రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రధమ స్థానం –– రాష్ట్ర గవర్నర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రధమ స్థానం –– రాష్ట్ర గవర్నర్

ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం

విద్యార్ధులకు డిగ్రీలు, అవార్డులు అందించిన రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్..

ఆత్కూరు(ఉంగుటూరు): జూలై 24, 2025

ఆంధ్రప్రదేశ్ 2024-25వ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ప్రధమ స్థానంలో వుందని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టు ప్రజా మందిరంలో గురువారం గుంటూరు జిల్లా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించి డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్ధులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ కమిషన్ సభ్యుడు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏ వేణు ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి స్నాతకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి అనుమతితో ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీ దేవి స్నాతకోత్సవ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె విశ్వవిద్యాలయం ఏర్పాటు, పుట్టుపూర్వోత్తరాలు, అందిస్తున్న కోర్సులు, సాధించిన విజయాలు వివరించారు. స్నాతకోత్సవంలో 46 మందికి డాక్టరేట్ లు, 196 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 1,420 మంది గ్రాడ్యుయేట్లకు వివిధ పతకాలు మెరిట్ సర్టిఫికెట్లు అందించి అభినందించారు. 


అదేవిధంగా వ్యవసాయ శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధనలకు గాను డాక్టర్ ఎం.వి. రెడ్డి జాతీయ అవార్డు–2024ను డాక్టర్ ప్రశాంత కె. దాష్, ఎ.డి.జి.-కమర్షియల్ క్రాప్స్ , ఐ సి ఏ ఆర్, న్యూఢిల్లీ, వి. రామచంద్రరావు జాతీయ పురస్కారం-2024 ను డాక్టర్ పి.వి.సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి ప్రధానం చేసారు. ఇదే క్రమంలో పలువురు ప్రొఫెసర్లు, సైంటిస్టులకు మెరిటోరియస్ టీచర్ అవార్డ్స్, మెరిటోరియస్ రీసెర్చ్ సైంటిస్ట్ అవార్డ్స్, మెరిటోరియస్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్ అవార్డ్స్, యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నరు మాట్లాడుతూ 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు పెరిగే అవకాశం ఉంటుండగా దీని ప్రభావం వలన ఆహార ఉత్పత్తి డిమాండ్ 400 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం వుందన్నారు.

2024లో వ్యవసాయ రంగం దేశ జిడిపికి సుమారు 16 శాతం వరకు దోహదపడిందని, ఈ రంగం దేశ జనాభాలో దాదాపు 46.1 శాతం మందికి జీవనోపాధిని కూడా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే 2025 ప్రకారము, ఈ రంగం 2025వ సంవత్సరంలో దాదాపు 3.8 శాతం వృద్ధి రేటును సాదించిందని, అయితే, కనీస అవసరాలైన ఆహారం, దాణా పశుగ్రాసం డిమాండ్‌ను తీర్చడానికి మాత్రమే కాకుండా, పేదరిక నిర్మోలనకు, దేశం మొత్తం ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, దేశ జిడిపిలో 8-9 శాతం వృద్ధిని కొనసాగించడానికి సంవత్సరానికి 4 శాతం వ్యవసాయ వృద్ధి రేటు అవసరం అన్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024-25వ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ప్రధమ స్థానంలో వుందని తెలిపారు. ఈ సందర్భంగా, రాష్ట్ర వార్షిక వ్యవసాయ వృద్ధి రేటులో ఇంత గొప్ప పురోగతికి కారణమైన వారందరికి అభినందనలు తెలియజేశారు.

ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు, పోషకాహార భద్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం ఉందని, దీనికనుగుణంగా, భారతదేశం తృణధాన్యాలు, చిరు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందని చెప్పవచ్చన్నారు. అంతేకాకుండా, పోషకాహారలోప సమస్యలను నివారించడానికి పప్పుధాన్యాల ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని రైతాంగానికి 60 సంవత్సరాల నిబద్ధతతో కూడిన సేవలను అందిస్తోందని, అసాధారణ వ్యవసాయ ప్రతిభను పెంపొందించడంలో సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్రను కలిగి ఉందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయంగా అత్యధిక సంఖ్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను పొందడం, ఐ.సి.ఎ.ఆర్ వారి ఎ.ఐ.ఇ.ఇ.ఎ. పరీక్షలలో విజయం సాధించడం ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఎంతో గర్వంగా ఉందన్నారు.

విశ్వవిద్యాలయ నిరంతర కృషి ఫలితంగా 2023-24లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో 25 మెరుగైన పంట రకాలను విడుదల చేయడం జరిగిందని, దీని ద్వార విశ్వవిద్యాలయం ర్రైతులకు ఆదాయం పెంపొందించే దిశలో ముఖ్యంగా వరిలో నాణ్యమైన దిగుబడులను సాదించినదని అనటంలో సందేహం లేదన్నారు.

