స్వచ్ఛమైన వాతావరణం మానవ హక్కుగా అంతర్జాతీయ న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు...
స్వచ్ఛమైన వాతావరణం మానవ హక్కుగా అంతర్జాతీయ న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు...
ద హేగ్ (నెదర్లాండ్స్) లోని అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్యసమితి యొక్క అత్యున్నత న్యాయస్థానం జూలై 23న తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ న్యాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
తీర్పులోని ముఖ్యాంశాలు:
1. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, మరియు సుస్థిరమైన పర్యావరణం మానవ హక్కు:ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన వాతావరణంలో జీవించే హక్కు ఉందని ICJ స్పష్టం చేసింది.
జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, తగిన జీవన ప్రమాణ హక్కు, ఆహారం మరియు నీటి లభ్యత వంటి అనేక ఇతర మానవ హక్కులను ఆస్వాదించడానికి స్వచ్ఛమైన పర్యావరణం ఒక ముందస్తు షరతు అని కోర్టు పేర్కొంది.
2.వాతావరణ మార్పులపై నిష్కియత అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన:
భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి రక్షించడానికి అర్థవంతమైన చర్యలు తీసుకోని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కోర్టు తేల్చిచెప్పింది.
వాతావరణ మార్పు "గ్రహ స్థాయి అస్తిత్వ సమస్య" అని దానిని విస్మరించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం "తప్పు చర్య" (wrongful act) అవుతుందని కోర్టు అధ్యక్షుడు యుజి ఇవసావా హెచ్చరించారు.
3. నష్టపరిహారాలకు అవకాశం:
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో వాతావరణ మార్పుల కారణంగా తాము చేయని తప్పిదానికి బలై నష్టపోతున్న దేశాలు (ముఖ్యంగా సముద్ర మట్టాలు పెరగడం వల్ల మునిగిపోయే ప్రమాదం ఉన్న చిన్న ద్వీప దేశాలు) అందుకు నష్టపరిహారం పొందడానికి అర్హత కలిగి ఉన్నాయని కోర్టు పేర్కొంది.
ఈ నష్టపరిహారాలు ప్రతి కేసు యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయించబడతాయి
4. దేశాల బాధ్యతలు మరియు చర్యలు:
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను నిలువరించడానికి ప్రతి దేశం తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు తన 500 పేజీల సలహా అభిప్రాయంలో (Advisory Opinion) స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు శిలాజ ఇంధనాలను దశలవారీగా నిలిపివేయాలని, ఉద్గారాలను వేగంగా తగ్గించాలని, వాతావరణ నష్టాలను ఎదుర్కొంటున్న వారికి పరిష్కారాలు అందించాలని, మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ నిధులు అందించాలని ICJ సూచించింది.
కోత్త చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులను నిలిపివేయాలని కూడా కోర్టు సూచించింది.
5. తీర్పు స్వభావం మరియు ప్రాముఖ్యత:
ఈ తీర్పు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే "నిర్ణయం" కాకుండా ఒక "సలహా అభిప్రాయం" మాత్రమే. అయితే దీనికి గణనీయమైన చట్టపరమైన బలం మరియు నైతిక అధికారం ఉంటుంది.
ఇది భవిష్యత్ లో దేశీయ మరియు అంతర్జాతీయ న్యాయస్థానాలలో దావాలను, పెట్టుబడి ఒప్పందాలను, మరియు వాతావరణ విధానాలను ప్రభావితం చేయగలదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు మరింత వేగంగా మరియు కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
6. కేసు నేపథ్యం:
పసిఫిక్ ద్వీపదేశం వనువాతు (Vanuatu) నేతృత్వంలో 130కి పైగా దేశాల మద్దతుతో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023లో ICJని ఈ విషయంపై సలహా అభిప్రాయం ఇవ్వాలని కోరింది.
పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల మునిగిపోయే ప్రమాదం ఉన్న చిన్న ద్వీప దేశాలు చాలా సంవత్సరాలుగా చేసిన లాబీయింగ్ ఫలితంగా ఈ వినతి వచ్చింది.
7. ఇతర అంతర్జాతీయ కోర్టుల తీర్పులు:
ఈ తీర్పు అంతర్జాతీయ కోర్టులు వాతావరణ మార్పులపై ఇస్తున్న వరుస తీర్పులలో భాగం.
ఇటీవలే ఇంటర్-అమెరికన్ మానవ హక్కుల కోర్టు (Inter-American Court of Human Rights) మరియు గత సంవత్సరం ఐరోపా మానవ హక్కుల కోర్టు (European Court of Human Rights) కూడా వాతావరణ మార్పులకు సంబంధించిన మానవ హక్కుల బాధ్యతలపై ఇలాంటి తీర్పులను ఇచ్చాయి