బ్యాంకు రుణాలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలి
బ్యాంకు రుణాలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలి
- ఎస్.హెచ్.జీ మహిళలను పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ) పని తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షా సమావేశం.
- రూ.16 వేల 846 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మంజూరు, తదితర అంశాలపై సమీక్షా సమావేశం
అమరావతి: 21నవంబర్2025: స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి అవసరమైన బ్యాంకు రుణాలను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం విజయవాడ సెర్ప్ కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ల ఏర్పాటుపై అధికారులతో మంత్రి చర్చించారు. రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు వాసన్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలపై సమీక్షించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘ సభ్యులను మహిళా వ్యవస్తాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, కొత్త సంస్థల ఏర్పాటుపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 578.08 కోట్లతో,39 వేల 371 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు వ్యాపార సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయగా, మిగిలిన లక్ష్యాలను వచ్చే ఏడాది మార్చ్ లోగా సాధించాలని అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశా నిర్దేశం చేశారు.
బ్యాంకుల ద్వారా ఈ ఆర్ధిక ఏడాదిలో ఇప్పటి వరకు రూ.16,846 కోట్ల రుణాలు ఇవ్వగా, మార్చి 2026 లోగా రూ. 32 వేల 322 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెర్ప్ ద్వారా 520 ఎఫ్పీవో (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు)లు ఏర్పాటు చేయగా, హైఫర్ ఇంటర్నేషనల్, వాసన్, కాల్గుడి, బ్రెడ్స్ సంస్థల సహకారంతో రైతు ఉత్పత్తి సంస్థలు బలోపేతం చేసి, రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అందించి, రైతులు పండించిన పంటలను, ఎఫ్పీఓ ద్వారా సేకరించి, పంటలను ప్రాసెస్ చేసి, బహిరంగ మార్కెట్ లో విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదాయం పెంచే విధంగా పని చేయాలని సూచించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఈ ఆర్ధిక ఏడాదిలో 175 కోట్ల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుపరుచుటకై మంజూరు చేయడం జరిగిందని, సామాజిక పెట్టుబడి నిధి రుణాలు మంజూరు మరియు తిరిగి చెల్లింపు సహా అన్ని వివరాలను ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేపట్టినందుకు గానూ అధికారులను మంత్రి అభినందించారు. స్వయం సహాయక సంఘ మహిళలను వ్యవస్తాపకులుగా తయారు చేయడానికై, ఐఐఎం విశాఖపట్నంను ఇన్క్యుబేషన్ సెంటర్ గా భారత ప్రభుత్వం గుర్తించిన నేపధ్యంలో, 150 మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు, శాఖా పరంగా అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ, డిప్యూటి సీఈఓ శ్రీరాముల నాయుడు, స్త్రీనిధి ఎండీ హరిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
