ఖాకీ… సమాజానికి రక్షణ కవచం
ఖాకీ… సమాజానికి రక్షణ కవచం
• కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది
• మీ గౌరవాన్ని ఎవరి ముందూ తగ్గించుకోవద్దు
• శాంతి భద్రతలను పరిరక్షించే మీరు… రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఓ చోదక శక్తి
• సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మీరంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
• గత ప్రభుత్వ నిర్వాకంతో మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు
• కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామకాలు చేపట్టింది
• మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు
• పోలీసులని బెదిరించేవారిని ఉపేక్షించం
• మీరు ప్రజలకు రక్షణ కల్పించండి.. అండగా మేము ఉంటాం
• కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది. మీరు లేకపోతే పోలీస్ వ్యవస్థకు జీవం లేదు. ధైర్యమూ ఉండదు. మీ ఒంటిపై ఉన్న ఖాకీ డ్రస్సు కనబడితే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఖాకీ… సమాజానికి రక్షణ కవచం వంటిది. అలాంటి ఖాకీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సూచించారు. శాంతిభద్రతలపైనే దేశాభివృద్ధి అయినా, రాష్ట్రాభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి శాంతిభద్రతలను పరిరక్షించే మీరు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు చోదక శక్తులన్నారు. నియామక పత్రాలు స్వీకరించిన కానిస్టేబుళ్లంతా శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి. 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తో కలిసి కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రదానం కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి తో కలిసి శిక్షణకు ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పాలనలో సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం నిలబడతామని మాటిచ్చాం. మేము అధికారంలోకి వచ్చేనాటికి అవినీతి వ్యవస్థీకృతమై ఉంది. వ్యవస్థీకృతమైన అవినీతిని పారదోలేందుకు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి.. పంచాయతీరాజ్ శాఖలో పది వేల పైచిలుకు ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. చంద్రబాబు నాయుడు దార్శనికత, సలహాలు, సూచనలతోనే అత్యతం పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగాం. అదే కోవలో ఈ రోజున ఆరు వేల మందికి ఒకేసారి నియామక పత్రాలు అందిస్తున్నాం. వీరంతా నియామక పత్రాలు అందక మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు.
• మా దృఢ సంకల్పం.. నిబద్దతకు ఈ నియామకాలే నిదర్శనం
గత పాలకులు 2022లోనే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులు తొలగించడం ఎలా అనే కనీస ఆలోచన చేయలేదు. అర్హత ఉన్నా.. ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన మూడేళ్ల కాలం మీ జీవితంలోగాని, మీ సర్వీసులోగాని ఎంతో విలువైనది. మీరు కోల్పోయిన మూడున్నరేళ్ల కాలాన్ని తిరిగి ఇవ్వలేంగానీ.. ముఖ్యమంత్రి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీకు అండగా మేమున్నామన్న భరోసా ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశాం. ఈ రోజున ఒకేసారి ఇంత మందికి నియామక పత్రాలు అందజేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే... 6,014 మంది ఎంపిక కాగా, 5,757 మంది ఫిట్నెస్ పరీక్ష దాటి శిక్షణకు అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం ఆనందంగా ఉంది. క్లిష్ట పరిస్థితులకు ఎదురునిలిచి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరినీ ప్రత్యేకంగా సత్కరించాలి. ఒక్కొక్కరిలో నాకు ఒక్కో ఝాన్సీ రాణి కనిపించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి హోంశాఖ మంత్రి, సోదరి వంగలపూడి అనిత గారి కృషి, పట్టుదల అభినందనీయం.
• సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించండి
ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారితో 4,051 మంది అంటే సుమారు 67 శాతం ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. అందులో 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే, 2,941 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 314 మంది పీజీ, పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చేసి కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మీ సాంకేతిక నైపుణ్యం సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపయోగపడాలి. ఈ నెల 22వ తేదీ నుండి సుమారు 9 నెలల పాటు మీకు నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీస్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తీవ్రవాద సానుభూతిపరుల జాడలు బయటపడుతున్నాయి.
