తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగు నీటి విడుదల
తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగు నీటి విడుదల
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
గురువారం తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారె సమర్పించి పంపు నంబర్-1 ను మంత్రి నిమ్మల రామా నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పు గోదావరి , ఏలూరు జిల్లాలలోని 14 మండలా ల్లోనీ 130 గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో లక్షా 38 వేల ఎకరాల, రెండవ దశలో 68,600 ఎకరాల ఆయ కట్టు కు సాగు నీరు అందనుందనీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో ఎత్తిపోతల పథకంలోని పంపు ను ప్రారంభించడం ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం సాయంత్రం సాగు నీటిని విడుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల పథకంలోని 8 పంపుల ద్వారా గోదావరిలోని నీటిని ఎత్తి తాడిపూడి కాలువ లో పోస్తారు. తద్వారా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1,57,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ఖరీఫ్ సీజన్ లో సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో 5,40,000 జనాభాకు త్రాగునీరు సరఫరా చేయుటకు ప్రతిపాదించినట్లు తెలియ చేశారు.
అంతకుముందు తాడిపూడి ఎత్తిపోతల పథకం పంపు ను ప్రారంభించడానికి వచ్చిన మంత్రికి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా మంత్రి గోదావరి మాతకు పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. అనంతరం మంత్రి తాడిపూడి ఎత్తిపోతల పథకంలోని పంపు నంబర్-1 ను ప్రారంబించి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు కలిగించే ఈ ప్రాజెక్టు, తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి,ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లోని 139 గ్రామాలకు తాగునీటి సరఫరా మెరుగవుతుందని, తద్వారా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్యాకేజీ 4 కింద సబ్ లిఫ్ట్ 1 నుంచి 4 పంపులలో 1 నుంచి 3 పంపుల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. సబ్ లిఫ్ట్ 5 ద్వారా దేవరపల్లి మండలం పరిధిలో నిర్మించి, పాక్షికంగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు మంత్రి రామా నాయుడు తెలియ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం సామర్థ్యంలో 2,06,600 ఎకరాలకు గాను తూర్పు గోదావరి జిల్లాలో 1,01,785 లకి గాను 97,433 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం అందుబాటులోనికి తీసుకుని వొచ్చిన తర్వాత 2006 నుంచి 2024 వరకు 51.402 టి ఎమ్ సి నీటి వినియోగం చెయ్యడం జరిగిందని తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, సూపరిండెంట్ ఇంజనీర్ సుగుణాకర్ రావు, ఏపీ సాగునీటి సంఘాల ప్రాజెక్టుల అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ, కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత, జల వనరుల శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.