అన్నదాతను మోసగించిన వైసీపీ ప్రభుత్వం
అన్నదాతను మోసగించిన వైసీపీ ప్రభుత్వం
- వైసీపీ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు
- గత ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు
- పంటల భీమా పేరుతో రైతులను జగన్ మోసం చేశాడని మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించి... ఒక్క కేజీ కూడా కొనలేదు జగన్
- వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, ఆక్వా రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి
- వైసీపీ పాలనలో రైతులు మోసపోయారు... కూటమి పాలనలో రైతులు నమ్మకంగా ముందుకు సాగుతున్నార
- రైతు సంతోషం కోసం, అన్నదాత ఆర్ధిక అభివృద్ధికై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న మంత్రి అచ్చెన్నాయుడు
అనంతపురం, సెప్టెంబర్ 09: వైసీపీ పాలనలో రైతులను నరకం అనుభవించేలా చేశారని, యూరియా కోసం రైతులు రాత్రిళ్లు క్యూలలో నిలబడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభాప్రాంగణం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఉచిత పంటల భీమా పేరుతో రైతులను మోసం చేశాడని, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించినా ఒక్క కేజీ కూడా కొనలేని చేతకాని వాడు జగన్ అని మండిపడ్డారు. వ్యవసాయ , పశు సంవర్ధక , మత్స్యరంగాలను సర్వనాశనం చేసి, నేడు కూటమి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ క్షణక్షణం పని చేస్తోందని, రైతులు ఇబ్బందిపడకుండా ముందుగానే యూరియా, విత్తనాలు, భీమా, మద్దతు ధరలతో సహాయాన్ని అందిస్తోందని అని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామం, రాష్ట్రం బాగుంటాయని, రైతును మోసం చేసిన వైసీపీ పాలనకు రైతులు గుణపాఠం చెప్పారని, రైతు సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సరళీకృతంగా యూరియా సరఫరా
వైసీపీ ప్రభుత్వ కాలంలో యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 81వేల హెక్టార్లలో అధికంగా పంటలు వేయడం మరియు వ్యవసాయంలో యూరియా వాడకాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వలన రైతులు భయపడి, భవిష్యత్ అవసరాల కొరకు యూరియాని అధికంగా కొనుగోలు చేయటం వలన యూరియా డిమాండ్ అనూహ్యంగా పెరిగిందన్నారు. మధ్యలో ఒక నెల డ్రై స్పెల్ వచ్చి తరువాత ఒకేసారి వర్షాలు విస్తారంగా పడటం వలన ఎరువుల అవసరం పెరిగి యూరియా సరఫరా పై ఒత్తిడి పెరిగిందని, వాస్తవానికి ఖరీఫ్ సీజన్ కి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 6.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసామని తెలిపారు. నేటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా షాపుల్లోనూ మరియు ఆర్.ఎస్.కే. ల ద్వారా అమ్మకానికి సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర ప్రభుత్వం అదనంగా 49,367 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, దీంతో పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందుబాటులో ఉండి, యూరియా కొరత పూర్తిగా తీరిపోతుందన్నారు. రాబోయే రబీ కాలానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ముందస్తుగానే కేంద్రం ఇప్పటికే కేటాయించిందని తెలిపారు. 50% ప్రయివేటు డీలర్లు, 50% ప్రభుత్వ సంస్థల ద్వారా యూరియా గతంలో అమ్మగా, ప్రభుత్వానికి రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ, 70% ప్రభుత్వం ద్వారా మరియు 30% ప్రయివేటు డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు ప్రారంబించామని అన్నారు. RSK సేవలు మరింత మెరుగుపరిచామని, YCP ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరానికి సరాసరి RSKల ద్వారా 255 కోట్ల విలువ చేసే యూరియా అమ్మకాలు జరగగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో RSKల ద్వారా 292కోట్ల విలువ చేసే యూరియాను సరఫరా చేసామని తెలియజేశారు.
విత్తనాలు & భీమా అందచేస్తూ ప్రోత్సాహాకాలు
వైసీపీ కాలంలో విత్తనాలు ఆలస్యంగా, తక్కువ నాణ్యతతో చేరాయని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు రాయితీతో 4.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించామని తెలిపారు. కంటింజెంట్ విత్తనాలను 80% రాయితీతో ఇచ్చామని అన్నారు. పంటల భీమా విషయంలో వైసీపీ హయాంలో రైతులు మోసపోయారని, ఉచిత భీమా అంటూ మోసగించి, ప్రీమియం చెల్లింపులు చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 2019 తరువాత పంటల భీమా పూర్తిగా విఫలం అయిందని, 2018-19 తరువాత ఏ రబీ సీజన్లో కూడా ఎలాంటి భీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఉచిత పంటల భీమా అని చెప్పి 2020-21లో ఖరీఫ్ కి మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకున్నారని, తరువాత PMFBYతో కలిసి ఉచిత పంటల భీమా అమలు చేస్తాం అని ప్రకటించి, రైతుల వాటా, రాష్ట్రం వాటా రెండిటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని హామీ ఇచ్చి, 2022 ఖరీఫ్ తరువాత ప్రీమియం సబ్సిడీ చెల్లింపు చేయకుండా ఇచ్చిన హామీని గాలికి వదిలేసి, రైతులను నట్టేట ముంచారని, దీని కారణంగా 2022-23 రబీ నుండి రైతులకు భీమా పరిహారం సరైన సమయానికి చెల్లించక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కూటమి కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలిచి, సమయానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.
