నాడు సాయం పొందాడు... నేడు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు...
నాడు సాయం పొందాడు... నేడు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు...
- నలుగురిని చదివించేందుకు ముందుకు వచ్చిన విదేశీ విద్య పథకం లబ్దిదారుడు సాత్విక్
- విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న పేదలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన సాత్విక్
అమరావతి, జులై 22: ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ పథకాలకు సార్థకత చేకూరుతుంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఆ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నాడు ఆర్థిక సాయం పొందిన చేతులు.. ఇప్పుడు పేదలకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి కలిశారు. 2016 సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండులో చదువుకోవడానికి నాటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని ముఖ్యమంత్రికి సాత్విక్ వివరించారు. ప్రభుత్వం అందించిన సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్లో ఐర్లాండులో ఎంఎస్ విద్యను అభ్యసించానని చెప్పారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేసిన తాను.. ఇప్పుడు ఐర్లాండులో వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నాడు ప్రభుత్వం నుంచి సాయం పొందిన తాను.. ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దశంతో ఉన్నట్టు సాత్విక్ చెప్పారు. ఈ మేరకు మెరిట్ కలిగిన పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాల్లో వారికి చేయూతనిచ్చేలా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాము నలుగురు పేదలకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సాత్విక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన యువకుడిని ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ ఉన్నారు.