పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ
పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ
సంక్రాంతులందు గోదారోళ్ళ సంక్రాంతి వేరయా…
కాకినాడ జిల్లా (పీపుల్స్ మోటివేషన్):-
గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ ఇప్పటికే ప్రారంభమైంది గ్రామాల్లో హరిదాసుల ఆలాపనలు, గుమ్మం ముందు గంగిరెద్దుల పలకరింపులు, వాకిట్లో రంగురంగుల ముగ్గులతో ఏడాదికి ఒకసారి వచ్చే పల్లె పండుగ సంక్రాంతి హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పందెం లక్ష రూపాయలు నుంచి ప్రారంభమయ్యే భారీ బరులు (అరెనాలు) 200 నుంచి 250కి పైగా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అంటే ఒక ఎమోషన్. పండుగులందు సంక్రాంతి పండుగ వేరయా అన్న చందంగా నగరాల నుంచి పట్టణాల నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన ఎందరో ఏపీ వాసులు కుటుంబాలతో కలిసి సంక్రాంతికి తమ తమ సొంత ఊళ్లకు తిరిగి వస్తారు.
తమ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుని పొట్టచేతపట్టుకుని తిరుగు పయనమవుతుంటారు. అయితే ఇందులో భాగంగా ఏపీలోని గోదావరి జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఆకర్షణగా మారతాయి, అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.
ముఖ్యంగా హైద్రాబాద్ వంటి మహానగరాల నుంచి సంక్రాంతికి లక్షలాదిమంది ఏపీకి పయనమవుతారు. ఈ సంక్రాంతి కళ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆ సమయంలో విజయవాడ – హైద్రాబాద్ రహదారిలో కనిపించే వాహనాల రద్దీ, టోల్ ప్లాజాల వద్ద కనిపించే భారీ భారీ క్యూ లైన్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.
అయితే ఏపీలో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ సంక్రాంతి సందడి మరి ఎక్కువగా కనిపిస్తుంది. పిండివంటల నుంచి మొదలు పెడితే విందు భోజనాలా వరకు, భోగి మంటల దగ్గర నుంచి మొదలు పెడితే కోట్లలో జరిగే కోడిపందాల వరకు గోదారోళ్ల సంక్రాంతి వేరయా అని చెప్పడంలో అతిశయోక్తే లేదని చెప్పొచ్చు.
ఇక గోదారోళ్ల కొత్త అల్లుళ్ళ కథ వేరే లెవెల్ అనే చెప్పాలి. అత్తంటి వారి మర్యాదలు, బావ మరదళ్ల సరదాలు, థియేటర్ల దగ్గర సందళ్ళు, గోదావరి జిల్లాల స్పెషల్ వంటకాలు ఇలా ఒక్కటేమిటి కోరుకున్నోడికి కోరుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఈ రెండు జిలాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
అలాగే వాటిని కళ్లారా వీక్షించి నేత్రానందం పొందేవారు కొందరైతే, కోడిపందాల పేరుతో లక్షలలో డబ్బులు పోగొట్టుకునే వారు మరికొందరు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ పందాలు కేవలం వినోదానికి మాత్రమే ఉండాలి కానీ వాటితో జంతువుల ప్రాణాలు తీయడానికి వీలులేదు అంటూ షరతులు విధించినప్పటికీ అవి క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు అటు ప్రభుత్వాలు కానీ, ఇటు అధికారులు కానీ సాహసించని పరిస్థితి.ఏదిఏమైనా ఏడాది మొత్తం ఉరుకుల పరుగుల జీవితాలతో, సొంతవారికి కూడా దూరమై బిజీబిజీగా గడుపుతూ అలసిపోయే బతుకులకు ఈ సంక్రాంతి సెలవలు, వాటి వల్ల దొరికే ఆనందం వర్ణనాతీతమనే చెప్పాలి. కార్పొరేట్ నగరాలకు దూరంగా ఇలా పదిరోజులు పల్లె వాతావరణానికి దగ్గరగా ఆత్మీయుల మధ్య ఆప్యాయంగా జరుపుకునే ఈ గోదారోళ్ల సంక్రాంతి ఏడాది మొత్తానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ని అందిస్తుంది అనే చెప్పొచ్చు. (సంక్రాంతి స్పెషల్ స్టోరీ)