ఉద్యాన పంటలు & వాణిజ్య పంటల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు
గత ప్రభుత్వం 9 ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందాని, ఏ ఒక్క పంటలో ఒక్క కేజీ అయినా కొనుగోలు చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల ధరలు కూడా పడిపోయినప్పుడు, రైతులకు అండదండగా నిలిచి వారిని ఆదుకుందని అన్నారు. HD బర్లీ పొగాకు ధర పడిపోతే 271 కోట్లు వెచ్చించి 20,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి, ఇప్పటికే 16,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసామని తెలిపారు. ఇంకా మిగిలిన 4000 మిలియన్ కిలోలను కూడా కొంటామని, ఇంకో 60వేల మిలియన్ కిలోలను ప్రైవేట్ వర్తకుల ద్వారా కొనుగోలు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 3 సందర్భాలలో టొమాటో ధర పడిపోతే, 4599 మెట్రిక్ టన్నుల టొమాటో పంటను కొనుగోలు చేసి 11.25 కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతులనుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని అన్నారు. 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 లక్షలు చెల్లించామని, 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770/-లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, రైతులను మోసం చేసారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం క్వింటాలుకి రూ.1200/-లు మద్దతు ధర ప్రకటించి, ఇచ్చిన మాటకు కట్టుబడి, అదే ధరకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కోకో ధరలు పడిపోతే 3776 మంది రైతుల నుండి కేజీకి రూ.50/- అదనంగా ఇచ్చి కొనుగోలు చేసాము. ఇందుకు గాను 11.8 కోట్లు చెల్లించాము. తోతాపురి మామిడి ధర పడిపోతే, 51వేల మంది రైతుల నుండి 4.3 లక్షల టన్నుల మామిడి కొనుగోలు చేసి కేజీకి రూ.4/-లు చొప్పున 171 కోట్లు చెల్లించాము. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మిర్చీకి క్వింటాకి రూ.11,781/-లు మార్కెట్ జోక్యపు ధరను కల్పించాము. ప్రభుత్వం నుండి హామీ లభించటంతో మార్కెట్లో మిర్చీ ధర స్థిరీకరించబడి రూ.11,781/-లు కంటే అధికంగా ట్రేడ్ అయింది. దీంతో MIS పధకం అమలు చేయాల్సిన అవసరం రాలేదు. 2017లో మిర్చీ ధరలు పడిపోతే ప్రభుత్వం 55 వేల మంది రైతులకు క్వింటాకి రూ.1500/- చొప్పున 130 కోట్లు చెల్లించాము. అదే మీ ప్రభుత్వం హయాంలో 2020 సంవత్సరంలో మార్కెట్ ధర 12000/-లు ఉంటే మద్దతు ధర రూ.7000/-లు ప్రకటించి కొనడానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి ధరలు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, 2025-26 బడ్జెట్ లో 300 కోట్లు కేటాయించాము. అదనంగా అవసరం అయితే పెంచడానికి కూడా సిద్దంగా ఉన్నాం.
సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత – సుఖీభవ పధకం అమలు కోసం బడ్జెట్ లో 6300 కోట్లు కేటాయించాము. ప్రతి రైతుకీ రూ.20,000/- ప్రకటించడమే కాకుండా, మొదటి విడతగా రూ.7000/- చొప్పున రూ.3,174/- కోట్లు చెల్లించాము. (2,343 కోట్లు రాష్ట్ర వాటా + 831 కోట్లు కేంద్రం వాటా). దీనివల్ల 46.86 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
ఉద్యానవన పంట హబ్ గా రాయలసీమ
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల హబ్ గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పాన్ని, గత ప్రభుత్వ పాలకులు సర్వనాసనం చేసారు. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని రాయలసీమలో ప్రతి ఎకరానికి 100% ఇవ్వాలనే సంకల్పంతో 2014-19లో ప్రణాళికాబద్దంగా పనిచేసాము. అందులో భాగంగా డ్రిప్ పరికరానికి మా ప్రభుత్వం 90 శాతం రాయితీని కల్పించగా, మీ ప్రభుత్వం దానిని 70% కి తగ్గించింది. SC & STలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100% రాయితీని, 90%కి తగ్గించింది. అదేవిధంగా, మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు చెల్లించాల్సిన 1166 కోట్ల బకాయిలను చెల్లించకపోవటంతో, రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా సర్వనాసనం అయింది. దీంతో కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచేసిన బకాయిలను చెల్లించటంతో పాటు, రాయలసీమ జిల్లాకు రాయితీని 70% నుండి 90%కి పెంచాము. అదేవిధంగా, SC & ST రైతులకి 90% నుండి 100% రాయితీని పెంచాము. దీంతో, మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోనే మన రాష్ట్రం ప్రధమ స్థానం పొందింది. అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూర దృష్టితో, ఆయిల్ పామ్ సాగులో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం లో ఉండగా, గత YCP ప్రభుత్వంలో ఆయిల్ పామ్ సాగుకి కేంద్రం ఇచ్చే నిధులు కూడా వారు వినియోగించుకోలేదు. దీనివలన రైతులు రూ.194/-ల మొక్కను బ్లాక్ మార్కెట్ లో రూ.400/- నుండి రూ.500/- వరకు కొనాల్సిన పరిస్థితి వచ్చించి. కాని మా ప్రభుత్వం అదే ఆయిల్ పామ్ మొక్కని రాయితీ పై ఉచితంగా రైతులకు అందిస్తున్నాము.
వైసీపీ ప్రభుత్వం పశు భీమా, ఆరోగ్య శిబిరాలను పూర్తిగా నిలిపివేసింది
పశు భీమా పధకాన్ని, పశు ఆరోగ్య శిభిరాలను గత YCP ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూగ జీవాల ఉసురు తీసారు. కూటమి ప్రభుత్వం 13957 పశు ఆరోగ్య శిభిరాలను నిర్వహించి,సకాలంలో మూగ జీవాలకు ఉచిత వైద్యం మరియు మందులు సరఫరా చేసాము. పశు భీమా ప్రీమియం గతంలో రైతు 50% చెల్లిస్తే, 50% ప్రభుత్వం భరించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక, పశు రైతులను ఆదుకోవడానికి 85% ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పశు భీమా పరిహారం 37,500/- నుండి 50,000/-లకు పెంచాము. 100% సబ్సిడీతో గడ్డి విత్తనాలను 50% సబ్సిడీతో పసుగ్రాసాన్ని అందిస్తున్నాము. 25,000 గోకులాలను నిర్మించాము. కృత్రిమ గర్భధారణ స్ట్రా ధరను రూ.500/-ల నుండి రూ.150/-కి తగ్గించాము.
మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీశింది. కానీ కూటమి ప్రభుత్వం సముద్ర వేట నిషేధ కాల భృతిని కుటుంబానికి రూ.10,000/- నుండి రూ.20,000/-లకు పెంచాము. తద్వారా, అర్హులైన 1,21,433 మంది మత్సకారులకు 242.8కోట్లు చెల్లించాము. గతంలో అనేక కారణములు చెప్పి తొలగించిన 21,000 మంది మత్సకారులకు పధకాన్ని వర్తిoపచేసాము. గత ప్రభుత్వం బకాయి పడ్డ మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ రాయితీని మా ప్రభుత్వం చెల్లించి, ప్రస్తుత బడ్జెట్ లో 50కోట్ల రూపాయలు కేటాయించాము. మరణించిన 63 మంది మత్స్య కారులకు 3.15కోట్లు నష్ట పరిహారం చెల్లించాము. సముద్ర తీర మత్స్య కారులు దూర ప్రాంతానికి వేటకు వెళ్ళకుండా తీరానికి దగ్గరలో చేపలు దొరికే విధంగా చేయడానికి 770 లక్షలు పెట్టి 22 కుత్రిమ అవాసాలు ఏర్పాటు చేసాము. ఇంకో 175 ఏర్పాటు చేస్తాము. మత్స్యకారుల ఆదాయం పెంచడానికి సముద్రపు నాచు పెంపకాన్ని రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము. ఇందుకు 1250 మత్సకార మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చాము. PMMSY క్రింద 404 యూనిట్ల పడవలు మరియు ఇంజన్లు సరఫరా చేసాము. 30 కోట్లతో తీరప్రాంత ఆవాసాల్లో మౌళిక వసతులు పెంపుచేస్తున్నాం. మంచినీటి మత్స్యకారుల హక్కులు కాపాడటానికి జీవో ఎమ్ ఎస్ నెం 27 ద్వారా జీవో ఎమ్ ఎస్ నెం 217 ను రద్దు చేశాం. ఆక్వా రైతులను ఆదుకోవడానికి యూనిట్ కి రూ.1.50/- సబ్సిడీ రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందుకు గత సంవత్సరం 803 కోట్లు ఖర్చు చేశాం. 88 కోట్లతో బాపట్లలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆక్వా చెరువుల రిజిష్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
