రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ 

  • డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయ
  • ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు
  • సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు
  • నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు
  • ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి
  • ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నాము 
  • చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  



‘రాష్ట్రంలో 70 శాతం గ్రామాలే ఉన్నాయి. గ్రామీణ ప్రజానీకానికి పాలనా పరంగా సులభంగా, సత్వరంగా సేవలందించాలనేది ప్రధానం. ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు, అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు పారదర్శకంగా అందించడానికి డివిజనల్ డవలప్మెంట్ (డీడీఓ) కార్యాలయాలు వారధిలా పని చేస్తాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  చెప్పారు. పాలనను సులభతరం చేసేలా, క్షేత్రస్థాయిలో వేగంగా కార్యకలాపాలు నిర్వహించేలా ఈ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ఒకేసారి రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం శుభ సంకేతమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేలా, నూతన మార్పులతో జీవో నంబరు 57, 58ను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్  అయ్యన్నపాత్రుడు , తెనాలి నుంచి మంత్రి  నాదెండ్ల మనోహర్, ఆత్మకూరు నుంచి మంత్రి  ఆనం రాంనారాయణరెడ్డి , టెక్కలి నుంచి మంత్రి  కింజారపు అచ్చెన్నాయుడు , పెనుకొండ నుంచి మంత్రి  సవిత , పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ... ‘‘గాధీజీ మాటలే స్ఫూర్తిగా గ్రామాలను పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజా పాలనకు అనుగుణంగా సంస్కరణలు తెస్తున్నాం. గత అయిదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన అన్ని పరిణామాలను మదింపు చేసి, అందరూ మెచ్చేలా సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం. ఏళ్ల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు నోచుకోని సిబ్బందికి కూడా ఊరట నిస్తుంది. 

• స్థాయిని పెంచి.. సేవలను విస్తరించే వ్యూహం

డీడీఓ కార్యాలయాల్లో ఆర్.డి.ఒ. స్థాయి అధికారిని నియమిస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం జిల్లా పంచాయతీరాజ్ అధికారి పరిధిలోనే అన్ని జరిగేవి. ఇప్పుడు స్థాయిని పెంచి, సేవల విస్తృతిని పెంచుతున్నాం. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు ఈ కార్యాలయం నుంచే సేవలందిస్తారు. పౌర సేవలు విస్తృతం చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ.. స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలన్నదే లక్ష్యం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో చేపట్టిన ఈ సంస్కరణలతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు బలంగా పని చేస్తాయి.   

• పదోన్నతుల్లో నాన్న జీవితమే నాకు స్ఫూర్తి 

నాన్న ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి రావడానికి ఏళ్ల సమయం పట్టింది. పంచాయతీరాజ్ పరిధిలోనూ దశాబ్దాలుగా పదోన్నతులు లేవని నేను శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తి పారదర్శకతను పాటిస్తూ పదోన్నతులు కల్పించే బాధ్యతను తీసుకున్నాం. సుమారు 10 వేల మందికి రాజకీయాలకు అతీతంగా, సిఫార్సులు, ఒత్తిళ్లు లేకుండా పదోన్నతులు కల్పించాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వి.ఏ.ఒ.గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు వి.ఏ.ఒ.గానే రిటైర్ అయిన సందర్భాలున్నాయి. గ్రూప్ -1 ద్వారా ఎం.పి.డి.ఒ. గా నియమితులైన వారు ఏళ్ల తరబడి పదోన్నతి లేకుండా ఉండేవారు. సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎటువంటి పదోన్నతికి నోచుకోక అధికారుల్లో నిర్లిప్తత ఉండేది. దీనిని పోగొట్టడానికి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చాం. 

• ప్రజలతో మమేకం కావడం సులభం అవుతుంది

మినీ కలెక్టరేట్లుగా డీడీఓ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం చాలా సులభం అవుతుంది. కింది స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వం ఆదేశాలను త్వరితిగతిన క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అధికారులు ప్రజలకు మధ్య మరింత దగ్గర సంబంధాలు ఏర్పడతాయి. ఇది పాలన పరంగానే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.   

 ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. అక్కడి నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించే విధిని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల పాలనలో పలు సంస్కరణలు తీసుకువస్తున్నాము. అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పాలన వ్యవహారాలను సంస్కరించాం. 

