జనసురక్ష పథకాలను వినియోగించుకోండి
జనసురక్ష పథకాలను వినియోగించుకోండి
- మూడు నెలల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
- జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ వారీగా క్యాంపులు
- ప్రతి అర్హునికి బీమా భద్రత కల్పించడమే లక్ష్యం
కర్నూలు, జులై 01 (పీపుల్స్ మోటివేషన్):-
ఆర్థిక సేవల విభాగం, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు, ప్రధాన సామాజిక భద్రతా పథకాలైన ప్రధాన్ మంత్రి జనధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు జిల్లాలోని 484 గ్రామ పంచాయితీ ల లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టనున్నారు అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.ఆర్. రామచంద్ర రావు తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒక బ్యాంకును కేటాయించి, వారివారిగా ప్రత్యక్షంగా క్యాంపులు నిర్వహించి, అర్హులైన ప్రతి పౌరుడిని ఈ బీమా మరియు పెన్షన్ పథకాలలో నమోదు చేయడమే ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
ప్రధాన అంశాలు:
• వాడుకలో లేని జన్ ధన్ ఖాతాల కేవైసీ తిరిగి పరిశీలన
• ఖాతా లేని వయోజనులకు కొత్త పీఎంజేడీవై ఖాతాలు
• పీఎంజెజెబీవై, పీఎంఎస్బీవై బీమా పథకాలలో నమోదు
• ఏపీవై పథకంలో లబ్ధిదారుల నమోదు
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన
ప్రతి క్యాంప్ అనంతరం, ఆ రోజు బ్యాంక్ బ్రాంచ్లు చేసిన నమోదుల వివరాలను లీడ్ బ్యాంక్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఆ వివరాలు డీఎఫ్ఎస్ పోర్టల్లో నమోదు చేయబడతాయి.
పథకాల విశేషాలు:
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజెజెబీవై) పథకం 18 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి వర్తిస్తుంది. ఈ పథకం కింద ఒక్క ఏడాది గాను ₹2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీస్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి. వార్షికంగా కేవలం ₹436 మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సేవింగ్స్ ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా డెడక్ట్ చేయబడుతుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో కుటుంబానికి ₹2 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ప్రీమియం చెల్లింపులో అంతరాయం ఉంటే పాలసీ రద్దయ్యే అవకాశం ఉంటుంది.
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకం 18 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగిన వారు పొందగలిగే ప్రమాద బీమా పథకం. ఈ పథకం కింద ఒక్క ఏడాదికి కేవలం ₹20 ప్రీమియం చెల్లించి ప్రమాద మృతి సందర్భంలో ₹2 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹1 లక్ష బీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకాన్ని కూడా సేవింగ్స్ ఖాతా ద్వారా ఆటో డెబిట్ విధానంలో కొనసాగించవచ్చు. జూన్ 1 నుండి మే 31 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం అనియత ఆదాయ వర్గాల ప్రజలకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో రూపొందించబడింది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. ఇందులో నమోదు చేసుకున్న వారు నెలవారీ చందా చెల్లించడం ద్వారా 60 ఏళ్ల వయస్సు నాటికి కనిష్ఠంగా ₹1000 నుండి గరిష్ఠంగా ₹5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం సేవింగ్స్ ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా నిర్వహించబడుతుంది.
ప్రారంభ కార్యక్రమం – సూదిరెడ్డిపల్లి:
కర్నూల్ జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో సూదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో, నాబార్డ్ డిడిఎం ఎం. సుబ్బారెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి, కేడీసీసీ బ్యాంకు సీఈవో రామాంజనేయులు పాల్గొని జనసురక్ష పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు.
జిల్లాలోని ప్రజలందరూ తమ కుటుంబ భద్రత కోసం ఈ పథకాలలో తప్పనిసరిగా నమోదు కావాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి పిలుపునిచ్చారు.
నాబార్డ్ డిడిఎం ఎం. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాలు తక్కువ ప్రీమియంతో గరిష్ఠ ప్రయోజనం కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అని తెలిపారు. ప్రజాప్రతినిధులు, బ్యాంకు అధికారులు, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు గ్రామస్థాయిలో నిర్వహించే క్యాంపులలో పాల్గొని అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.