ‘విటమిన్ డి’ని ఉత్పత్తి చేసుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.