బంగారు కుటుంబాల దత్తతపై రెండు రోజుల్లో నీడ్ అసెస్మెంట్ సర్వే పూర్తి చేయాలి:సిఎస్
బంగారు కుటుంబాల దత్తతపై రెండు రోజుల్లో నీడ్ అసెస్మెంట్ సర్వే పూర్తి చేయాలి:సిఎస్
•బంగారు కుంటుబాల దత్తత స్వచ్ఛందమే(Optional)ఎవరినీ బలవంతం చేయొద్దు
•15లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం కాగా ఇప్పటికే 10.10లక్షల దత్తత
•పి-4 హేండ్ బుక్ లోని సూచనలను పాటిస్తూ అందిరికీ అవగాహన కల్పించండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి,7 ఆగష్టు:బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని ఈవిషయంలో ఎవరినీ బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్,అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు,ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు,జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు,జిల్లాల్లో పిపిపి విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆగష్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10 లక్షల 10వేల బంగారు కుటుంబాలను లక్షా 12వేల మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు.బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు ద్వారా కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసస్మెంట్ సర్వే ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు.స్వర్ణ ఆంధ్ర పి-4 కు సంబంధించి ఇప్పటికే సియం స్థాయిలో అందరు ప్రజాప్రతిధులు,అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని కావున దీనిపై ఎలాంటి సందేహాలకు అవకాశం లేదని అన్నారు.అంతేగాక పి-4పై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హేండ్ బుక్ ను కూడా రూపొందించి అందరు జిల్లా కలక్టర్లకు షేర్ చేయడం జరిగిందని దానిలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుని ఆప్రకారం ఈకార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ హేండ్ బుక్ ను క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందికి కూడా షేర్ చేయాలని సిఎస్ అన్నారు.
అనంతరం జిల్లాల్లో పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్పు ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో భూమిని గుర్తించాలని కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.ఈప్రాజెక్టులు ఏర్పాటుకు సంబంధించి బజ్డెట్లో తగిన నిధులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని కావున దీనిపై కలక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.పట్టణ స్థానిక సంస్థల్లో ఈప్రాజెక్టులు ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించి ఆవివరాలను (ppp.nidhi.apcffs.in)అనే వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 2027-28 నాటికి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు వంతున 175 నియోజవక్గాల్లో 175 ఎంఎస్ఎంఇ ప్రార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికల గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ జిల్లాల్లో ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించాలని కలక్టర్లకు సూచించారు.ఇప్పటికే 98 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటుకు తగిన భూములను కలక్టర్లు గుర్తించగా 54 పార్కులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలు కూడా జరిగాయని వివరించారు.
ఈసమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్,దేవాదాయ,ఆర్థిక శాఖల కార్యదర్శి వినయ్ చంద్,ఏపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్,సిఇఓ ఎంఎస్ఎంఇ విశ్వ,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,ప్రణాళికా శాఖ జెఎస్ అనంత శంకర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
(జారీ చేసిన వారు: డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)