సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రెవెన్యూ రాబడి పెరిగేలా కృషి చేయాలి
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రెవెన్యూ రాబడి పెరిగేలా కృషి చేయాలి
• అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ఆదర్శంగా ఉండాలి
• ఏళ్ళ తరబడి పనిచేసిన అనుభవంతో శాఖ ప్రగతికి తోడ్పడాలి
పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి
మన రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖఅధికారుల పనితీరు దేశానికే ఆదర్శమని వారు పనితీరులో ఎవ్వరికీ తీసిపోరని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లి లోని రాష్ట్ర వాణిజ్య పన్నుల సంస్థ కార్యాలయంలో జేసీ, డీసీ (జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లు) లతో ఏర్పాటు చేసిన రెవెన్యూ వర్క్ షాపు కార్యక్రమానికి ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ అనుభవాన్ని ఉపయోగించి సంస్థ మరింత పురోభివృద్ధి చెంది ఆదాయాన్ని ఆర్జించేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత మనందరి పై ఉందని మంత్రి అన్నారు. అధికారులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు చేసుకొనే ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా జీఎస్టీ పన్నుల రెవెన్యూను పెంచాలన్నారు. ఇందులో ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా అధికారులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు ఎంతముఖ్యమో అదే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈఏడాది పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించామని ఇందుకు టీమ్ గా పనిచేసిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్పిని మున్ముందు కూడా కొనసాగించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయ్యిందని ఇంకా మరింత బాధ్యతాయుతంగా అధికారులు, సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెలలోపు శాఖ ప్రగతిలో మార్పులు తప్పనిసరిగా కనిపించాలన్నారు.
మన డాటాని ఆధారం చేసుకుని వ్యవస్థలో లోపాలతో పన్నులను ఎగ్గొట్టేవారికి మనం అంటే చూపించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. అదే స్ఫూర్తిని తీసుకుని నేను కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు కూడా సమర్థవంతంగా తమ సేవలను రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లుతుందన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చే ఆయిల్ తదితర దిగుమతులు చేసుకునే వాళ్లు పన్ను వసూళ్లు నుంచి తప్పించుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వాటిని సమర్థవంతంగా అరికట్టాలన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్స్ ను సమర్థవంతంగా అరికట్టే విధంగా ఇతర శాఖలతో కలసి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా తనిఖీలతో వాటిని సరిచేయాలన్నారు. ఫీల్డ్ లో సమర్ధవంతంగా పనిచేసినప్పుడే మనం ఆశించిన రిజల్ట్స్ వస్తాయన్నారు. గత ప్రభుత్వం విధానాల వల్ల ఆర్థిక ఇబ్బందులు మన ప్రభుత్వానికి అందించిందని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వ్యాట్ పన్నులు పెంచేందుకు పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. యానాం నుంచి మన రాష్ట్రానికి డీజిల్ దిగుమతి అవుతుందనే సమాచారం ఉందని అలాంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రెవెన్యూ వసూళ్లను వసూలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సిస్టమ్ లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని పన్ను ఎగ్గొట్టే వారిని నుంచి పన్ను వసూలు చేస్తే రెవెన్యూ పెరుగుతుందన్నారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ అధికారులు క్లోజ్ గా మోనటరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ ఫైలింగ్ అప్పుడు చేసిన డేటా మనకు ఉపయోగపడుతుందన్నారు. అధికారుల అనుభవం శాఖ రెవెన్యూ పెరిగేలా ఉపయోగపడుతుందన్నారు. దేశంలో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన వాణిజ్య పన్నుల శాఖ పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చాలా స్మార్ట్ గా పనిచేయాలన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రెవెన్యూ రాబడులు పెరగాల్సి ఉందన్నారు.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఏ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమాచారం మరియు ఆన్ లైన్ సమాచారాన్ని ఉపయోగించుకుని రెవెన్యూ రాబడులను పెంచడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లు బాగా పెరిగాయన్నారు. ఇది టీమ్ వర్క్ గా సిబ్బంది అందరూ పనిచేయడం వల్లే సాధ్యపడిందన్నారు. ఏరోజుకారోజు ప్రత్యేక కార్యాచరణతో, పనితీరు సూచికలతో (Performance Indicators) రెవెన్యూ రాబడి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ యొక్క అవిశ్రాంత మరియు వినూత్న ప్రయత్నాల కారణంగా జూన్ 2025 లో నికర GST వసూళ్లలో 7.10% వృద్ధిని సాధించిందని బాబు ఏ తెలిపారు.
కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి రవి శంకర్, రాష్ట్ర పన్నుల ప్రత్యేక కార్యదర్శి సౌమ్య నూతలపాటి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డి. రమేష్, రాష్ట్రంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు చెందిన జాయింట్ కమిషనర్లు (జేసీ), డిప్యూటీ కమిషనర్లు (డీసీ) లు, తదితరలు పాల్గొన్నారు.