రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఉన్న‌త ప్ర‌మాణాలు నెల‌కొల్పాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఉన్న‌త ప్ర‌మాణాలు నెల‌కొల్పాలి

  • విద్యార్ధుల విద్య‌, ఆరోగ్యంపై అత్యంత శ్ర‌ద్ధ చూపాలి
  • హాస్ట‌ళ్ల‌లో మెనూ ప్ర‌కారం నాణ్య‌మైన‌ ఆహారం అందించాలి
  • ప‌రిశుభ్ర‌ వాతావ‌ర‌ణంలో విద్యార్ధులు చ‌దువుకొనే ప‌రిస్థితులు వుండాలి
  • సీజ‌న‌ల్ వ్యాధుల‌కు గురికాకుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాలి
  • పాముకాటుకు గురైన విద్యార్ధుల‌కు త‌క్ష‌ణ వైద్య‌స‌హాయం అందించాలి
  • హాస్ట‌ళ్ల‌లో చ‌దివే విద్యార్ధులు శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించాలి
  • నిర్ల‌క్ష్యంగా విధులు నిర్వ‌హించే వారిప‌ట్ల క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు
  • వ‌చ్చే ఏడాది హాస్ట‌ళ్ల‌లో సీట్ల‌న్నీ శ‌త‌శాతం భ‌ర్తీ కావాలి
  • విద్యార్ధుల‌కు వార్డెన్లు గార్డియ‌న్‌గా వ్య‌వ‌హ‌రించాలి
  • నీట్‌లో ఈ ఏడాది నుంచి ఎస్‌.సి. విద్యార్ధుల‌కు లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌
  • సాంఘిక సంక్షేమ‌శాఖ ప్రాంతీయ స‌ద‌స్సులో మంత్రి డోల శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి ఆదేశాలు
  • @స్థానిక గీతం విశ్వ‌విద్యాల‌యంలో 9 జిల్లాల అధికారుల‌తో ప్రాంతీయ స‌ద‌స్సు
  • పాల్గొన్న ఆశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.ఎం.నాయ‌క్‌, డైర‌క్ట‌ర్ లావ‌ణ్య‌వేణి


విశాఖ‌ప‌ట్నం, ఆగ‌ష్టు 18 :

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో చేరుతున్న విద్యార్ధులు, విద్యార్ధినుల‌కు మంచి నాణ్య‌త‌తో కూడిన ఆహారం, విద్య అందించ‌డం ద్వారా వారు ప‌రిశుభ్ర‌, ఆరోగ్య‌క‌ర‌, సౌక‌ర్య‌వంత‌మైన‌ వాతావ‌ర‌ణంలో చ‌దువుకొనే ప‌రిస్థితులు క‌ల్పించే దిశ‌గా సంక్షేమ అధికారులు హాస్ట‌ళ్ల‌లో ఉన్న‌త ప్ర‌మాణాలు నెల‌కొల్పేందుకు కృషిచేయాల‌ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోల శ్రీ‌బాల వీరంజ‌నేయ స్వామి ఆదేశించారు. న‌గ‌రంలోని రుషికొండ‌లో వున్న గీతం విశ్వ‌విద్యాల‌యంలోని మ‌ద‌ర్ థెరిసా ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రాంతీయ స‌దస్సు సోమ‌వారం నిర్వ‌హించారు. ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, అల్లూరి సీతారామ‌రాజు, ఉమ్మ‌డి తూర్పుగోదావారి జిల్లాలోని కాకినాడ‌, డా.అంబేద్క‌ర్ కోన‌సీమ‌, తూర్పుగోదావారి త‌దిత‌ర తొమ్మిది జిల్లాల‌కు చెందిన సాంఘిక సంక్షేమ ఉప సంచాల‌కులు, సంక్షేమ అధికారులు, స‌హాయ సంక్షేమాధికారులు, హాస్ట‌ళ్ల సంక్షేమాధికారులు 230 మంది ఈ స‌దస్సులో పాల్గొన్నారు. హాస్ట‌ళ్ల‌లో సీట్ల భ‌ర్తీ, ఎస్‌.ఎస్‌.సి., ఇంట‌ర్‌లో విద్యార్ధుల ఉత్తీర్ణ‌త‌, హాస్ట‌ల్ భ‌వ‌నాల మ‌ర‌మ్మ‌త్తులు, డైట్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, మెనూ ప్ర‌కారం నాణ్య‌మైన భోజ‌న వ‌స‌తి క‌ల్పించ‌డం, హాస్ట‌ళ్ల త‌నిఖీలు త‌దిత‌ర అంశాల‌పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ డైర‌క్ట‌ర్ లావ‌ణ్య‌వేణి, ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.ఎం.నాయ‌క్‌ల‌తో క‌ల‌సి మంత్రి జిల్లాల వారీగా, అంశాల వారీగా స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి డా.శ్రీ‌బాల వీరాంజ‌నేయ‌స్వామి మాట్లాడుతూ హాస్ట‌ల్‌లోని విద్యార్ధులు, విద్యార్ధినుల‌కు వార్డెన్‌లే గార్డియ‌న్‌లుగా వ్య‌వ‌హ‌రించి వారిని ప్ర‌తిభావంతులైన విద్యార్ధులుగా తీర్చిదిద్దే బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. ఎస్‌.సి. విద్యార్ధుల‌ను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌ని, వాటిని ఆయా విద్యార్ధులు వినియోగించుకొనేలా వార్డెన్లు చొర‌వ చూపాల‌ని కోరారు. ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి గ‌త ఏడాది నీట్‌లో కొద్దిపాటి ర్యాంకు తేడాతో సీట్లు పొంద‌లేక‌పోయిన ఎస్‌.సి. విద్యార్ధుల కోసం సాంఘిక సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలో లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్టు మంత్రి చెప్పారు. ఈ ఏడాది సీటు సాధించ‌లేని వారెవ‌రైనా వుంటే వారిని లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ వినియోగించుకొనేలా ప్రోత్స‌హించాల‌ని కోరారు. హాస్ట‌ళ్ల‌లో చ‌దివిన ఏఒక్క విద్యార్ధి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో ఫెయిల్ కావ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టంచేశారు.

