మెడికల్ సీట్ల కేటాయింపు ప్రకటన విధానంలో మార్పు
మెడికల్ సీట్ల కేటాయింపు ప్రకటన విధానంలో మార్పు
మొదట ప్రొవిజనల్ లిస్టులు ప్రకటించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
పీజీ సీట్ల ప్రవేశాలకు అమలు చేయనున్న హెల్త్ యూనివర్శిటీ
వివిధ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల తుది జాబితాలను ప్రకటించే ముందు ప్రొవిజనల్ లిస్టులు ప్రకటించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. తద్వారా అర్హులైన విద్యార్థులు సీట్లు పొందకుంటే వారు యూనివర్శిటీకి తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు.
ఇటీవల ముగిసిన గవర్నమెంట్ కోటా ఎంబిబిఎస్ ప్రవేశాల జాబితాల ప్రకటన తుదిదశలో కొందరు విద్యార్థులు తమకన్నా నీట్ (NEET) పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయించారని అభ్యంతరాలు తెలిపారు. దానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించి విశ్వవిద్యాలయ అధికారులు తగు సవరణలు చేయటం జరిగింది. తత్ఫలితంగా సీట్లు పొందినట్లుగా ప్రకటించబడిన వారు ప్రవేశార్హత కోల్పోయి నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాలు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి రాగా, నివారణోపాయంగా మొదట ప్రొవిజనల్ జాబితాలు ప్రకటించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిశీలించిన తర్వాతే తుది జాబితాలను విడుదల చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలను స్వీకరించడానికి తగు సమయం ఇవ్వాలని కూడా మంత్రి ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో ప్రస్తుతం జరుగుతున్న పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మొదటగా ప్రొవిజనల్ జాబితాలు ప్రకటిస్తుంది. బిడిఎస్, ఇతర కోర్సుల ప్రవేశాలకు కూడా ఈ విధానాన్ని అవలంబిస్తారు.
