రైతు, విద్య, ప్రాజెక్టుల... సమస్యలతో మగ్గుతున్న తెలంగాణ
రైతు, విద్య, ప్రాజెక్టుల... సమస్యలతో మగ్గుతున్న తెలంగాణ
– జాగృతి బాటలో కవిత ఆగ్రహ ఫైర్
ఆదిలాబాద్, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రారంభించిన “జాగృతి జనం బాట” కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. “సామాజిక తెలంగాణ సాధన మా లక్ష్యం. మా అజెండాను నచ్చిన వాళ్లూ, నచ్చని వాళ్లూ స్వాగతం” అని కవిత స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, పత్తి రైతుల దుస్థితి చూసి మనసు కలచుకుపోయిందని చెప్పారు. మొంథా తుపాను ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా, ప్రజా ప్రతినిధులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తేమ శాతం పేరుతో రైతులను దోచుకోవద్దని హెచ్చరిస్తూ, కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. “రైతును విస్మరించే రాజ్యం ఎప్పుడూ బాగుండదు” అని కవిత వ్యాఖ్యానించారు.
విద్యా రంగం పరిస్థితిని కవిత తీవ్రమైన పదజాలంలో విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు బంద్ చేస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెడుతున్న ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. “కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు… కానీ పేద విద్యార్థులకు ఫీజు ఇచ్చేది లేదు. విద్య లేకుండా పేదలను నాశనం చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం తన వంతు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పలు ఉదాహరణలు చూపిస్తూ కవిత ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులపై సీరియస్‌గా ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా చనాఖా–కొరటా ప్రాజెక్ట్ వ్యయం 300 కోట్ల నుంచి 2 వేల కోట్లకు ఎలా పెరిగిందో బీఆర్ఎస్ వివరించాలని డిమాండ్ చేశారు. ఇంకా 10% పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని, మహారాష్ట్రతో సమన్వయం చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరారు. అలాగే ఐటీ టవర్, రైల్వే బ్రిడ్జిలు, వెల్ఫేర్ స్కూల్, టూరిజం అభివృద్ధి, ఎయిర్‌పోర్ట్ భూమి వివాదం తదితర సమస్యలను ఒకదాని వెంట ఒకటి లిస్ట్ చేశారు.
“జాగృతి బలోపేతం చేసి ప్రజల సమస్యలు తీర్చేలా పోరాటం చేస్తాం. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను… నాలుగు నెలలు ప్రజల మధ్య గడిపిన తర్వాతే నిర్ణయం” అని కవిత వ్యాఖ్యానించారు. జనం బాట ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కదిలే వరకు జాగృతి వాయిస్ వినిపిస్తూనే ఉంటుందన్నారు.
