రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా

  • చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
  • చేనేతలకు ఇచ్చిన ప్రతిహామీ ఈ రోజు మేం నిలబెట్టుకున్నాం
  • మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది
  • ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
  • మంగళగిరి నియోజకవర్గ పద్మశాలీ నాయకులకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఇచ్చాం
  • ప్రగడ కోటయ్య  జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నా
  • మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు తో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్


మంగళగిరిః మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు గారితో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా వీవర్ శాలలో ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, వీవర్ శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ‘జై చేనేత’ అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరూ చేనేతలను కార్మికులని అంటారు. కానీ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను. దారానికి రంగు దగ్గర నుంచి మగ్గాలపై చీర నేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు. అద్భుతమైన డిజైన్స్ రూపొందిస్తారు. అందుకే నేతన్నలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చా. 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. కానీ మంగళగిరి పట్టణం నాకు ఆనాడు 7వేల మెజార్టీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను.. చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఐదేళ్లు ఇక్కడే పనిచేసి ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించుకున్నా. 

చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మంగళగిరిలో పద్మశాలీ సోదరులకు రెండు కులవృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరులను ప్రోత్సహించేందుకు 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా సమయంలో చేనేతలకు కావాల్సిన మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందించాం. చేనేతల ఇబ్బందులు స్వయంగా చూసి వీవర్ శాల ఏర్పాటుచేయడం జరిగింది. ఈ రోజు డిజైన్ ల దగ్గర నుంచి ఆధునిక మగ్గాలు, టాటా తనేరా సంస్థతో ఒప్పందం, మార్కెట్ లింకేజీ చేసి చేనేత సోదరులకు ఆదాయం 30 శాతం పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. వారి ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. స్వర్ణకారుల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమం సంఘం ఏర్పాటుచేశాం. వారికి ఆరోగ్య బీమా, మెరుగైన పనిముట్లు, ఆర్థికసాయం అందజేయడం జరిగింది. 

మంగళగిరిని మా గుండెల్లో పెట్టుకున్నాం

యువగళం పాదయాత్రలో ప్రొద్దుటూరు, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేతలను నేరుగా కలుసుకున్నా. వారు పడుతున్న ఇబ్బందులు చూశా. చేనేత సోదరులను దత్తత తీసుకుంటున్నానని ఆనాడు చెప్పా. కొంతమంది ఎగతాళి చేశారు. కానీ నా ఆలోచన ఒక్కటే. చేనేత రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పా. ప్రభుత్వ పథకాలతో పాటు డిజైన్లు, మోడరన్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజీ, ప్రమోషన్.. ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి చేనేత కళాకారుల వస్త్రాలను పెద్దఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబపరంగా మేం పెళ్లికి వెళితే అక్కడ మేం ఇచ్చే చీర కూడా మంగళగిరి చేనేత చీరనే. నేను ప్రధాని, ఇతర రాష్ట్ర, జాతీయ నేతలను కలిసినప్పుడు ఇచ్చేది మంగళగిరి చేనేత శాలువానే. బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక్క షాపులో, అదే రంగు చీర 98 మంది కొనుగోలు చేశారు. మంగళగిరిని మా గుండెల్లో పెట్టుకున్నాం. 

 సీఎం సహకారంతో చేనేతలకు ఇచ్చిన ప్రతిహామీ ఈ రోజు మేం నిలబెట్టుకున్నాం

నేను యువగళంలో చేనేత సోదరులకు కొన్ని హామీలు ఇచ్చా. ఇంట్లో మగ్గాలు ఉంటే 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పా. మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చా. కేంద్రం ఒప్పుకోకపోతే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రిబేట్ ఇస్తామని చెప్పా. త్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటుచేస్తామని చెప్పా. చేనేత భరోసా కింద ప్రతి చేనేతకు ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. స్వర్ణకారులకు ఎప్పుడూ లేనివిధంగా కార్పోరేషన్ ఏర్పాటుచేస్తామని చెప్పడం జరిగింది. గౌరవ సీఎం సహకారంతో ఇచ్చిన ప్రతిహామీ ఈ రోజు మేం నిలబెట్టుకున్నామని చేనేత సోదరులకు తెలియజేస్తున్నా. 

మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది

2019 ఎన్నికల్లో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2024 ఎన్నికల్లో 53వేల ఓట్లతో గెలిపించాలని ఆనాడు నేను కోరా. 91,413 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా. అవసరమైతే చంద్రబాబు , పవనన్నతో పోరాడి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తీసుకువస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. రాష్ట్రం మొత్తం డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుండగా మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. కేంద్రంలో ప్రధాని మోడీ , రాష్ట్రంలో సీఎం చంద్రబాబు , మంగళగిరి గల్లీల్లో మీ లోకేష్. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశాం. మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఒక జోవో వచ్చింది. మొదటి విడతలో వెయ్యి కోట్ల విలువైన భూమిని 3వేల కుటుంబాలకు గౌరవంగా బట్టలు, పసుపు, కుంకుమ పెట్టి పట్టాలు అందించాం. లబ్ధిదారుల నుంచి ఒక్క గ్లాస్ నీరు కూడా తాగలేదు. 

ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

చంద్రబాబు  సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నాం. పీఎం సూర్యఘర్ కింద ఇప్పటికే వెయ్యి కనెక్షన్లు ఏర్పాటుచేశాం. 20 వేల లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుని చంద్రబాబు కి కానుకగా అందిస్తాం. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి-తెనాలి రోడ్డు నిర్మించాం. నాలుగు లేన్ల రోడ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 స్మశానాలు అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను లీప్ స్కూల్ గా అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా తయారుచేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, వంద పడకల ఆసుపత్రి, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్, మోడల్ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్ ప్రాజెక్ట్, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, నిడమర్రు రైల్వేగేట్ దగ్గర బ్రిడ్జ్, ఎయిమ్స్, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చేస్తున్నాం. దేవాలయం వద్ద ఉచితంగా రెండు ఈవీ బస్సులను నడిపిస్తున్నాం. ఇలా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో చేపట్టడం జరిగింది. ఇవన్నీ మేం చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నాపైన, మా కుటుంబంపైన చూపించిన ప్రేమ. 

మంగళగిరి నియోజకవర్గ పద్మశాలీ నాయకులకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఇచ్చాం

మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలీ నాయకులకు మీరు రాష్ట్రస్థాయి గుర్తింపు అందించారు. నందం అబద్దయ్య  పద్మశాలీ కార్పోరేషన్ ఛైర్మన్ గా, తమ్మిశెట్టి జానకమ్మ  టీటీడీ బోర్డు మెంబర్ గా, చిల్లపల్లి శ్రీనివాసరావు  ఏపీఎస్ఎమ్ఐడీసీ ఛైర్మన్ గా నియమించాం. కందుల నాగార్జునను పద్మశాలీ కార్పోరేషన్ డైరెక్టర్ గా నియమించాం. ఇది ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని పద్మశాలీలకు తెలియజేస్తున్నా. 

ప్రగడ కోటయ్య  జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నా

చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగడ కోటయ్య  పద్మశాలీల గుండెల్లో ప్రగడ కోటయ్య  దేవుడిలాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని  సీఎం  కోరుతున్నా. అంతేకాకుండా టిడ్కో హౌసింగ్ లో 6 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పార్క్ కు ప్రగడ కోటయ్య  పేరు పెట్టాలని నిర్ణయించాం. ఆ పార్క్ లో ప్రగడ కోటయ్య  విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు ఖద్దరు, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి వంటి ప్రాంతాల నుంచి పట్టు, నూలు దారాలతో తయారుచేసిన ఏపీ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు  అందజేశారు.    

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్  సలహాదారు సుచిత్ర ఎల్లా, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, టీడీపీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Comments

-Advertisement-