హాస్ట‌ళ్ల‌లో వంద‌శాతం ప్ర‌వేశాలు జ‌రిగి సీట్ల‌న్నీ భ‌ర్తీ కావ‌ల‌సి వుంద‌ని మంత్రి స్ప‌ష్టంచేశారు. శత‌శాతం సీట్ల భ‌ర్తీ వ‌చ్చే ఏడాది నుంచి జ‌ర‌గాల‌ని స్ప‌ష్టంచేశారు. ఈ ఏడాది వర‌కు క‌నీసం 75శాతం సీట్లు భ‌ర్తీ కావాల‌న్నారు. హాస్ట‌ళ్ల‌లో చ‌దివే విద్యార్ధులంతా శత‌శాతం ఉత్తీర్ణ‌త సాధించి హాస్ట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నారు. హాస్ట‌ళ్ల‌లో మెరుగైన ప‌రిస్థితులు వుండి, నాణ్య‌మైన భోజ‌నం, విద్య అందించిన‌పుడు, త‌మ పిల్ల‌ల‌కు హాస్టల్‌లో చ‌దివిస్తే మంచి భ‌విష్య‌త్తు వుంటుంద‌ని త‌ల్లిదండ్రుల్లో భ‌రోసా క‌లిగిన‌పుడు హాస్ట‌ళ్ల‌లో చేర్పించేందుకు వారు పోటీప‌డ‌తార‌ని మంత్రి స్పష్టం చేశారు. వ‌చ్చే ఏడాది నుంచి శ‌త‌శాతం హాస్ట‌ల్ సీట్లు భ‌ర్తీచేయ‌లేని వార్డెన్ల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.

హాస్ట‌ళ్ల విద్యార్ధుల‌కు ప్ర‌తినెలా క్ర‌మం త‌ప్ప‌కుండా వైద్యాధికారుల‌తో ఆరోగ్య త‌నిఖీలు చేయిస్తూ వారి ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారు. ప్ర‌తినెలా వైద్యాధికారులు, వారానికోసారి ఏ.ఎన్‌.ఎం.ల ద్వారా ఆరోగ్య త‌నిఖీలు చేయించాల‌న్నారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని నిత్యం గ‌మ‌నిస్తూ ఏ విద్యార్ధి అయినా అనారోగ్యానికి గురైన వెంట‌నే త‌క్ష‌ణ వైద్యం అందించాల‌న్నారు. పాము కాటుకు గురైన విద్యార్ధుల‌కు స‌హాయం అందించ‌డంలో జాప్యం జ‌రిగితే వారి ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డుతుంద‌ని, అటువంటి ప‌రిస్థితుల‌కు తావులేకుండా వెనువెంట‌నే వైద్యం అందేల చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వ‌ర్షాకాలంలో మ‌లేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్ర‌బ‌లి, విద్యార్ధులు వీటికి గుర‌య్యే అవ‌కాశం వుంద‌ని అందువ‌ల్ల హాస్ట‌ళ్ల‌లో నీరు నిల్వ‌లేకుండా చూడ‌టం, వేడిచేసిన నీటిని అందించ‌డం, పారిశుద్ధ్య ప‌రిస్థితులు నెల‌కొల్ప‌డం ద్వారా కాలానుగుణ వ్యాధులకు తావులేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

