పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనం ఒడిగా మార్చిన ఉపాధ్యాయురాలు: నారా లోకేష్ ప్రశంసలు
పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనం ఒడిగా మార్చిన ఉపాధ్యాయురాలు: నారా లోకేష్ ప్రశంసలు
విజయవాడ, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
పాఠశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ప్రకృతి ప్రేమ, పర్యావరణ పరిరక్షణ భావన పెంపొందించే వేదికలుగా మారాలని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా విజయవాడ రూరల్‌లోని వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మనోజ నంబూరి చేస్తున్న వినూత్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్థులతో కలిసి తోటను అభివృద్ధి చేయడం తన అలవాటుగా మార్చుకున్న మనోజ నంబూరి కృషి ఎంతో ఆదర్శనీయం అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేస్తూ, పాఠశాల ప్రాంగణంలో పెంచిన కూరగాయలు, పండ్లను విద్యార్థులు పంచుకోవడం, మధ్యాహ్న భోజనంలో వినియోగించడం వంటి సంప్రదాయం పాఠశాలలో నెలకొల్పడం అభినందనీయమని తెలిపారు.
పిల్లల్లో పర్యావరణంపై ప్రేమను పెంచే ఈ ప్రయత్నం ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా మారాలని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
