రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో డాక్టర్ల పాత్ర అద్వితీయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో డాక్టర్ల పాత్ర అద్వితీయం

• ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారు

• చిత్తశుద్ధితో, సేవాభావంతో పనిచేసే డాక్టర్లకు అభినంధనలు

• బాధ్యతారాహిత్యంగా నడుచుకునేవారిని ఉపేక్షించం

• వైద్యులపై దాడులు, జులుం సరికాదు

• వైద్య శాఖలో గతానికి భిన్నంగా పారదర్శకంగా బదిలీలు

• డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు సత్కారం

- సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ప్రజల ఆరోగ్యానికి నడుమ అవినాభావ సంబంధం ఉందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్య కుమార్ యాదవ్ కోరారు. జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో డా.యన్.టి.ఆర్.వైద్య విజ్ఞాన విశ్వ విద్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని, ఈ దిశగా నిరంతరం ప్రజా సేవ పట్ల చిత్త శుద్ధి, అంకితభావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఎంతో ప్రయాస పడి ఉన్నత వైద్య విద్యను అభ్యసించి వ్యక్తి గత, కుటుంబపరమైన పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచటానికి కృషి చేసే వైద్యుల పట్ల ప్రజలు, నాయకుల ధోరణిలో మార్పు రావాలని అన్నారు. ఆఖరి క్షణం వరకు రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు, జులుం చేయటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. అకారణంగా అనుమానిస్తూ డాక్టర్ల పట్ల దురుసుగా వ్యవహరించవద్దన్నారు. చికిత్సలో వైద్యులు నిర్లక్ష్యం చేసినట్లు భావిస్తే వాటిని ప్రభుత్వం, అయా యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్ళటం మంచిదన్నారు. 

పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టిన వైద్యుల్లో అధిక భాగం రోగుల పట్ల సానుభూతి, అంకిత భావంతో పనిచేస్తారంటూ...దీనికి భిన్నంగా క్రమ శిక్షణా రాహిత్యం, బాధ్యతా రాహిత్యంతో పనిచేసే వైద్యులుకు తమ వైఖరి మార్చుకోవాలంటూ మంత్రి హెచ్చరించారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరిని కూటమి ప్రభుత్వం సహించదని, అట్టివారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పనితీరు పట్ల నిఘా పెంచామని, తప్పు చేసేవారిపై చర్యలు ఉంటాయన్నారు. 


గాడిన పడ్డ ప్రజారోగ్యం

గత ఐదేళ్ళ ప్రభుత్వ నిర్వాకాలు, నిర్లక్ష్యంతో ప్రజారోగ్య రంగం గాడి తప్పిందని, అస్తవ్యస్తమైన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో తిరిగి పట్టాలెక్కించిదన్నారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన విషయాల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మంత్రి వివరాలతో సహా వెల్లడించారు. ఆ ఐదేళ్ళ కాలంలో ప్రజారోగ్య రంగంలో జవాబుదారీతనం లేకపోవడం , క్రమ శిక్షణారాహిత్యం, అవినీతి, రాజకీయ జోక్యం వలన వైద్య వ్యవస్థ దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్ది మార్పు తేగలిగిందన్నారు. దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ఎంతో పెరిగాయన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన మేరకు ప్రజారోగ్యాన్ని ప్రక్షాళించటంలో చేయవల్సినది చాలా ఉందని, ఆ మేరకు చర్యలు చేపట్టడానకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  

వేదకాలంలోనే మన మహిళలు ఎంతో ముందున్నారని పురాణాల్లో మహిళలకు గుర్తింపు ఉందని అందుకే చదువు విషయంలో సరస్వతిని, ఐశ్వర్యం విషయంలో లక్ష్మీ దేవి పూజలు అందుకోవడం దీనికి నిదర్శనం అన్నారు. కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితం అయితే డాక్టర్లు తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా ఆసుపత్రుల్లో సేవలు అందించారని, ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారన్నారు. సమాజానికి డాక్టర్స్ అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి పాత్ర నిర్మాణాత్మాకమైనదన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆసుపత్రుల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో పాటు సరిగా తమ విధులను కూడా నిర్వర్తించని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో సమీక్షలు చేసి వాటిని సరిదిద్దామన్నారు. 

 2047 నాటికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు రూపొందించిందన్నారు. ప్రసవ సమయంలో మాతృ మరణాలు, శిశు మరణాలు, ఆరోగ్య భద్రత విషయాల్లో రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షును ప్రస్తుతం ఉన్న 71 సంవత్సరాల నుంచి 85 కు పెంచాల్సి ఉంటుందన్నారు. ప్రసూతి మరణాలను 45 శాతం నుండి 5 శాతం కు, శిశు మరణాలను 24 శాతం నుండి 2 శాతం కు తగ్గించాలని, గర్భస్థ మహిళల్లో బలహీనులుగా ఉన్నవారిని 34 % నుంచి 4 % తగ్గించే లక్ష్యాలను రూపొందించామన్నారు. 

సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య రోగ్య శాఖ పరిధిలో పారదర్శకంగా, వివాదరహితంగా జరిగిన బదిలీలు కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో తెచ్చిన మార్పుకు సంకేతమన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన బదిలీలపై పలు అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యంపై పలు ఆరోపణలు వచ్చాయని, కూటమి ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలతో వాటికి అడ్డుకట్ట వేసిందన్నారు. 

విశిష్ట సేవలందించిన 10 మంది వైద్యులకు సత్కారం

జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన పది మంది వైద్యులను మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఘనంగా సత్కరించారు. వీరిలో పద్మ శ్రీ పురస్కార గ్రహీత ప్రఖ్యాత న్యూరాలజీస్ట్, కర్నూలులో జన్మించిన డా.పద్మ శ్రీ వాత్సవ, ప్రస్తుత డి.యమ్.ఈ, ప్రఖ్యాత శస్త్ర చికిత్స నిపుణులు డా.నరసింహం ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ సమాజానికి వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు ఎప్పుడూ ముందుంటారన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా వారు తమ బాధ్యతలను నెరవేర్చారన్నారు.  

డా. ఎన్ టి ఆర్ వైద్య విజ్ఞాన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ మొదటిసారి జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది డాక్టర్లను గౌరవించుకోవడమేనని దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. డా. బి.సి. రాయ్ జన్మదినోత్సవాన్ని డాక్టర్స్ దినోత్సవంగా జులై 1 న జరుపుకుంటున్నామన్నారు. 

డా. ఎన్ టి ఆర్ వైద్య విజ్ఞాన యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా. వి. రాధికా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు చెందిన పది మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేసి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సత్కారం రాబోయే యంగ్ జనరేషన్ కు స్ఫూర్తి దాయకంగా ఉంటుందన్నారు. 

పద్మశ్రీ డా. ఎమ్. వి. పద్మశ్రీవాత్సవ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే బ్రెయిన్ ఎటాక్స్ కు వైద్య సేవలు పెంచాల్సి ఉందన్నారు. నగరాల్లో ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో బ్రెయిన్ ఎటాక్స్ కు వైద్య సేవలు లభిస్తున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లోని చిట్టచివరి మైలు వరకూ కూడా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

కార్యక్రమంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావు, డీఎమ్ఈ అకడమిక్ డాక్టర్ జి. రఘునంధనరావు, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-