విద్యార్ధుల‌కు మెనూ ప్ర‌కారం నాణ్య‌మైన ఆహారాన్ని అందించాల‌ని మంత్రి ఆదేశించారు. మెనూ అమ‌లుపై ప‌ర్య‌వేక్ష‌ణకు విద్యార్ధుల‌తో కూడిన క‌మిటీలు వేయాల‌ని చెప్పారు. హాస్ట‌ళ్ల‌లో అందిస్తున్న ఆహారం నాణ్య‌త‌పై విద్యార్ధుల త‌ల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటామ‌ని పేర్కొన్నారు.

వార్డెన్లు విద్యార్ధుల‌తో పాటుగా హాస్ట‌ళ్ల‌లోనే బ‌స‌చేయాల‌ని అప్పుడే విద్యార్ధులు హాస్ట‌ల్ బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి ఏర్ప‌డ‌ద‌ని చెప్పారు. బ‌య‌ట‌కు వెళ్లి రోడ్డుప్ర‌క్క‌న దొరికే తినుబండారాలు తీసుకోవ‌డం వ‌ల్ల విద్యార్ధులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నార‌ని, దీనిని నివారించి హాస్ట‌ల్‌లోనే వారికి ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని అందించాల‌న్నారు.

స‌హాయ సంక్షేమాధికారులు, ఉప సంచాల‌కులు త‌మ‌కు కేటాయించిన ల‌క్ష్యం మేర‌కు హాస్ట‌ళ్ల‌ను ప్ర‌తినెల‌లో త‌నిఖీచేసి నివేదిక‌లు అంద‌జేయాల‌ని ఆశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.ఎం.నాయ‌క్ ఆదేశించారు. రానున్న రోజుల్లో సంక్షేమ అధికారుల ప‌నితీరు, సామ‌ర్ధ్యం ఆధారంగానే బ‌దిలీలు చేప‌ట్టేలా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. సంక్షేమ అధికారులంతా బాధ్య‌త‌తో ప‌నిచేసి హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పును తీసుకురావాల‌ని కోరారు. విద్య‌, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అన్ని సూచిక‌ల్లో ప‌నితీరు మెరుగుప‌డేలా ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నామ‌ని పేర్కొన్నారు. హాస్ట‌ళ్ల మ‌ర‌మ్మ‌త్తుల‌కోసం నిధులు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఆ నిధుల‌ను వినియోగించి స‌కాలంలో నాణ్య‌త‌గా మ‌ర‌మ్మ‌త్తులు జ‌రిగేలా ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సూచించారు.

సాంఘిక సంక్షేమ‌శాఖ డైర‌క్ట‌ర్ లావ‌ణ్య‌వేణి మాట్లాడుతూ హాస్ట‌ల్ సంక్షేమ అధికారుల‌కు ప్ర‌తినెలా 7వ తేదీలోపు డైట్ బిల్లులు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాల‌ని, వాటిని స‌హాయ సంక్షేమాధికారులు ప‌రిశీలించి ఆనెల 16లోపు ట్ర‌జ‌రీలో స‌మ‌ర్పించాల‌ని చెప్పారు.

ఈ స‌మావేశంలో విశాఖ జిల్లా ఉప సంచాల‌కులు కె.రామారావు, రాష్ట్ర కార్యాల‌యం డి.డి. ల‌క్ష్మీ సుధ, అన్ని జిల్లాల డి.డి.లు, ఏ.ఎస్‌.డ‌బ్ల్యు.ఓ.లు, హెచ్‌.డ‌బ్ల్యు.ఓ.లు పాల్గొన్నారు.

Comments

-Advertisement-