రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ బెదిరింపులకు పాల్పడేవారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ బెదిరింపులకు పాల్పడేవారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్

• రాజకీయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు

• రాజకీయాల కోసం చదువుకొనే పిల్లల మధ్య కులాల చిచ్చుపెడతారా?

• రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చే పథకం ‘అమరజీవి జలధార’

• రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల్లో జల జీవన్ పనులు

• గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నిధుల విడుదలకు జాప్యం

• పెరవలిలో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అడ్డుపడేలా, పనులు చేపట్టే కాంట్రాక్టర్లను గత పాలకులు భయపెడుతున్నారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. జైల్లో పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. అలా బెదిరింపులకి దిగే రౌడీలు, గూండాలకు  యోగి ఆదిత్యనాథ్  ట్రీట్మెంట్ ఇవ్వాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రౌడీయిజం పేరు ఎత్తితే కీళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన భావజాలం కలిగిన నక్సలిజమే కకావికలం అయిపోయిందని, బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలపై బలమైన రాజకీయ నిర్ణయం తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. గీతదాటి మాట్లాడతాము అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామని గట్టిగా చెప్పారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గం, పెరవలిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ. 3,050 కోట్ల అంచనా వ్యయంతో జల జీవన్ మిషన్ నిధులతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  శ్రీనివాస వర్మ , రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి  కందుల దుర్గేష్ , ఉప సభాపతి  రఘురామ కృష్ణంరాజు గారు, సమాచార శాఖ మంత్రి  కె.పార్థసారధి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ బెదిరింపులకు భయపడలేదు. ఇప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడుతూ చంపేస్తాం, మళ్లీ మేము వస్తామని అంటున్నారు. పిఠాపురంలో చదువుకొనే చిన్న పిల్లల మధ్య కులాలు తీసుకువస్తున్నారు అంటే వాళ్ళ దిగజారుడుతనం గురించి ఏం మాట్లాడతాం. పిల్లలకు కులాలు ఆపాదిస్తామా? రాజకీయాలు చేయడానికి వేరే దారి లేదా? అలా చేసే వారికి సిగ్గు ఉందా? ఎవరి అండదండలు లేకుండా పార్టీ పెట్టి ఇక్కడకు వచ్చామంటే మాకు ఎంత నిబద్దత ఉండాలి? మొన్నటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పాం. దందాలు, గూండాగిరి చేసేవారిని ఉపేక్షించవద్దు అని.

• అమరజీవి జలధారతో అందరికీ తాగు నీరు

పొట్టి శ్రీరాములు  56 రోజులు కడుపు కాల్చుకుని, దీక్ష పూని ప్రాణత్యాగం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఏ ఒక్కరూ మాట్లాడలేదు. అమరజీవి జలధార వస్తే ఒక్క కులానికే నీరు వస్తాయా? అందరికీ తాగు నీరు అందుతుంది. నేను పది వేల మందికి పారదర్శకంగా ప్రమోషన్లు ఇచ్చామంటే వాళ్లంతా నాకులం వారని ఇచ్చానా? లంచం అనే మాట లేకుండా పది వేల మందికి పైగా పదోన్నతులు కల్పించాం. గత ప్రభుత్వంలో ఒక్కో దానికి ఒక్కో రేటు కార్డు ఉండేది. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం నన్ను నేను తగ్గించుకోకపోతే రూ. 3, 500 కోట్లతో పల్లె పండగ పనులు పూర్తి చేసే వాళ్లమా? 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, లక్ష ఫారం పాండ్లు, 22,500 మినీ గోకులాలు నిర్మించగలిగే వాళ్లమా? 10 వేల ఎకరాలలో ఉద్యానవన పంటలు పండేవా? 8 వేల కిలోమీటర్లు బీటీ, సీసీ రోడ్లు వస్తాయా? అభివృద్ధి పనులు చేస్తున్నామంటే.. నేను తగ్గి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పెంచుతున్నాను. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ‘అమరజీవి జలధార’ ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలు కలిపేలా ఈ ప్రాజెక్ట్ ఉంది. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.

• అమరజీవిని స్మరించుకోవాలి

అమరజీవి జలధార అని పెట్టడానికి కారణం ఉంది. తెలుగువాడి ఉనికి లేని రోజుల్లో, మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వారిని గుల్టీలుగా సంబోధించే సమయంలో తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. మనం బలి దానాలను తేలిగ్గా తీసుకుంటాం. మన కోసం ప్రాణాలు విడిచిన  పొట్టి శ్రీరాములు  గురించి తెలుసుకోవాలి. ఒకసారి పొట్టి శ్రీరాములు  జయంతికి దండ వేద్దామంటే ఆయన విగ్రహం ఎక్కడా లేదు. ఎక్కడో ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉందని ఎవరో చెప్పారు. ఆయన ఆర్య వైశ్య కులానికి చెందిన వారు అందుకే అక్కడే ఆయన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయని చెబితే నాకు బాధ కలిగింది. గొప్ప నాయకుణ్ణి ఒక కులానికి పరిమితం చేస్తారా? తెలుగు జాతి ఆత్మగౌరవం అని మాట్లాడుకోవడానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మా తండ్రి  స్నేహితులు  కంబాల కృష్ణమూర్తి  రాసిన అమృతవాక్కులులో ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ  గురించి నాలుగు లైన్లు రాశారు. అది చదివిన తర్వాత మనసులో ఉండిపోయింది. మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరుపెట్టాము. 