- గత ప్రభుత్వ పాలనలో బెట్టింగులు… డ్రగ్స్ గ్రామాలకు చేరిపోయాయి
గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగులు, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయాయి. సైబర్ మోసాలు మితిమీరిపోయాయి. ఈ మోసాలకు అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి.
కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకు పిల్లర్ లాంటి ఉద్యోగం. మా నాన్న కూడా కానిస్టేబుల్ గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పనిలో నిబద్దతతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో బలంగా ఉండేవి. కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తెచ్చుకుని పోలీస్ అధికారి స్థాయికి వచ్చారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా కుటుంబాన్ని సాకారు. మమ్మల్ని చదివించారు. విలువలతో నిండిన ఆయన ప్రస్థానం నుంచే నేను స్ఫూర్తి పొందాను. మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వాలి అన్న ఆయన ఆలోచనల ప్రభావం నాపై ఎంతో ఉంది. ఆయనలోని సోషలిజం భావాలు కష్టంలో ఉన్న వారికి తోడు నిలవమని నేర్పాయి. ఈ రోజున నేనూ మీలో ఒకడిగానే మాట్లాడుతున్నాను.
• మీ విజయ గాథలు నన్ను కదిలించాయి
కానిస్టేబుల్ గా ఎంపికైన ఒక్కొక్కరి విజయ గాథలు నన్ను ఎంతో కదిలించాయి. ఇక్కడ ఉన్న ఆరు వేల మంది వెనుకా ఒక్కో కథ, ఒక్కో కష్టం ఉన్నాయి. నాకు ఊహ తెలిసే నాటికే మా నాన్న పెట్టీ ఆఫీసర్. ఆయనకు వచ్చే ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండగ వాతావరణాన్ని తెచ్చేది. మేము కూడా ఆయన ఎప్పుడు ఎస్సై అవుతారు. ఎప్పుడు సి.ఐ. అవుతారు అని ఎదరు చూసేవాళ్లం. ఆయన డిపార్ట్మెంటల్ పరీక్షలు రాస్తూ ఒక్కో మెట్టూ ఎక్కారు. మీకు డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉంటాయి. మీరూ మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకొంటున్నాను. ఖాకీ ఉద్యోగం బాధ్యతతో కూడిన ఉద్యోగం. బాధ్యతతో కూడిన ఈ ఉద్యోగాలు చేసేందుకు అంతా భయపడతారు. మీరు సమాజం కోసం ఎదురొచ్చి మరీ సేవ చేస్తున్నారు. కోట్లాది మంది జనానికి ధైర్యం ఇస్తున్నారు.
• శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు
పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, వారి హక్కులకు భంగం వాటిల్లినా, అన్యాయం జరిగినా మొదట గుర్తుకు వచ్చేది పోలీసులే. శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటాయి. మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15 శాతం ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని మాకు చెబుతూ ఉంటారు. శాంతి భద్రతలు బలంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజున లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ శాంతి భద్రతల విషయంలో బలంగా ఉండటమే .
న్యాయం కోరి వచ్చిన వారికి మన ప్రవర్తన ఓదార్పుని ఇవ్వాలి. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కి వెళ్తే పోలీసులు ఇబ్బందిపెడతారేమో అన్న భావన ప్రజల నుంచి పోవాలి. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. ఇలాంటి వ్యవస్థల్లో మార్పు తెచ్చేందుకు మేము బలంగా నిలబడతాం. అందుకు మీ నుంచి సంపూర్ణ మద్దతు కోరుకుంటున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులను బెదిరించినా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా బలంగా తీసుకుంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు అండగా ఉండండి. మీకు మేము అండగా ఉంటాం.
• శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం
కూటమి ప్రభుత్వం ప్రజల మానప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం. కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడం. కొత్త కానిస్టేబుళ్లంతా అదే పంధాను అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి” అన్నారు.
