‘అనగనగా ఒక రాజు’ సెన్సార్ పూర్తి.. నవ్వులతో సంక్రాంతి హిట్‌కు రెడీ
‘అనగనగా ఒక రాజు’ సెన్సార్ పూర్తి.. నవ్వులతో సంక్రాంతి హిట్‌కు రెడీ
టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్లలో ఘనంగా విడుదలకు సిద్ధమైంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా, యువ నిర్మాత నాగవంశీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూ ఏ సర్టిఫికెట్‌ను పొందింది. నవ్వుకు వయసుతో సంబంధం లేదని, ప్రతి వర్గం ప్రేక్షకులు హాయిగా ఆస్వాదించగల చిత్రమని చిత్ర బృందం వెల్లడించింది. సెన్సార్ అనంతరం సినిమా నిడివిని 2 గంటలు 20 నిమిషాలుగా ఖరారు చేశారు.
ఇటీవల విడుదలైన పోస్టర్‌లో నవీన్ పోలిశెట్టి బుల్లెట్ బైక్‌పై కూర్చుని పల్లెటూరి వాతావరణంలో అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించడం ఆకట్టుకుంటోంది. సాధారణ యువకుడి లుక్‌లో చలాకీగా నవ్వుతూ కనిపించిన ఆయనకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, రావు రమేష్, తారక్ పొన్నప్ప, నాగ్ రాజ్ కొట్టు, సాన్వి మేఘన కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, జె యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
వినోదాత్మక పెళ్లి నేపథ్యంలో సాగే ఈ కథ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. వినూత్న ప్రమోషన్లతో చిత్ర బృందం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి సందడిలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
