యాచించే స్థాయి పోయింది... శాసించే స్థాయికి రావాలి
యాచించే స్థాయి పోయింది... శాసించే స్థాయికి రావాలి
- స్వదేశీ సంత... గ్లోబల్ సంతగా ఎదగాలి
- సొంతంగానే శాటిలైట్లను లాంఛ్ చేస్తున్నాం
- స్వదేశీ వస్తు కొనుగోళ్లు అనేది నినాదంగానే కాదు ఉద్యమంగా మారాలి
- ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
విజయవాడ, అక్టోబర్ 2: భారత దేశం యాచించే స్థాయిని దాటిపోయిందని... ఇకపై శాసించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆత్మ నిర్భర్ అభియాన్ లో భాగంగా స్వదేశీ ఖాదీ సంత కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఏర్పాటు చేశారు. వేదిక వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. దేశీయంగా చేతివృత్తుల కళాకారులు ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను, ఆర్గానిక్ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఖాదీ ఉద్యమంలో... స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను సీఎం సందర్శించారు. ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”దసరా రోజు సంకల్పించిన పని విజయవంతం అవుతుంది. స్వదేశీ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఖాదీ సంత, స్వదేశీ సంత భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందని ఆశిస్తున్నాను. ఆ దిశగానే భారత్ ముందడుగులు వేస్తోంది. విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీ గురించి పిలుపునిచ్చారు. అందుకే బీఎస్ఎన్ఎల్ ఇటీవలే స్వదేశీ 4 స్టాక్ ను దేశప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయి.”అని సీఎం చెప్పారు.
దేశ ఆర్థిక వృద్ధి సాధించడమే భరతమాతకు నిజమైన నివాళి
“గతంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి భారత్ ఇప్పుడు పటిష్టమైన స్థానానికి ఎదిగింది. 2038కి ఆర్ధికంగా రెండో స్థానానికి భారత్ చేరుతుంది. 2047 నాటికి అగ్రస్థానంలోకి వస్తాం. ఇదే భారత మాతకు నిజమైన నివాళి అవుతుంది. గతంలో శాటిలైట్ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వారు కూడా ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేశాం. ప్రధాని మోదీ భారత దేశ మూలాలను ఎప్పుడూ గుర్తు తెస్తూనే ఉంటారు. ఆ మూలాలను వదిలిపెట్టకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ మూలాలు ఎప్పుడూ మర్చి పోకూడదు. స్వాతంత్ర్యానికి పూర్వం 60 శాతం ఎగుమతులు భారత్ నుంచి జరిగేవి. ఆ తర్వాత పరిస్థితులు మారి విదేశీ వస్తువులు మనం వాడే స్థితికి చేరుకున్నాం. ఈ పరిస్థితి మారాలి. బీ ఇండియన్ బై ఇండియన్ అన్న నినాదం దేశమంతా రావాలి. దేశంలో ఉండే జనాభా మనకు అతిపెద్ద ఆస్తి, సంపద, అతిపెద్ద మార్కెట్. మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్ పెరిగి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తుల కోసం విదేశీ వస్త్రాలను తగులబెట్టమని గాంధీజీ పిలుపునిచ్చారు. గాంధీజీ ఆ పిలుపే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరైంది. గాంధీజీ నూలు వడికిన రాట్నమే స్వాతంత్ర్యపోరాటానికి స్పూర్తిని ఇచ్చింది. ఆ మహనీయుడు సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నినాదాలతో పాటు... స్వదేశీ నినాదం కూడా ఇచ్చారు. జైజవాన్, జైకిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చి స్పూర్తిని నింపారు. ఇప్పుడు వాళ్లిద్దరి స్పూర్తితో మళ్లీ స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. దేశ ఆర్థిక అభివృద్ధికి తొడ్పడాలి. అందరికీ మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే జీఎస్టీ 2.0 సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణల కారణంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడా ప్రభుత్వ ఆదాయం తగ్గడం లేదు. కేవలం ధనికుల కోసమే సంస్కరణలు కాదు, ప్రజలందరికీ సమానంగా ఆ ఫలాలు అందటం కోసమే సంస్కరణలు.” అని ముఖ్యమంత్రి అన్నారు.
మన ఉత్పత్తులను మనమే ప్రమోట్ చేసుకుందాం
“స్వదేశీ వస్తువుల తయారీతో పాటు వాటి వినియోగమూ దేశంలో పెద్ద ఎత్తున పెరగాలి. రాష్ట్రంలోని చాలా ఉత్పత్తులు ఉన్నాయి.. వాటికి బ్రాండింగ్ వచ్చేలా చేయాలి. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయి. వీటని మనమే ప్రమోట్ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంతోపాటు.. మన ఆర్థిక వృద్ధికి తొడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ప్రతీ పౌరుడూ ముందుకు రావాలి. అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అవుతుంది. ఏటికొప్పాక, కొండపల్లి తదితర కళల్ని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన స్వదేశీ ఉత్పత్తి అరకు కాఫీని ప్రమోట్ చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి బ్రాండ్ గా అరకు కాఫీ మారుతోంది. ఒక చిన్న ప్రభుత్వ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణుల్ని తయారు చేయగలిగాం. ఇప్పుడు ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తీసుకువచ్చాం. సంస్కరణలను అందిపుచ్చుకోవాలి. అన్ని విధాలా వృద్ధి సాధించాలి. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని వాజ్ పేయి సంస్కరణలకు జవసత్వాలు ఇచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి తొడ్పాటునిస్తామని... ఆ దిశగా అడుగులు వేస్తామని విజయదశమి రోజున సంకల్పం తీసుకుందాం. దశమి రోజు సంకల్పం తీసుకుంటే... దాన్ని సాధించుకునే అవకాశాలు వాటంతటవే వస్తాయి.” అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక కూటమి నేతలు, ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్గొన్నారు.