విశ్వవిద్యాలయం వివిధ పంటలలో 10,215 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాలు, 17,240 క్వింటాళ్ల ఫౌండేషన్ దృవీకరణ విత్తనాలను ఉత్పత్తి చేయడమే కాకుండా, వాటిని బహుళ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, రైతులకు విత్తనాన్ని పంపిణీ చేయడంలో ఎంతగానో కృషి చేసిందని అభినందించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్ర పరిశీలనలు, రోగనిర్ధారణ సర్వేల ద్వారా అధిక ఉత్పాదకతను, ఆహార భద్రతను సాధించడానికి వ్యవసాయంలో సాంకేతిక సాధికారత అత్యంత ప్రాముఖ్యతను విస్తరణ కార్యకలాపాల ద్వార చాటి చెబుతున్నాయని, విజ్ఞానాన్ని ఆచరణలోనికి తీసుకురావడంలో విశ్వవిద్యాలయం ముందంజలో ఉందని పేర్కొన్నారు.

భారత హరిత విప్లవ పితామహుడు, భారతరత్న డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పినట్లుగా, వ్యవసాయం తప్పు దారి పడితే, మరేదీ సరైన దారిలో వెళ్ళే అవకాశం ఉండదని పేర్కొంటూ, దీనికి అనుగుణంగా రసాయనాదారిత వ్యవసాయ దుష్ప్రభావాలను గ్రహించి, నేటి వ్యవసాయం అధిక దిగుబడి, ఒత్తిళ్లను తట్టుకునే జన్యుపరంగా రూపొందించిన పంటలు, భిన్న వాతావరణాన్ని తట్టుకునే సాంకేతికతలు, పర్యావరణనుకూల సాంకేతికతల వైపు కదులుతోందని అన్నారు.

భారతదేశ వ్యవసాయ నిజమైన బలం చిన్న రైతులలోనే ఉందన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నొక్కి చెబుతూ, ఉత్పత్తి ధరల ముందస్తు అంచనాలకు సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, తద్వారా రైతులు మార్కెట్ డిమాండ్ ను బట్టి సరైన పంటలను ఎంపిక చేసుకొని సాగుచేసి మెరుగైన ధరలను పొందగలమన్నారు.

విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు, మీ విద్య కేవలం ప్రారంభం మాత్రమే అని గుర్తుంచుకోవాలని, సవాళ్లను స్వీకరించడం, సరిహద్దులను దాటడం, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దని ప్రోత్సహించారు. స్నాతకోత్సవంలో సర్టిఫికెట్లు అందుకున్న డాక్టరేట్ లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, అదేవిధంగా వివిధ పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు పొందిన వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ముఖ్య అతిథి పంజాబ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ కమిషన్ సభ్యుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏ వేణు ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థిగా తను అభ్యసించిన విద్య ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, అత్యున్నత సామాజిక సేవకు ఎంతగానో దోహద పడిందన్నారు. ఇంతటి ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడం, ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించడం విద్యార్థుల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. విశ్వవిద్యాలయం దేశంలోనే ఉన్నతమైన ఐఐటీలతో పోటీపడి వాటికి దీటుగా సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎన్నుకొని ఆయా రంగాలలో ఉన్నత ప్రతిభను చాటి చెప్పేలా కృషి చేయవలసిందిగా దిశా నిర్దేశం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన విద్య ద్వారా తను ఎంతో మానసిక ధైర్యాన్ని, విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పొందగలిగానని అన్నారు. భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచి ఎన్నో కోట్ల మంది ఆకలిని తీర్చడాన్ని గర్వించదగిన అంశమన్నారు. ఈ ప్రయాణంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెంచడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ, నేడు భారతదేశ వ్యవసాయంలో ఉత్పత్తి స్తబ్దత, పెరుగుతున్న సాగు ఖర్చులు, తరుగుతున్న నికర ఆదాయము, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నిస్సారమైన భూములు వంటి అనేక సమస్యలు గమనిస్తున్నామని, ఈ సమస్యలను గమనించి సుస్థిరత సాధించడానికి సాగులో వైవిధ్యత ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం సేంద్రియ వ్యవసాయం వనరుల సంరక్షించే సాంకేతికతను ఆచరించడం బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు విశిష్టమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని తమ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ సర్వతో ముఖావృద్ది సాధించాలని సూచించారు.

తొలుత కార్యక్రమానికి లేడీ గవర్నర్ సమీరా అబ్దుల్ నజీర్ తో కలిసి విచ్చేసిన రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయ కులపతికి వ్యవసాయ శాఖ కమిషనరు ఎస్ డిల్లీరావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు, ఉప కులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీ దేవి, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. స్వర్ణ భారత్ ట్రస్టు ప్రజా మందిరం వెలుపల పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రజా మందిరంలో బోర్డు సభ్యులు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. తదుపరి ఆయనను ప్రత్యేక పోలీసు బ్యాండ్ మేళంతో వేదిక వద్దకు ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, గవర్నర్ ఎడిసి మేజర్ అమన్ దీప్ సింగ్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు, ఇతర ప్రొఫెసర్లు, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, కార్యక్రమ నోడల్ అధికారి షేక్ షాహిద్ బాబు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-