గ్యాస్ సిలిండర్ల పంపిణీలో వినియోగదారుల నుండి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు
గ్యాస్ సిలిండర్ల పంపిణీలో వినియోగదారుల నుండి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు
- గ్యాస్ ఏజెన్సీలు తమ డెలివరీ బాయ్స్‌కు వినియోగదారులతో ఎలా ప్రవర్తించాలి, అదనపు వసూలు చేయకుండా క కౌన్సెలింగ్ ఇవ్వాలి
- జిల్లాలో గ్యాస్ డెలివరీ సేవలపై కనీసం 80% సానుకూల (Positive) స్పందన రావాలి
- సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గోవింద రావు
కర్నూలు, జనవరి 09:- గ్యాస్ సిలిండర్ల పంపిణీలో వినియోగదారుల నుండి గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గోవింద రావు గ్యాస్ ఏజెన్సీ ల యాజమాన్యాలను ఆదేశించారు..
శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో దీపం - 2 పథకం అమలు, ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ అంశాల పై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గోవింద రావు సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారుల నుండి డెలివరీ బాయ్స్ అదనపు వసూలు చేస్తున్నారా, గ్యాస్ వినియోగదారుల పట్ల డెలివరీ బాయ్స్ ప్రవర్తన ఏ విధంగా ఉందనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి తీసుకున్న ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ లో కర్నూలు జిల్లా వెనుకబడి ఉందన్నారు. విషయాన్ని గ్యాస్ ఏజెన్సీ వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.. గ్యాస్ వినియోగదారుల పట్ల డెలివరీ బాయ్స్ ప్రవర్తన బాగుండాలని, అదనపు వసూలు చేయకుండా ఉండాలని జిల్లాలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ వారందరు వారి పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ లకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్యాస్ సిలిండర్ల పంపిణీలో వినియోగదారుల నుండి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదన్నారు. ఒకవేళ అదే విధంగా మరల వసూలు చేసి, ఫీడ్‌బ్యాక్ ఇదే విధంగా నెగటివ్ వచ్చినట్లయితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు.ఈ అంశంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉందన్నారు. నిబంధనల ప్రకారం 15 కిలోమీటర్ల లోపే గ్యాస్ సిలిండర్ ల పంపిణీ జరగాలని, ఒకవేళ అదనపు దూరం ఉంటే ఆ భారాన్ని డిస్ట్రిబ్యూటర్లే భరించాలి తప్ప వినియోగదారులపై వేయకూడదని తేల్చి చెప్పారు.
చాలా మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తమ సిబ్బందికి సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదని, ఆటో చార్జీలు, ఫ్యూయల్ (ఇంధనం), రెంట్ వంటి ఖర్చులను డిస్ట్రిబ్యూటర్లు భరించడం లేదని, డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న డబ్బులో డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ అడుగుతున్నారనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన వెల్లడించారు.. వాటిని సరిచేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు... భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఓఎంసీ (OMC) కంపెనీలకు వినియోగదారులే ముఖ్యమన్నారు.. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని డైరెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో పన్ను చెల్లింపుదారులే (Tax payers) అత్యంత ముఖ్యమని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 'దీపం-2' పథకం కింద అర్హులైన నిరుపేదలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ఇప్పటికే 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు.. ప్రభుత్వం ఒక గ్యాస్ సిలిండర్‌పై ఏజెన్సీలకు సుమారు 73.08 రూపాయలు (డెలివరీ ఛార్జీలు రూ. 33.43 మరియు ఎస్టాబ్లిష్‌మెంట్ ఛార్జీలు రూ. 39.65 కలిపి) చెల్లిస్తోందని ఆయన వివరించారు.. ప్రభుత్వం ఛార్జీలు చెల్లిస్తున్నప్పుడు, గ్యాస్ డెలివరీ చేసే సమయంలో ప్రజల నుండి అదనంగా 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని డైరెక్టర్ గ్యాస్ ఏజెన్సీలను నిలదీశారు...
జూన్ 2024 నుండి మే 2025 వరకు డెలివరీ బాయ్స్ ప్రవర్తన బాగుందని 74.7% మంది అభిప్రాయపడ్డారన్నారు.
ఈ శాతం క్రమంగా పెరుగుతూ జనవరి 2026 నాటికి 83.5% కి చేరుకుందన్నారు..డెలివరీ బాయ్స్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చిందని డైరెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా "అదనపు డబ్బులు అడగలేదు" అని చెప్పిన వారి సంఖ్య ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదన్నారు.
జూన్ 2024లో ఇది 37.3% ఉండగా, డిసెంబర్ 2025 నాటికి 39.7% కి పెరిగింది (అంటే ఎక్కువ మంది అదనపు డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు). జనవరి 2026లో ఈ ఫిర్యాదులు స్వల్పంగా (1.4%) తగ్గాయన్నారు.
కర్నూలు జిల్లాలో గ్యాస్ డెలివరీకి సంబంధించి ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గాలు ఎక్కువ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. డెలివరీ బాయ్స్ ప్రవర్తన మరియు అదనపు ఛార్జీలు వసూలు చేయడం వల్ల సానుకూలత తగ్గుతోందన్నారు. సిబ్బంది తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, డిస్ట్రిబ్యూటర్లు స్వయంగా వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందన్నారు.. గ్యాస్ డెలివరీ బాయ్స్‌కి తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, అవగాహన కల్పించకపోతే, వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.. మనం ఒకరికొకరు సహకరించుకుంటేనే జిల్లాలో ఉండే లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని, ప్రజలకి అందించే సేవలో ఎటువంటి తేడా ఉండకూడదన్నారు.. ప్రజల దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు... డెలివరీ బాయ్స్ అదనపు డబ్బులు తీసుకోకూడదు, రశీదులో ఎంత ఉందో అంతే డబ్బులు తీసుకోవాలి అదే విధంగా వినియోగదారులతో మంచి ప్రవర్తనతో ఉండాలనే విషయాల పై డెలివరీ బాయ్స్ కి అవగాహన కల్పించాలని కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీ లను ఆదేశించారు.. డిసెంబర్ లో గ్యాస్ ఏజెన్సీ వారందరూ ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారని, ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం తీసుకునే ఫీడ్ బ్యాక్ లో కర్నూలు జిల్లా 5 లేదా 6వ ర్యాంక్ లో ఉంటుందనుకుంటున్నానని కలెక్టర్ తెలిపారు..
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ దీపం 2 పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో చివరి స్థానంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకొని రావాలని అందుకు గాను గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుండి అదనపు వసూలు చేయకూడదని, ప్రవర్తన బాగుండాలని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా రెండు నెలల నుండి అదే స్థానంలో ఉన్నామన్నారు.. ఈసారి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో కర్నూలు జిల్లా పురోగతి సాధించకపోతే సంబంధిత ఏజెన్సీ ల మీద చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు..
సమావేశంలో డిఎస్ఓ ఎం.రాజా రఘువీర్, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

