రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విద్యుత్ ప్ర‌మాదాల నివార‌ణే ల‌క్ష్యంగా ప‌ని చేయండి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విద్యుత్ ప్ర‌మాదాల నివార‌ణే ల‌క్ష్యంగా ప‌ని చేయండి

  • మాన‌వ త‌ప్పిదాలు, నిర్వ‌హ‌ణ లోపాలు స‌రి చేయండి
  • ప్ర‌మాదాల నివార‌ణ‌కు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో అవ‌గాహ‌న‌
  • విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1912 కు విస్త్ర‌త ప్ర‌చారం క‌ల్పించండి
  • ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ అధికారుల స‌మీక్ష‌లో మంత్రి గొట్టిపాటి


అమ‌రావ‌తి - విద్యుత్ ప్ర‌మాదాల శాశ్వ‌త నివార‌ణే ల‌క్ష్యంగా ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ అధికారులు ప‌ని చేయాల‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జ‌ర‌గ‌డానికి గల కారణాలను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సంద‌ర్భంగా కొంద‌రు అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఏడాదికి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రమాదాలు జ‌రిగిన త‌రువాత బాధితుల‌కు కేవలం న‌ష్ట ప‌రిహారం చెల్లించడమే సమాధానం కాదన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ ఎటువంటి విద్యుత్ ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా నివారించ‌డ‌మే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయ‌న‌ స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల ప్రాణ ర‌క్షణే కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌ధ‌మ ప్రాధాన్య‌త‌గా పేర్కొన్న మంత్రి గొట్టిపాటి., ప్ర‌మాదాల వ‌ల‌న ఇక‌పై ఎవ‌రూ న‌ష్ట పోకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా విద్యుత్ ప్ర‌మాదాల విష‌యంలో ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

సాంకేతిక‌త వినియోగంతో.....

విద్యుత్ ప్రమాదాల నివారణకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం అవసరమని మంత్రి గొట్టిపాటి అధికారుల‌కు సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత‌ డిస్కంలకు సమగ్ర నివేదిక పంపాల‌ని ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను విస్తృతంగా ప్రచారం చేసి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని మంత్రి సూచించారు. విద్యుత్ ప్ర‌మాదాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సోష‌ల్ మీడియా, మీడియా వేదిక‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌న్నారు. భ‌విష్య‌త్తు తరాల వారికి కూడా అవగాహన కల్పించడం ద్వారా పూర్తి స్థాయి ప్రమాదాల నివారణ సాధ్య‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల‌కు విద్యుత్ ప్ర‌మాదాల నివార‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల ప‌ట్ల‌ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హించాల‌ని మంత్రి సూచించారు. అదే విధంగా పక్క రాష్ట్రాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న‌ విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అధికారులను ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ అధికారుల‌తో పాటు పలువురు ఇంధ‌న శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-