ఓటీటీలోకి శివాజీ ‘దండోరా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఓటీటీలోకి శివాజీ ‘దండోరా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశంతో తెరకెక్కిన దండోరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రచార కార్యక్రమాలతో పాటు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 14 నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించగా మురళీకాంత్ దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే తెలంగాణలోని తుళ్లూరు గ్రామం చుట్టూ కథ సాగుతుంది. ఆ గ్రామంలో కుల వివక్ష బలంగా పాతుకుపోయి ఉంటుంది. తక్కువ కులానికి చెందినవారి అంత్యక్రియలు ఊరికి దూరంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో అగ్రకులానికి చెందిన రైతు శివాజీ అకస్మాత్తుగా మరణిస్తాడు. అయితే అతని శవాన్ని అగ్రకుల స్మశాన వాటికలో దహనం చేయడానికి కుల పెద్దలు అడ్డుతగులుతారు. తన తండ్రికి గౌరవప్రదమైన అంత్యక్రియలు చేయాలనే లక్ష్యంతో కొడుకు విష్ణు, కూతురు సుజాత, ఊరి సర్పంచ్ కలిసి పోరాటం మొదలుపెడతారు. ఈ కుల రాజకీయాల వెనుక ఉన్న కారణాలు, రవి హత్యతో ఉన్న సంబంధం, శివాజీ జీవితాన్ని మార్చిన సంఘటనలు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి.
