రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

WhatsApp: వాట్సాప్ లో ఇకపై యాడ్స్!

Mounikadesk

WhatsApp: వాట్సాప్ లో ఇకపై యాడ్స్!

  • ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో త్వరలో ప్రకటనలు..
  • యాప్‌లోని అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాడ్స్ కనిపించనున్నాయి..
  • ఛానెళ్లు, స్టేటస్ విభాగాల్లో ప్రకటనలకు చోటు..
  • ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్‌..
  • వ్యక్తిగత చాట్స్, కాల్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టత..
  • యూజర్ల ఫోన్ నంబర్లు పంచుకోబోమని వాట్సప్ వెల్లడి..


ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, తన సేవల్లో కీలక మార్పునకు శ్రీకారం చుడుతోంది. యాప్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, త్వరలోనే వాట్సప్‌లో ప్రకటనలు దర్శనమివ్వనున్నాయని సంస్థ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

అప్‌డేట్స్ ట్యాబ్‌లోనే యాడ్స్:

వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వాట్సప్‌లోని 'అప్‌డేట్స్' ట్యాబ్‌లో ఈ ప్రకటనలు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో ఉన్న ఛానెల్స్, స్టేటస్ విభాగాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. వాట్సప్ వెల్లడించిన వివరాల ప్రకారం, రోజూ సుమారు 150 కోట్ల మంది వినియోగదారులు ఈ అప్‌డేట్స్ ట్యాబ్‌ను చూస్తుంటారు. ఈ భారీ యూజర్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఛానెల్ అడ్మిన్లు, వివిధ సంస్థలు, వ్యాపారులకు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకునేందుకు, తద్వారా వాట్సప్ ద్వారా ఎదిగేందుకు అవకాశం కల్పించాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

మూడు రకాల యాడ్ ఫీచర్లు

వాట్సప్ ప్రధానంగా మూడు రకాల ప్రకటన సంబంధిత ఫీచర్లను తీసుకురానున్నట్లు తెలిపింది. అవి:

1. ఛానెల్ సబ్‌స్క్రిప్షన్: వినియోగదారులు తమకు నచ్చిన ఛానెళ్లకు నెలవారీ రుసుము చెల్లించి మద్దతు తెలిపే సౌకర్యం.

2. ప్రమోటెడ్ ఛానెల్: ప్రస్తుతం ఛానెల్స్ విభాగంలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఛానెళ్లు కనిపిస్తుంటాయి. ఇకపై, ఛానెల్ నిర్వాహకులు కొంత రుసుము చెల్లించి తమ ఛానెల్ ఎక్కువ మందికి కనిపించేలా (విజిబిలిటీ) ప్రమోట్ చేసుకోవచ్చు.

3. స్టేటస్‌లో యాడ్స్: ఇప్పటివరకు వ్యక్తుల స్టేటస్‌లు మాత్రమే కనిపించేవి. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌లు కూడా ఈ విభాగంలో దర్శనమిస్తాయి.

వ్యక్తిగత చాట్స్‌కు మినహాయింపు:

అయితే, ఈ ప్రకటనలు కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌కు మాత్రమే పరిమితమవుతాయని వాట్సప్ స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యక్తిగత చాట్స్, కాల్స్, మెసేజ్‌లు, వారు పెట్టుకునే స్టేటస్‌లు యధావిధిగా ఎలాంటి యాడ్స్ లేకుండా కొనసాగుతాయని, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చింది. ప్రకటనల కోసం వినియోగదారుల దేశం, నగరం, వారు ఉపయోగించే భాష వంటి పరిమిత సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తుల ఫోన్ నంబర్లను అడ్వర్టైజర్లకు విక్రయించడం లేదా పంచుకోవడం జరగదని వాట్సప్ తేల్చి చెప్పింది.

ఈ కొత్త యాడ్ ఫీచర్లను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చేది వాట్సప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ మార్పు వాట్సప్ వినియోగదారుల అనుభవాన్ని ఏమేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.



Comments

-Advertisement-