ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- కేవలం 15 మాసాల్లో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఖరారు
- రాష్ట పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్
అమరావతి/కర్నూలు, సెప్టెంబరు 11 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలోని ప్రధాన ప్రతి పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించి తీరుతామని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది చెందుచున్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరోగమనంలో ఉన్న పారిశ్రామిక అభివృద్ది నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో పురోగమనంలో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందున, ఆయన మీద ఉన్న విశ్వాసంతో ప్రభుత్వం ఏర్పడి కేవలం 15 మాసాల కాల వ్యవధిలోనే దాదాపు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఖరారు అయ్యాయన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుచున్న పారిశ్రామిక పురోగమనాన్ని ఓర్వలేని ప్రధాన ప్రతి పక్షం తప్పుడు కథనాలతో విషం చిమ్ముతున్నదన్నారు. ఏ పరిశ్రమకు అయినా భూమిని కేటాయించే విషయంలో ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నో స్థాయిల్లో వెరిఫికేషన్లు అయిన తదుపరి మాత్రమే ఆ భూమికి సేల్ అగ్రిమెంట్ చేయడం జరుగుతుందన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్థేశించిన నిబంధలను నెరవేర్చిన తదుపరే సేల్ డీడ్ చేయడం జరుగుతుందన్నారు. అయితే ఈ ప్రక్రియపై ప్రధాన ప్రతిపక్షానికి ఎటు వంటి అవగాహన లేకుండా ఇప్కో, హెచ్.ఎఫ్.సి.ఎల్., ఎలీప్, వారాహి ఆక్వా ఫార్ము మరియు జై కుమార్ సంస్థలకు అడ్డగోలుగా భూములు ఇవ్వడం జరిగిందనే తప్పుడు కథనంతో విషం జిమ్మడం జరిగిందన్నారు. ఇప్కో, హెచ్.ఎఫ్.సి.ఎల్., ఎలీప్ సంస్థలకు గతంలోని ఒప్పందాల మేరకే భూములను కేటాయించడం జరిగిందని, వారాహి ఆక్వా ఫార్ము మరియు జై కుమార్ సంస్థలు వారి సొంత స్థలాల్లో ప్రైవేట్ పార్కుల అభివృద్దికి అనుమతించడం జరిగిందన్నారు. ఈ భూములతో ఏపిఐఐసి కి ఏమాత్రం సంబందం లేదన్నారు. ప్రధాన ప్రతి పక్షం అనేది నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ రాష్ట్రాభివృద్దికి సహకరించాలే కానీ, ఇటు వంటి తప్పుడు కథనాలతో రాష్ట్ర పురోభివృద్దిని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రధాన ప్రతి పక్షం తమ ప్రవర్తనను మార్చుకోకుండా ఇదే పందాలో ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో మరింత ఘోర పరాభవానికి గురి కాక తప్పదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.