సంక్షేమ పింఛన్ల అమలులో దేశంలోనే ఏపీ తొలి స్థానం
సంక్షేమ పింఛన్ల అమలులో దేశంలోనే ఏపీ తొలి స్థానం
- కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పెన్షన్లకు రూ.34 వేల కోట్లు ఖర్చు
- గత ప్రభుత్వంలో ఒక్క స్పౌజ్ పెన్షన్ కూడా ఇవ్వలేదు
- కూటమి ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను రాయితీతో అందిస్తోంది
- -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేందుకే రూ.34 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం, మైలవరం గ్రామ పంచాయితీ పరిధిలోని ఏలేశ్వరపాలెంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సంక్షేమ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా... సచివాలయ సిబ్బంది సరిగా ఇస్తున్నారా అంటూ ప్రజల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్ష ఎనిమిది వేల స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసినట్లు వివరించారు.
సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ గా సీఎం చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సుమారు 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మైలవరం గ్రామ పంచాయితీ పరిధిలో ఒక రైతుకు సబ్సిడీపై ట్రాక్టర్ ను ఈ సందర్భంగా అందజేశారు. అన్నదాతకు ఉపయుక్తంగా ఉండాలని 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు అయితే 100 శాతం సబ్సిడీతో కొన్ని వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపితే., కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధాన్యం కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో మరింత మెరుగైన విద్య....
అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సైకిళ్లను ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు సైకిళ్లను అందించడంలో ఆర్థిక సహాయం చేసిన NREDCAP, ASSIST సంస్థలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ASSIST సేవా సంస్థ అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా సైకిళ్ల పంపిణీకి ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. సైకిళ్ల పంపిణీ సందర్భంగా విద్యార్థులతో మంత్రి గొట్టిపాటి ముచ్చటించారు. ప్రైవేటు విద్యకు ధీటుగా, డిఎస్సీ ద్వారా 16,300 మంది వెల్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయలను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామని ఆయన తెలిపారు. విద్యార్థులు అందరూ కష్ట పడి చదవాలన్నారు. ఉద్యోగాల కోసం పోటీతత్వం పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అందరూ 500 పైగా మార్కులు తెచ్చుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు రావడం కోసమే, అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 5,300 మందికి పైగా ఉచితంగా సైకిళ్లను అందించామని మంత్రి తెలిపారు.
మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజనం...
విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా అందిస్తామని మంత్రి గొట్టపాటి స్పష్టం చేశారు. మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆహారం మరింత నాణ్యంగా ఉండాలని మధ్యాహ్న భోజన పథక నిర్వహకులకు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. భోజన నాణ్యతను విద్యార్థుల తల్లిదండ్రులూ పరిశీలించాలని వారికి సూచించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కూటమి నేతలతో పాటు, సైకిళ్ల పంపిణీలో విద్యార్థుల తల్లిదండ్రలు పాల్గొన్నారు.
