కృత్రిమమేథ సహకారంతో భూ వివాదాలు, సమస్యలకు పరిష్కారం
కృత్రిమమేథ సహకారంతో భూ వివాదాలు, సమస్యలకు పరిష్కారం
- బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోస పూరితమైన రిజిస్ట్రేషన్లకు, ఎంట్రీలకు అడ్డుకట్ట
- క్యూఆర్ కోడ్ తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15 న పంపిణీ
- రాష్ట్ర ముఖ్యమంత్రి అద్యక్షతన రెవిన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు
- రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
అమరావతి, జూలై 4: అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేథ సహకారంలో ఆధార్, సర్వే నంబర్లను లింక్ చేయడం ద్వారా భూ వివాదాలు, సమస్యలను శాశ్వత పరిష్కరించే దిశగా పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ శాఖకు చెందిన పది కీలక అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్కడ కూడా మోస పూరితమైన రిజిస్ట్రేషన్లు, ఎంట్రీలకు ఏమాత్రం అవకాశం లేకుండా సర్వే, రిజిస్ట్రేషన్ మరియు రెవిన్యూ శాఖలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుందన్నారు.
గతంలో పంపిణీ చేసిన 21 కోట్లు మందికి క్యూఆర్ కోడ్ తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆగస్టు 15 న పండుగ వాతావరణంలో పంపిణీ చేయనున్నామన్నారు. ఈ పాస్ పుస్తకానికి, బ్యాంకు ఋణం మంజూరీకి ఎటు వంటి సంబందం లేదని, గత ఏడాది దాదాపు 10 వేల మంది వరకూ ఋణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని, ఈ ఏడాది ఇప్పుటి వరకూ 40 వేల మంది వరకూ ఋణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ మరియు నీటి వనరుల భూములకు పలు రకాల రంగులను నిర్థేశిస్తూ వాటన్నింటినీ మ్యాపింగ్ చేసే అద్బుత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందని మంత్రి తెలిపారు. 200 నుండి 250 ఎకరాల భూమిని ఒక బ్లాక్ గా నిర్థేశిస్తూ భూముల రీ సర్వే కార్యక్రమం ఎంతో పారదర్శకంగాను, విజయవంతంగా జరుగుచున్నదన్నారు. అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తూ 2027 డిశంబరు నాటికి ఈ రీ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా అద్బుత మైన రెవిన్యూ వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
వారసత్వ దృవీకరణ పత్రం లేకపోవడం వల్ల గ్రామాల్లో పలు వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దృవీకరణ పత్రం జారీని సులభతరం చేసినట్లు తెలిపారు. రూ.10 లక్షల విలువ లోపు భూములకు కేవలం రూ.100/- లకు, రూ.10 లక్షలకు పైబడిన భూములకు రూ.1000/- లకే స్థానిక గ్రామ సచివాలయాల్లో జారీ చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 43.89 లక్షల కుల దృవీకరణ పత్రాలను జారీ చేయడం జరిగిందని, ఆగస్టు 2 కల్లా శత శాతం జారీచేయడమే కాకుండా ఆ దృవీకరణ పత్రాలు ఓపెన్ డొమైన్లో ఉంచాలని సి.ఎం. ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 363 ఆవాసాల్లో మూడు దశల్లో శ్మసాన వాటికల నిర్మాణానికి రూ.137 కోట్లను మంజూరు చేసేందుకు ముఖ్య మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ రెండేళ్లలో నివాస స్థలాలు, మూడేళ్లలో గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, పేదల గృహ నిర్మాణాలకు సంబందించి నెల కొన్న చట్టపరమైన వివాదాలు, అంశాలను అక్టోబరు 2 లోపు పరిష్కరించేలా రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు పురపాల, పట్టణాభివృద్ది శాఖ మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. రెవిన్యూ సదస్సుల్లో దాదాపు 1.85 లక్షల దరఖాస్తులురాగా, వాటిలో ఇప్పటికి కేవలం 687 మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వానికి అందిన 4.63 లక్షల గ్రీవెన్సుల్లో ఇప్పటి వరకూ 3.99 లక్షల గ్రీవెన్సులను పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రమబద్దీకరణ చేయని ఇల్లు ఉండకూడదు అనే లక్ష్యంతో అభ్యంతరం లేని నివాస యూనిట్లను జి.ఓ.నెం.30 ద్వారా ఉచితంగా క్రమబద్దీకరించడం జరిగిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో కూడా ఇందుకు సంబందించి అందే దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని ఇళ్లను క్రమబద్దీకరిస్తామన్నారు.
ఫ్రీహోల్డు భూముల సమస్య పరిష్కారానికై పది అంశాలపై మంత్రుల ఉప సంఘం నాలుగు సార్లు సమావేశమై సుదీర్ఝంగా చర్చలు జరిపిందని, మరో రెండు సార్లు ఈ సమావేశాలు నిర్వహించి తుది నివేదికను అక్టోబరు 2 కల్లా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.
నాలా రద్దు అంశంపై మంత్రుల ఉప సంఘం ఇప్పటికే దాదాపు మూడు సార్లు సమావేశమై సుదీర్ఝంగా చర్చించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ అంశానికి సంబందించి పంచాయితీరాజ్, పట్టణాభివృద్ది మరియు రెవిన్యూ శాఖలు సమన్నయంతో పనిచేయాల్సిన అంశంపై అద్యయనం చేయాల్సి ఉందన్నారు. వచ్చే క్యాబినెట్ లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని రకాల భూముల కన్వర్షన్ కు నాలుగు శాతం ప్లాట్ రేటును ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు.
ప్రతి జల్లాకు ప్రొటో కాల్ అధికారి…..
రెవెన్యూ అధికారులను ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయిస్తూ ప్రతి జిల్లాకు ప్రొటో కాల్ అధికారులను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. రెవిన్యూ శాఖకు చెందిన తాసీల్దార్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు ప్రొటో కాల్ డ్యూటీల వలన కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంచే ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సంబందిత శాఖకు చెందిన అధికారులే మంత్రుల ప్రొటో కాల్ అంశాలకు హాజరవుతారని, ఈ విషయంలో జిల్లా ప్రొటో కాల్ అధికారి సమన్వయం చేసుకోవడం జరుగుతుందన్నారు.
రెవిన్యూ శాఖ అద్బుతంగా పనిచేస్తున్నట్లు ఫీడ్ బ్యాక్…..
గత ఏడాది కాలం నుండి రెవిన్యూ శాఖ అద్బుతంగా పనిచేస్తున్నట్లు కాల్ సెంటర్ ద్వారా చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. రెవిన్యూ సదస్సుల నిర్వహణలో ప్రజల సంతృప్తి స్థాయికి సంబందించి మొత్తం ఐదు మార్కులకు గాను సేకరించిన 14,368 ఫీడ్ బ్యాక్స్ లో రెవిన్యూ శాఖకు 2.5 మార్కులతో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచిందని, పి.జి.ఆర్.ఎస్. లో రెవిన్యూ శాఖ 5 వ స్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ శాఖను అభినందించినట్లు మంత్రి తెలిపారు.
రెవిన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు సిసిఎల్ఏ జి.జయలక్ష్మీ, అదనపు సిసిఎల్ఏ ప్రభారకర రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.