నకిలీ ఉద్యోగాలు, ఫేక్ అపాయింట్మెంట్ లేటర్ల తో ఆన్ లైన్ మోసాలు..
నకిలీ ఉద్యోగాలు, ఫేక్ అపాయింట్మెంట్ లేటర్ల తో ఆన్ లైన్ మోసాలు..
• ఎటువంటి ఉద్యోగానికైనా ముందుగా డబ్బు అడిగితే అది మోసం.
• నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలి.... జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ద్వారా (Job Frauds) నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నకిలీ కంపెనీలు, ఫేక్ నోటిఫికేషన్లు, జాతీయ/అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల పేరిట మోసగాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు.
యువత అధిక ఆదాయ ఆశ , విదేశీ అవకాశాల పేరుతో మోసానికి గురవుతున్నారు.
మోసాల విధానం / పద్ధతులు:
నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసాలు :
UPSC, SSC, RRB, APPSC వంటి సంస్థల పేరు తో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు.
“ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఉద్యోగం ఖాయం” అనే నకిలీ వెబ్‌సైట్లు/డొమెయిన్‌లు ఉపయోగించడం (ఉదా: govtjobs-career.com వంటివి).
ప్రైవేట్/ఇంటర్నేషనల్ కంపెనీల మోసాలు:
- IT కంపెనీలు, దుబాయ్, కెనడా, సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెబుతారు.
- ప్రాసెసింగ్ ఫీజు, వీసా ఛార్జీలు పేరిట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటారు.
- ఇంటర్వ్యూ లేకుండా, నేరుగా ఆఫర్ లెటర్ పంపిస్తారు.
ఓటీపీ/డేటా మోసం:
- జాబ్ అప్లికేషన్ పేరిట వ్యక్తిగత డేటా తీసుకొని అక్రమంగా ఉపయోగించడం.
- బ్యాంక్ డీటెయిల్స్, OTPలు, ఆధార్ కార్డ్, PAN కార్డ్ సమాచారం తీసుకోవడం.
జిల్లాలో ఇటీవల నమోదైన సంఘటనలు:
కేసు 1: ఓ డిగ్రీ విద్యార్థిని “రిలయన్స్ HR డిపార్ట్‌మెంట్” అని చెప్పి రూ. 15 వేలు తీసుకొని మోసానికి గురి చేశారు.
కేసు 2: ఓ యువకుడు “కెనడా లో ఉద్యోగం” అనే పేరుతో రూ. 85 వేలు వీసా ఫీజు చెల్లించి మోసపోయాడు.
కేసు 3: “ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు” అంటూ నకిలీ ఫారంలు పంపించి డబ్బులు వసూలు చేశారు.
ప్రజలకు సూచనలు:
ఉద్యోగ నోటిఫికేషన్లను మాత్రమే అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించండి (ఉదా: https://www.ap.gov.in, https://ssc.nic.in)
ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఉద్యోగం ఇస్తామంటే – అనుమానం ఉండాలి.
ఎటువంటి ఉద్యోగానికైనా ముందుగా డబ్బు అడిగితే అది మోసం కావచ్చు.
వ్యక్తిగత సమాచారం/బ్యాంక్ డీటెయిల్స్ ను ఎవరికీ పంచవద్దు.
స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇలాంటి మోసాల గురించి చైతన్యం చేసి అవగాహన పరచండి.
ఫిర్యాదు చేయడానికి:
సైబర్ హెల్ప్‌లైన్: 1930
సైబర్ క్రైమ్ పోర్టల్: www.cybercrime.gov.in
అత్యవసర సమాచారం కోసం: మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించండి.
అప్రమత్తతే రక్షణ అని, ఆఫర్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, నిజమైన ధృవీకరణ లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీ చేయకూడదని, కొత్త కొత్త రూపాలలో మోసగాళ్లు వస్తున్నారని నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.