• తాగే నీటి సాక్షిగా చెబుతున్నా...

నేను  పొట్టి శ్రీరాములు ని, బూర్గుల రామకృష్ణారావు ని,  చంద్రశేఖర్ ఆజాద్ ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ ని ఆరాధించలేదు. దోపిడి చేసే వారిని దగా చేసే వారిని ఆరాధించలేదు. హక్కుల కోసం పోరాడే వారిని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి సీట్లు విషయంలో తగ్గితే రకరకాలుగా తిట్టారు. ఒకరు పార్టీని అమ్మేశానంటారు. దిగజారిపోయానని ఒకరు. ఎవరెన్ని అన్నా నేను తాగే నీటి సాక్షిగా, ఈ అమరజీవి జలధార సాక్షిగా చెబుతున్నా.రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలనే నేను తగ్గాను. 

మన చిన్నప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని ఊహించామా? గోదావరి పారే ఈ నేలలో తాగునీటికి సమస్య అస్సలు ఊహించలేదు. పోరాట యాత్రలో భాగంగా భీమవరం వెళ్లినప్పుడు బాత్ రూంలో నీరు చూస్తే పసుపు రంగులో ఉన్నాయి. నీరు కాచి వడకొట్టుకుని తాగాలన్నారు. భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి. ఆక్వా కాలుష్యానికి భూగర్భ జలాలు పాడైపోయాయి. ఈ రోజున వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాం. నీరు కలుషితం కాకుండా ఉంటే ఈ నిధులు మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడేవి. నీరు కలుషితం అయిపోయి, ప్రకృతి వనరులను చంపేసుకుని డబ్బు ఇలా ఖర్చు పెట్టడం బాధ కలిగిస్తుంది. 

• జల జీవన్ మిషన్ లక్ష్యాలకు గత పాలకులు పాతరేశారు

ఈ రోజు ఈ ప్రాజెక్టుకి ఇన్ని వేల కోట్లు రావడానికి కారణం అయిన  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ఆయన మన గోదావరి జిల్లాల ప్రజలకు శుద్ద జలాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇంత బడ్జెట్ ఇచ్చారు. ఇది జల జీవన్ మిషన్. ఈ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యింది అని ప్రతిపక్షం హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి, వారి పార్టీ మాట్లాడుతున్నారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి , కేంద్ర జల్ శక్తి మంత్రి  సి.ఆర్. పాటిల్ ద్వారా ఒక విషయం తెలియజేశారు.. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల జల జీవన్ మిషన్ నిధులు నిరుపయోగం అయ్యాయి. ప్రతి మనిషికి 55 లీటర్ల చొప్పున తాగు నీరు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చంపేశారు. పైపులు వేశారు. నీటి కనెక్షన్ ఇవ్వలేదు. నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇది మేము ఎందుకు కొనసాగించాలని కేంద్రం నుంచి అడిగారు. వారిని ఒప్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాం. అడవి తల్లిబాట కార్యక్రమాన్ని నిజాయితీగా పూర్తి చేసిన తర్వాత నమ్మకం వచ్చి ఇన్నివేల కోట్లు నిధులు ఇచ్చారు. రూ. 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల రోడ్లకు శ్రీకారం చుట్టాం. ప్రధాన మంత్రి  సహకారం, చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాం.  

• కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు

రాజోలు వెళ్తే శివాలయాన్ని బాగు చేయించాలని అడిగారు. శివాలయం పునర్నిర్మాణానికి నిధులు సమకూరుస్తాము. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు. దర్శనానికి వెళ్తే పూజారులు భక్తుల సౌకర్యార్ధం మండపం నిర్మించేందుకు సహకరించాలని కోరారు. నేను చేస్తానని హామీ ఇచ్చాను. 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేపట్టేలా మండపం, 96 గదులతో సత్రం నిర్మించేందుకు రూ.35.19 కోట్లు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపింది. నిధులు మంజూరు చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కి, నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్  బి.ఆర్. నాయుడు కి, ఈవో, అడిషనల్ ఈవో, టీటీడీ బోర్డు సభ్యులకు ధన్యవాదాలు” అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు  పిడుగు హరిప్రసాద్,  బొమ్మడి నాయకర్,  బొలిశెట్టి శ్రీనివాస్, పీఆర్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి  శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ. తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-