బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిశీలన
బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిశీలన
- రుషికొండ బీచ్‌ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్
- బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తాం.. బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ
- రుషికొండ బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చ
- అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి సాగర తీరంలో డబుల్ డెక్కర్ బస్సుల పరిశీలన
- పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తామని వెల్లడి
విశాఖపట్నం: పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను జిల్లా యంత్రాంగం, శాఖల సమన్వయం, రాజకీయ నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. బీచ్ లో దుకాణాలు నడుపుతున్నవాళ్లు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అనంతరం బీచ్ రోడ్డులో తిరగనున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హప్ ఆన్, హప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలందించనున్నాయని తెలిపారు. పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. డబులు డెక్కర్ బస్సులు విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ అనగానే సుందరమైన ప్రకృతి రమణీయత ప్రాంతాలు కళ్లముందు కదలాడుతాయని అన్నారు. బ్లూఫాగ్ బీచ్ సర్టిఫికేషన్ అంటే ఎన్నో పారామీటర్స్ చూసి అందించే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్గుతాయన్నారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ ఉన్న బీచ్ లను విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే వీలుందన్నారు. ఈ క్రమంలో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందించిన బ్లూఫాగ్ సర్టిఫికేషన్ ను నిర్ణీత ప్రమాణాలు పాటించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్ గా గా పేరున్న రుషికొండ బీచ్ లో పరిశుభ్రత, సౌకర్యాలు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఉపయోగపడేలా, అందంగా కనిపించేలా, నిత్యం పరిశుభ్రతను పాటించేలా, సందర్శకులకు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. కలకాలం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చర్చించామన్నారు. తరుచూ సముద్రగాలులు వీస్తుండటం వల్ల బీచ్ లో కట్టడాలు కట్టేందుకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవం అని మంత్రి దుర్గేష్ అన్నారు. మురుగునీరు ద్వారా వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరముందన్నారు.. వీటన్నింటిపై దృష్టిసారించామన్నారు. అనవసరమైన కట్టడాలను కూల్చేసి చూడ్డానికి అందంగా, పరిశుభ్రమైన బీచ్ గా కనిపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ నిబంధనల వల్ల ఇటీవల బ్లూఫాగ్ బీచ్ సర్టిఫికేషన్ కు కొన్ని అవాంతరాలు వచ్చాయని గుర్తుచేశారు. దాన్ని అధిగమించి మళ్లీ బ్లూఫాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రూ.24 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ తరపున ఖర్చు చేయడానికి నిర్ణయించామన్నారు.
ఈ నేపథ్యంలో బీచ్ కు వచ్చే సందర్శకులకు ఏయే సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పచ్చదనం పెంచాలని నిర్ణయించామన్నారు. సమగ్ర కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. టూరిజం శాఖ, జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీ, రాజకీయంగా ఇలా అందరూ సమన్వయం చేసుకొని ఈ ప్రాంతాన్ని అద్భుత ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఒక్క బీచే కాకుండా రాష్ట్రంలో మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.. 974 కి.మీల సముద్రతీరాన్ని పర్యాటకులు సందర్శించేలా చర్యలు ఉంటాయన్నారు.. వాటర్ స్పోర్ట్స్, వెల్ నెస్ సెంటర్లు, ఎకో, అడ్వెంచర్ టూరిజంలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు..
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో సరైన రాజకీయ నాయకత్వం లేకపోవడంవల్ల పుదచ్చేరి ప్రభుత్వం ఆపేసిన కార్డేలియా సముద్ర విహార నౌకను తిరిగి ప్రారంభించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఈ అంశంపై గతంలో బెంగుళూరులో జరిగిన పర్యాటక సదస్సులో తాను పాండిచ్చేరి మంత్రితో చర్చించి నౌకను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నానని తెలిపారు. అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ ను విశాఖ పోర్టు అథారిటీ వాళ్లు అద్భుతంగా నిర్మించారని తెలిపారు.. త్వరలోనే క్రూజ్ టూరిజం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ వరకు నాలుగు పర్యాయాలు మాత్రమే నడపాలని నిర్ణయించామని, అనంతరం ఏడాదిలో 365 రోజులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రూజ్ టూరిజం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించాలని భావిస్తున్నామన్నారు. విశాఖకు వచ్చే పర్యాటకులు కేవలం సముద్రప్రయాణం చేయడం మాత్రమే కాదు స్థానికంగా ఉన్న ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.