• గ్రామ పాలన మరింత పటిష్టం

ప్రతి డివిజన్లో డవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. తద్వారా మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చడం ద్వారా పంచాయతీలకు స్వయం నిర్ణయం అధికారం వస్తుంది. అన్ని పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం పాలన సులభం అవుతుంది. 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ ను పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం ద్వారా అధికారుల బాధ్యత పెరుగుతుంది.

• పంచాయతీల పటిష్టతకు ఐ.టి. వింగ్ 

ఇప్పుడున్న అయిదు గ్రేడ్ల పంచాయతీ సెక్రటరీలను మూడు గ్రేడ్లుగా తగ్గించడం వల్ల పాలనా సౌలభ్యం జరుగుతుంది. పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లయ్ వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ , రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీల్లో ఏ విభాగం బాధ్యతలు ఆ విభాగానికి ప్రత్యేకంగా ఉంటాయి. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐ.టి. వింగ్ ఏర్పాటు చేశాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను అధికారులు, సిబ్బంది అందిపుచ్చుకోవాలి. ప్రజలకు పాలన మరింత చేరువ అయ్యేలా, వారి మన్ననలు చూరగొనేలా పని చేయాల’’న్నారు. 

• ఇదో విప్లవాత్మక నిర్ణయం :  అయ్యన్నపాత్రుడు , శాసనసభ స్పీకర్

పంచాయతీరాజ్ వ్యవస్థ ఏళ్ల తరబడి ఒకే రకంగా ఉండిపోయింది. దీనివల్ల మారుతున్న కాలానికి తగినట్టుగా సేవలు ప్రజలకు అందడం లేదు. దీన్ని కొత్త తరహాలో తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆలోచన అద్భుతం. పదోన్నతులు పారదర్శకంగా ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

• సంస్కరణలు అందిపుచ్చుకోవాలి :  నాదెండ్ల మనోహర్ , పౌర సరఫరాల శాఖ మంత్రి

పంచాయతీరాజ్ పాలనలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలను అందిపుచ్చుకోవాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి. ఈ సంస్కరణలతో పంచాయతీరాజ్ వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కి, ప్రజలకు మరింత చేరువ అవుతుంది. 

• ప్రత్యేక భవనాలను నిర్మించే ఆలోచన చేయాలి :  ఆనం రాంనారాయణ రెడ్డి , దేవాదాయశాఖ మంత్రి

ఇదో సరికొత్త చరిత్రకు నాంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పదోన్నతులకు  పవన్ కళ్యాణ్  పచ్చ జెండా ఊపారు. దీంతో వేలాది మందికి ఊరట కలుగుతుంది. అలాగే డీడీఓ కార్యాలయాలకు కూడా భవనాలు నిర్మిస్తే అత్యుత్తమంగా ఉంటుంది. 

• విభిన్నమైన ఆలోచన.. ఉత్తమ సంస్కరణ :  కింజరాపు అచ్చెన్నాయుడు , వ్యవసాయశాఖ మంత్రి

ఇటు అధికారులు, సిబ్బందికి తగిన పదోన్నతులు ఇచ్చి, వ్యవస్థల్లోనూ మార్పు తీసుకొచ్చే ఆలోచన అత్యున్నతమైంది. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఎల్లపుడూ ప్రయత్నం చేస్తుంటుంది.  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  నిరంతరం దీనిపై మదింపు చేయడం శుభపరిణామం. 

• సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారు :  సవిత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి 

పదోన్నతుల విషయంలో పంచాయతీరాజ్ సిబ్బంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఉత్సాహంతో అంతా కొత్త వ్యవస్థలో మరింత బాగా పనిచేయాలి. ప్రత్యేకంగా కార్యాలయాలు నిర్మించే ఏర్పాటు చేస్తే మినీ కలెక్టరేట్ లుగా ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కలికిరి మురళీ మోహన్,  ఆరణి శ్రీనివాసులు,  అరవ శ్రీధర్, చిత్తూరు మేయర్ ఎస్.అముద, చుడా ఛైర్మన్  కటారి హేమలత, పంచాయతీరాజ్ కమిషనర్  కృష్ణతేజ, కలెక్టర్  సుమిత్ కుమార్, చిత్తూరు ఎస్పీ  తుషార్ దూడీ, హస్త కళల కార్పొరేషన్ ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

• వినతులు స్వీకరణ 

చిత్తూరు పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి గురువారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయానికి వెలుపల ప్రజల నుంచి నేరుగా  పవన్ కళ్యాణ్  వినతులు స్వీకరించారు.

Comments

-Advertisement-