రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చేనేత కుటుంబానికి... నేతన్న భరోసా రూ.25 వేలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

చేనేత కుటుంబానికి... నేతన్న భరోసా రూ.25 వేలు

  • నేతమగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
  • ఉచిత విద్యుత్‌తో ఏడాదికి ప్రభుత్వంపై రూ.190 కోట్ల అదనపు భారం
  • అమరావతిలో చేనేత మ్యూజియం-అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి
  • అన్నదాత అన్నం పెడితే... నేతన్న నాగరికత నేర్పాడు
  • నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయం
  • సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్... 40 వేల షాపులకు ప్రయోజనం
  • టీడీపీకి అండగా బీసీలు... గత ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గలేదు
  • 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • మంగళగిరిలో వీవర్‌శాలను సందర్శించి, చేనేత కళాకారులతో సీఎం ముఖాముఖి

మంగళగిరి, ఆగస్టు 7: రాష్ట్రంలోని చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేతన్న భరోసా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గురువారం గుంటూరు జిల్లా, మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో గతంలో ఏర్పాటైన వీవర్‌శాలను సందర్శించారు. అక్కడ చేనేత కళాకారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. 

ఈ నెల నుంచే ఉచిత విద్యుత్ అమలు

చేనేతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ఉచిత విద్యుత్ పథకం’ ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు, పవర్ లూమ్స్ ఉన్న 50 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు అవుతుంది. నేతన్నలకు 50 ఏళ్లకే పింఛన్ మొదలుపెట్టింది టీడీపీనే. 92,724 కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. సామాజిక పింఛన్లు రూ.4,000కు పెంచడం ద్వారా ఏడాదికి రూ.546 కోట్లు కేవలం వీవర్స్ పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

చేనేత వైభవానికి పుట్టిల్లు మన తెలుగునేల

చేనేత కళాకారులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారతీయ శక్తి, సంస్కృతి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత మన నేత కార్మికులదేనని ప్రసంశించారు. ‘ఆరుగజాల చీర అగ్గిపెట్టెలో పెట్టగలిగే నైపుణ్యం మన చేనేత కళాకారుల సొంతం. అన్నదాత అన్నంపెడితే... నేతన్న మనకు నాగరికత నేర్పాడు. మంగళగిరి, ధర్మవరం, వేంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. ఆనాడు పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చితే... పెడన కళంకారీ ప్రపంచాన్నే ఆకట్టుకుంది. బ్రిటీష్ వారు మన నేతన్నలు నేసిన ఉత్పత్తులను ఇంగ్లండ్ తీసుకు వెళ్లి అక్కడ విక్రయించేవారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఖద్దరు వస్త్రాలు ధరించడం, నూలు వడకటం దేశభక్తికి నిదర్శనం’ అని సీఎం వివరించారు.  

జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం

గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తనకు మొదట గుర్తొచ్చేది చేనేత కార్మికుల సంక్షేమమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఆప్కో ద్వారా చేసే ఉత్పత్తులను కొనుగోళ్లను నిలిపేశారు. 2019కి ముందు నూలు, రంగుపై ఇచ్చే సబ్సిడీని ఎత్తేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా చేనేత ఉత్పత్తులపై విధించే 5 శాతం జీఎస్టీని రీయింబర్స్‌ చేస్తాం. దీనికి ఏడాదికి రూ.15 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. రూ.5 కోట్లతో పొదుపు నిధి (థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నాం. 5,386 మంది చేనేత కళాకారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.   

అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం

ఎన్డీయే ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, రాష్ట్రంలోని మాస్టర్ వీవర్లు, కళాకారులు ఉత్పత్తుల్లో రూ.1,375 కోట్ల టర్నోవర్ సాధించారని అన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ‘చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లాను సలహాదారుగా పెట్టుకున్నాం. వన్ ప్రొడెక్ట్, వన్ డిస్ట్రిక్ట్ కింద రాష్ట్రానికి వచ్చిన 9 అవార్డుల్లో 4 చేనేత రంగానికే వచ్చాయి. ఓఎన్‌డీసీ ద్వారా ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2 వేల చేనేత ఉత్పత్తులు ఓఎన్‌డీసీలో నమోదయ్యాయి. చేనేతకు చేయూతను ఇచ్చేందుకు నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద 5 చోట్ల కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ప్రారంభిస్తున్నాం. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలో రూ.74 కోట్లతో ఈ క్లస్టర్ల ఏర్పాటు జరుగుతోంది. వీటి ద్వారా 11,374 మంది చేనేత మహిళలకు లబ్ధి కలుగుతుంది’ ముఖ్యమంత్ర వివరించారు. 

అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి

చేనేత వర్గాల ప్రయోజనం కోసం సత్యాగ్రహం చేసిన చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఎన్నారై ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన చేనేత సర్కిల్లో ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

చేనేత కార్మికులు... టీడీపీకి అవినాభావ సంబంధం

టీడీపీకి, చేనేత కార్మికులకు మధ్య అవినాభావ సంబంధం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదినే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సగం ధరకే చీర, ధోవతి ప్రవేశపెట్టి నేతన్నకు ఉపాధి కల్పించారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది ఆధారపడి జీవిస్తున్న రంగం చేనేత రంగం. దాదాపు 1,22,644 కుటుంబాలు ఈ రంగంలో ఉన్నాయి. అధికారంలో ఉంటే మేలు చేశాను... ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేశాం. 2014-2019 మధ్య రూ.110 కోట్లతో చేనేత కళాకారుల రుణాలు మాఫీ చేశాం. 55,500 మంది కార్మికులకు రూ.2 లక్షల చొప్పున రూ.27 కోట్ల రుణాలిచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. మరమగ్గాల కొనుగోలుకు 50 శాతం రాయితీ ఇచ్చి రూ.80 కోట్లు ఖర్చు చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు. 

లోకేష్ చరిత్ర సృష్టించారు

పార్టీ ఆవిర్భావం నుంచి మంగళగిరిలో టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచిందని, అందుకే ఆలోచించి పోటీ చేసే నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలని గతంలో తాను లోకేష్‌కు సూచించానని సీఎం చంద్రబాబు వఅన్నారు. అయినా లోకేష్ మంగళగిరిలోనే పోటీచేసి మొదటిసారి 5 వేల ఓట్ల తేడాతో ఓడిన చోటే మళ్లీ 91 వేల మెజారిటీతో గెలిచారని అన్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో 873 మంది నేతన్నల కోసం అత్యాధునిక రాట్నాలు ఇచ్చారు. వీవర్ శాల ఏర్పాటు చేసి 20 మగ్గాలు పెట్టారు. 3 వేల కుటుంబాలకు బట్టలు పెట్టి పట్టాలు అందించారంటే అదీ పేదల పట్ల, చేనేతల పట్ల లోకేష్ చిత్తశుద్ధికి నిరద్శనం. పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందం అబద్దయ్య, డైరెక్టర్‌గా కందుల నాగార్జున, టీటీడీ బోర్డ్ మెంబర్‌గా తమ్మిశెట్టి జానకిదేవి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌గా జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాస్‌ను నియమించాం’ అని అన్నారు.  

సెలూన్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

టీడీపీ ఆవిర్భావం నుంచి వెనుకబడిన వర్గాలు తోడుగా ఉన్నాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే... గత ప్రభుత్వం దాన్ని 24 శాతానికి తగ్గించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే బిసిల కోసం ఆదారణ పథకాన్ని తెచ్చాం. 2014 తరువాత ఆదరణ 2 ద్వారా రూ.964 కోట్లు పనిముట్లు కోసం ఖర్చు పెట్టాం. త్వరలో ఆదరణ పథకం-3 తీసుకొస్తాం. బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ బాసటగా నిలుస్తుంది. బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. దేవాలయాల్లో పనిచేసే నాయిబ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంచాం. సెలూన్‌లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం. 40 వేల నాయిబ్రాహ్మణ కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాం. బార్లలోనూ 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. మత్య్సకారులసేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థికసాయం అందించాం. వడ్డెరల కోసం 10 శాతం క్వారీలు కేటాయిస్తాం. యాదవుల కోసం పాడి పరిశ్రమలో ప్రోత్సాహం అందిస్తాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు రూ.98 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. రాబోయే నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్లు బీసీలకు ఖర్చుచేస్తాం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకూ పోరాడతాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వ బెదిరింపులకు బీసీలు బెదరలేదు

వైసీపీ ప్రభుత్వం నాడు అడుగడుగునా బీసీలను అణగదొక్కిందని, అయినా ఆ ప్రభుత్వ బెదిరింపులకు బీసీలు ఏమాత్రం బెదరలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను, పల్నాడులో తోట చంద్రయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గాలకు భయపడని బీసీల కోసం నా చివరి శ్వాస వరకు పనిచేస్తా. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి, స్పీకర్ పదవి సహా పలు కీలక శాఖల మంత్రి పదవులను బీసీలకే ఇచ్చాం.’ అని సీఎం అన్నారు. 


Comments

-Advertisement-