పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
- •పర్యాటక రంగ పురోగతిపై సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష
- •సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని సూచన
- •త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తానని వెల్లడి
- •రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశం.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటుకు నిర్ణయం
- •అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్ పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని నిర్ణయం
- •రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి కేంద్ర సహకారం మెండుగా ఉందని త్వరితగతిన మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు డీపీఆర్ లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
- •అమరావతిలో పర్యాటక భవన్ ఏర్పాటు అంశంపై సమీక్షలో చర్చ
అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన పేషిలో ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ ల తయారీ, క్యారవాన్, హోమ్ స్టే పాలసీ విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజినల్ సమ్మిట్ లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంవోయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు, 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 22 దేవాలయాల్లో టెంట్ సిటీలతో పాటు ఇగ్లూ తరహా ఇళ్ల విషయం ఆలోచించాలన్నారు.
అనంతరం విశాఖపట్నంలోని రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సుందరీకరణ అంశంపై చర్చించారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
లేపాక్షి, లంబసింగి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు మరో 4,5 ప్రాజెక్టులకు డీపీఆర్ లు సిద్ధం చేస్తే శాస్కి, స్వదేశీ దర్శన్, ప్రసాద్, సీబీడీడీ తదితర కేంద్ర పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు.
27 సెప్టెంబర్, 2025న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సూర్యలంక బీచ్ లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి పర్యాటక పర్యటన పాపికొండలు యాత్రలో భాగంగా పర్యాటకులకు మౌలిక వసతుల కల్పన, పేరంటాల పల్లిలో వసతి కల్పన అవసరమని గుర్తించానని, ఆ ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పురాతన హేవలాక్ వంతెనపై పర్యాటకుల భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవలే అఖండ గోదావరి శంకుస్థాపన వేడుకలు ఘనంగా నిర్వహించామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మెచ్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయిన గండికోట, సూర్యలంక బీచ్ లను స్వయంగా సందర్శిస్తానన్నారు.
సమీక్షలో భాగంగా కాకినాడ ఎన్టీఆర్ బీచ్, ఉప్పాడ బీచ్ ల అంశం చర్చకు రాగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై చర్చించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచలం, అన్నవరం దేవాలయాల్లో చేపట్టిన పనులు శరవేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో తొట్లకొండ, అమరావతి, ఘంటసాల శయనబుద్ధ ప్రాజెక్టు,నాగార్జున కొండ తదితర ప్రాంతాలతో కూడిన బుద్ధిస్ట్ సర్క్యూట్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఏపీకి బుద్ధిస్ట్ సర్క్యూట్ ను ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హోమ్ స్టేల గుర్తింపు ప్రక్రియ ఎంతదాకా వచ్చిందని అధికారులను అడిగారు. హోమ్ స్టేలకు మంచి స్పందన వస్తోందని ఇప్పటికే 2000కు పైగా గుర్తించామని బదులిచ్చారు.
ఆగస్టు 5,6 తేదీల్లో రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తానని మంత్రి దుర్గేష్ అన్నారు. పర్యటనలో భాగంగా తిరుపతిలో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ తో పాటు డీవీఎంలు, యూనిట్ మేనేజర్లతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అంతేగాక స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థనల మేరకు పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఆయా ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్ కు కేంద్రం సుముఖంగా ఉందని, ఈ నేపథ్యంలో ఏర్పాటు అంశంపై చర్చించారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఇన్వెస్టర్లకు సూచించి త్వరితగతిన పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించాలని మంత్రి దుర్గేష్ అధికారులతో అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పర్యాటకానికి ఊతమొచ్చిందని, అంతేగాక నూతన పర్యాటక పాలసీకి ఇన్వెస్టర్ల నుండి మంచి స్పందన వస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. ఇన్వెస్టర్లకు ప్రతి సమాచారం వివరించి, అవగాహన కల్పించి పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగానికి అవసరమైన సాయం కల్పించేందుకు ఎల్లవేలలా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటకాభివృద్ధి విషయంలో ఇరిగేషన్, ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో ఏ. శ్రీనివాసులు, ఈడీ (ప్రాజెక్ట్స్) శేషగిరిరావు, ఇన్వెస్ట్ మెంట్ నోడల్ ఆఫీసర్ బి. సత్యప్రభ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మారాణి,చీఫ్ ఇంజినీర్ , మంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.