మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
- ధరలు తగ్గించకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయని హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్లు, పాప్‌కార్న్, పానీయాల ధరలు అమాంతం పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు అందరి సామర్థ్యానికి అందేలా ఉండాలి, లేని పక్షంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి ఓటిటీలను ఆశ్రయించే పరిస్థితి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఇప్పటికే సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అధిక ధరలు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చని జస్టిస్ విక్రమ్ నాథ్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో ధర్మాసనం మాట్లాడుతూ, నీరు, కాఫీ, పాప్‌కార్న్ వంటి సాధారణ వస్తువులకు అధిక ధరలు వసూలుచేయడం ప్రజలపై భారం మోపుతున్నట్టేనని వ్యాఖ్యానించింది.
ధర్మాసనం ప్రత్యేకంగా పేర్కొంటూ, టికెట్ ధరలు మరియు థియేటర్లలో అమ్మే ఆహార ధరలు నియంత్రణలో ఉంటే పరిశ్రమకు మంచిదని, లేదంటే థియేటర్లు ఖాళీ కావాల్సి వస్తుందని స్పష్టం చేసింది. టికెట్ ధర రూ.200గా ఉండాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే ధరలు సహేతుకంగా ఉండాలని, లేకపోతే హాళ్లు వెలిసి పోవడం ఖాయమని ధర్మాసనం అభిప్రాయపడింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, ధరలను నిర్ణయించడం మల్టీప్లెక్స్‌ల పరిధిలోనే ఉంటుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం తగదని చెప్పారు. ఉదాహరణగా, హోటళ్లలో అధిక ధరలు వసూలు చేస్తే వాటిపై నియంత్రణ కోరరే, ఇదీ అలాంటిదేనని ఆయన వాదించారు. కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలుదారుల ఐడీ వివరాలు నమోదు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చాలా టికెట్లు ఆన్‌లైన్ ద్వారా అమ్ముడవుతున్నాయని, ఐడీ కార్డు చూపిస్తూ టికెట్ కొనడం ప్రాయోగికం కాదని పేర్కొన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వం కేసులో గెలిస్తే అధికంగా వసూలు చేసిన డబ్బును ప్రేక్షకులకు తిరిగి చెల్లించే అవకాశం ఉండేందుకు హైకోర్టు ఆ నిబంధన పెట్టిందని వివరణ ఇచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. అయితే, హైకోర్టు విధించిన మధ్యంతర షరతులైన టికెట్ కొనుగోలుదారుల ఐడీ వివరాలు సేకరించే నిబంధనపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
