వచ్చే రెండేళ్లలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు
వచ్చే రెండేళ్లలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు.
గృహ ప్రవేశం చేసిన ఇండ్లను ఒక్కొక్కటిగా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి చాప మీద కూర్చొని వారిచ్చిన అల్పాహారం తీసుకున్నారు. గృహ ప్రవేశం చేసిన కుటుంబాలకు చీరలను బహూరకరించారు. గృహ ప్రవేశం చేసిన సందర్భంగా కుటుంబ సభ్యుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా. సన్నబియ్యం వస్తున్నాయా. రేషన్ కార్డులు వచ్చాయా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని ప్రశ్నించినప్పుడు 312 ఇండ్లు మంజూరైనట్టు ఆనందంగా చెప్పారు.
ఇండ్లు మంజూరైన వారంతా సంతోషంగా, చల్లగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ పిల్లలను బాగా చదివించాలని, వారికి పెళ్లిళ్లయ్యాక వారికీ ఇండ్లిస్తామని చెప్పారు. గృహ ప్రవేశం చేసుకున్న ముహూర్తాన చిరు జల్లులు కురవడం శుభసంకేతమని అన్నారు.
గడిచిన పదేండ్లలో ఏటా రెండు లక్షల ఇండ్లు కట్టినా రాష్ట్రంలో ఇప్పటికి 20 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని అన్నారు. మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెబుతూ, వచ్చే రెండేండ్లలో మరో నాలుగున్న లక్షల ఇండ్లిస్తామని ప్రకటించారు.