మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.. సిటీ ఉద్యోగులకు ఊరట
మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.. సిటీ ఉద్యోగులకు ఊరట
బెంగళూరు – ఫిబ్రవరి 11 – పీపుల్స్ మోటివేషన్
దేశంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే దిశగా ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల అద్దెలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఆర్‌ఏ (HRA) మినహాయింపు పరిమితిని విస్తరించే ప్రతిపాదన ‘డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ – 2026’లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును పొందగలుగుతున్నారు. అయితే టెక్నాలజీ పరంగా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఇంకా నాన్–మెట్రో కేటగిరీలోనే ఉండటంతో అక్కడి ఉద్యోగులు కేవలం 40 శాతం వరకు మాత్రమే మినహాయింపును పొందుతున్నారు.
తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాలను కూడా 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే మధ్యతరగతి ఉద్యోగులకు పన్ను భారం గణనీయంగా తగ్గి, చేతికి వచ్చే జీతం పెరిగే అవకాశం ఉంది.
అయితే ఈ సౌకర్యం కొత్త పన్ను విధానం (New Tax Regime)ను ఎంచుకున్న వారికి వర్తించదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) కింద హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు లభిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా అమలు తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
